వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదాల ఫలితంగా ఆ దేశ జట్టు ఇండియా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని వెళ్లడంతో తాము భారీ లాస్ అయ్యామని… కాబట్టి నష్ట పరిహారం ఇవ్వాలని బీసీసీఐ వెస్టిండీస్ బోర్డును డిమాండ్ చేస్తోంది. లాస్ అయిన మొత్తాన్ని లెక్కపెట్టి మొత్తం 350 కోట్ల రూపాయలు అని బీసీసీఐ తేల్చింది.
మరి అంత డబ్బే ఉంటే.. వెస్టిండీస్ క్రికెట్ లో అసలు సమస్య వచ్చేది కాదు. ఆటగాళ్లకు చెల్లింపుల విషయంలో బోర్డు మంకు పట్టు పట్టేది కాదు. వెస్టిండీస్ క్రికెట్ జట్టు తమ భారత పర్యటనను అర్థాంతరంగా వాయిదా వేసుకొని వెళ్లేదే కాదు! అయితే దేన్నైనా డబ్బుతో కొలవడాన్ని అలవాటు చేసుకొన్న బీసీసీఐ ఇప్పుడు విండీస్ మీద పడింది. తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటోంది.
అసలే అక్కడ క్రికెట్ బోర్డులు దివాళా దశలో ఉన్నాయి. క్రికెట్ కు క్రేజ్ తగ్గిపోయి.. మార్కెటింగ్ అవకాశాలు లేక.. చాలా దేశాల క్రికెట్ బోర్డులు అవస్థలు పడుతున్నాయి. మరి పేదరికం దశలో ఉన్న వెస్టిండీస్ బోర్డు నుంచి 350 కోట్లను పిండుకోవాలని బీసీసీఐ చూస్తోంది! అయితే ఆ బోర్డు మాత్రం అంత డబ్బు ఇవ్వలేం.. బేషరతుగా క్షమాపణలు చెబుతాం. అని అంటోంది.
మమ్మల్ని క్షమించండి.. పర్యటన రద్దు అయినందుకు చింతిస్తున్నాం. పొరపాటు మాదే… అంటోంది విండీస్ బోర్డు. అయితే బీసీసీఐ మాత్రం సర్దుకుపోవడం లేదు. ఐసీసీ నుంచి బీసీసీఐ కోటాలో వెళ్లే డబ్బును జమ చేసి నష్టపరిహారాన్ని చెల్లించండి అంటూ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. వెస్టిండీస్ బోర్డుకు ఆయువు పట్టులాంటి సొమ్ముపై బీసీసీఐ ఆ విధంగా కన్నేసింది. మరి ఈ వ్యవహారంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందో.. నష్ట పరిహారం అంటూ విండీస్ బోర్డును ఇంకా కష్టాల్లోకి నెడుతుందో ఏమో!