'హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వున్నందున, నగరంలో రెండు రాష్ట్రాల పోలీసులుకు అధికార పరిథి వుంటుంది'
ఇదీ అటార్నీ జనరల్ చెప్పిన మాట అన్నది మీడియా కథనం. ఈ మాట చెప్పుకోవడానికి, రాయడానికి బాగానే వుంటుంది. ఆచరణ సాధ్యమేనా? అసలు ఐఎఎస్ చదివిన మహా మేధావులు కావచ్చు, అధికారంలో వున్నవారు కావచ్చు, నిపుణులు కావచ్చు, ఇంత సంక్లిష్టంగా చట్టాలను ఎందుకు తయారుచేస్తారో అర్థం కాదు.
అంటే వీటిలోని సెక్షన్లను ఎవరి వారు వారికి అనుకూలంగా అన్వయించకుని, అర్థాలు, పెడార్థాలు తీసుకుని, వాదించుకోవడానికి, ఆపై కోర్టులకు ఎక్కడానికి, ఏళ్లూపూళ్లు పట్టడానికి తప్ప దేనికి పనికి వస్తాయి..
ఒక ప్రాంతం ఒక రాష్ట్రం పరిథిలోకి వస్తుంది. అక్కడ మరో రాష్ట్రం తాత్కాలికంగా రాజధాని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇలా తాత్కాలికంగా వుండే రాష్ట్రానికి ఏయే అధికారాలు వుంటాయి..ఏవేవి వుండవు అన్నది స్పష్టంగా నిర్వచించాల్సిం వుంది. సాధారణంగా ఒక ప్రాంతం ఒక పోలీస్ స్టేషన్ పరిథిలో వుంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఓ సర్కిల్ అదుపులో వుంటుంది. అలాంటి సర్కిళ్లకు ఓ డీఎస్పీ, ఆపై ఎఎస్పీ, ఆపై డీసీపీ, ఇక సిపి వుంటారు.
ఇది ఒక నగర అధికార పాలన వ్యవహారం. ఒక పోలీస్ స్టేషన్ పరిథిలోని వ్యవహారలపైనే మరో పోలీస్ స్టేషన్ వారు కలుగచేసుకోరు. పొరపాటున ఎవరైనా తెలియక వెళ్తే, మీ ప్రాంతం మా పరిథిలోది కాదు అని పంపిస్తారు. ప్రమాదం హైవే మీద జరిగితే ముందు డిస్కస్ చేసేది, అది ఏ పోలీస్ స్టేషన్ పరిథిలోకి వస్తుందనేది.
మరి చిన్న చిన్న వ్యవహారాల్లోనే పరిథికి ఇంత ఇంపార్టెన్స్ వున్నపుడు, మరి రాష్ట్రాల హక్కులు వుంటి వ్యవహారాల్లో మరి ఎన్ని లెక్కలు వుంటాయి. మరి అటార్నీ జనరల్ చెప్పారు అంటున్నదాని ప్రకారం, హైదరాబాద్ పై ఆంధ్ర పోలీసులకు కూడా పరిథి వుంటుంది…అంటే అది ఏ విధంగా ఉపయోగపడతుంది?
అంటే ఇక్కడి కేసులను వారు టేకప్ చేయచ్చా?
లేదా ఇక్కడ పోలీసు స్టేషన్ లను పెట్టుకోవచ్చా?
కాదూ అంటే, ఇక్కడ తమ బలగాలను మోహరించుకోవచ్చా?
సరే, తమ బలగాలను మోహరిస్తారు అంటే, తమ నాయకుల, అధికారుల భద్రత కోసం అనుకోవచ్చు. మరి అలాంటపుడు ఆంధ్ర నాయకుల, అధికారుల భద్రత వారి పోలీసులు చూసుకుంటారంటే, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రజల భద్రత కూడా వారే చూసుకోవాలంటే…? వితండ వాదనగా వుండదా?
లేదూ,..ఇక్కడ ఆంధ్ర పోలీస్ స్టేషన్ లను పెట్టుకోవచ్చు అంటే..దాని పరిథిలోకి ఎవరు వస్తారుా? ప్రయివేటు, ఆర్టీసీ బస్సుల మాదిరిగా ఏది కావాలంటే అది ఎక్కవచ్చన్నట్లు, ఒక పరిథిలో రెండు స్టేషన్లు..ఎక్కడ కావాలంటే అక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చా?
ఇప్పుడు అటార్నీ జనరల్ చెప్పారంటున్నా మాటలను పట్టుకుని, తనను అరెస్టు చేయడానికి తెలంగాణ పోలీసులకు పరిథిలేదని, తాను ఆంధ్ర వాడిని, ఆంధ్రపోలీసుల పరిథిలో వున్నానని ఎవరైనా వాదించాలనుకుంటే..?
ఇంత గందరగోళం వుంది..అటార్నీ జనరల్ చెప్పారంటూ చలామణీలో వున్న మాటల్లో. అందుకే కీలక స్థానాల్లో వున్నవారు ఓ సలహా ఇచ్చినా, సూచన ఇచ్చినా, నిర్వచించినా, చాలా స్పష్టంగా వుండాలి. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ గవర్నర్ పర్యవేక్షణలో వుండాలి అన్నారు.. ఓకె. గవర్నర్ లా అండ్ ఆర్డర్ ను, ఓ హోంమంత్రి మాదిరిగా నిత్యం సమీక్షించవచ్చు. తప్పులేదు. కానీ ఉమ్మడి అని చెప్పి, ఇలా గందరగోళం పరిథి సలహాలు ఇస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది తప్ప, బాగుపడదు.