ఒకప్పుడు చదువురానివారే ఎక్కువగా మోసపోతుండేవారు. ఇప్పుడు చదువుకున్నవారూ బాధితులే. డబ్బు పేరుతో జరిగే మోసాలు కోకొల్లలు. అందులో మల్టీ లెవల్ మార్కెటింగ్‌తో జరిగే మోసాలు వెరీ వెరీ స్పెషల్. అయితే, ఇవి ఇప్పుడు కొత్తగా వెలుగుచూస్తున్నవేమీ కావు.. ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. సమాజంలో ఇంకా ఇలాంటివి చాలానే వున్నాయి. చీటీలనీ, ఇంకోటనీ.. ఆర్థిక నేరాల్లో ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగుచూస్తూనే వున్నాయి. చిత్రంగా, పాత నేరాలే.. కొత్త కొత్తగా తెరపైకొస్తుంటాయి. జనాన్ని నిండా ముంచేస్తుంటాయి.
ఈజీ మనీ.. అప్పనంగా వచ్చే సొమ్ముల మీద చాలామందికి ఆశెక్కువ. నిజం ఎప్పుడూ నిష్టూరంలానే వుంటుంది. కానీ, నిజాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, చాపకింద నీరులా మల్టీ లెవల్ మార్కెటింగ్ విస్తరిస్తూనే వుంది. క్యాన్సర్ కన్నా దారుణంగా తయారయ్యిందిది. ఇప్పుడు కొత్తగా 'సోషల్ ట్రేడ్' ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్ పంజా విసిరింది.
3700 కోట్ల రూపాయలు.. చిన్న మొత్తం కాదిది. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా బాధితులు ఈ సోషల్ ట్రేడ్ మాయలో చిక్కుకున్నారు. తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాలనే కాన్సెప్ట్‌కి ఆకర్షితులై, మొత్తంగా 3700 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టేశారు. దొంగ దొరికాడు. కానీ, లాభమేంటి.? జనం కోల్పోయిన సొమ్ములు తిరిగొస్తాయా.? ప్చ్, అవకాశాలు తక్కువ. ఎందుకంటే, దేశంలో చాలా దొంగతనాలు జరిగాయి.. జరుగుతూనే వున్నాయి. 'రికవరీ' మాత్రం చాలా అరుదు.
మల్టీలెవల్ మార్కెటింగ్ అనే దొంగతనం చిత్రంగా వుంటుంది. ఇందులో మొదట చేరిన వ్యక్తి సేఫ్.. ఆ తర్వాత చేరినోళ్ళు కాస్త బెటర్.. చివరికి మిగిలేవారు మాత్రం వెర్రి వెంగళప్పలే. ఒక్కోసారి మొదట చేరిన వ్యక్తి కూడా అడ్డంగా బుక్కయిపోతాడు. వస్తున్నాయి కదా.. అని, వచ్చిన డబ్బులకి మరింత డబ్బు అదనంగా చేర్చి, అందులో పెట్టుబడులు పెడ్తుంటారు. అదే మరి, మల్టీ లెవల్ మార్కెటింగ్ మాయ అంటే.
'తెలిసినోడు చెప్పాడు.. నమ్మకంగా చెప్పాడు..' ఇదే మల్టీ లెవల్ మార్కెటింగ్‌కి ఊతం. ఆ తెలిసినోడు, తాను మోసపోయింది కాక, పదిమందిని నాశనం చేసేస్తాడు. ఈ ఈక్వేషన్ అందరికీ తెలుసు. కానీ, మాయలో పడటం మాత్రం మానరు. ఎందుకు.? అంటే, డబ్బెవరికి చేదు అనే సమాధానమే వస్తుంది.
ఇలాంటి కేసుల్లో పోలీసులు మాత్రం ఏం చేస్తారు.? కేసులు పెడ్తారు, అరెస్టులు చేస్తారు. వ్యవహారం కోర్టులకెళుతుంది. ఏళ్ళతరబడి కేసులు నడుస్తాయి. అసలంటూ, ఈజీ మనీ కోసం వెంపర్లాడకపోతే సమస్యే వుండదు కదా.? అన్న డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కాదు. ఆశ.. ఈ ఆశే మనిషిని చాలాసార్లు బతికిస్తుంది.. చాలాసార్లు చంపేస్తుంది. డబ్బు.. అప్పనంగా డబ్బు వస్తుందన్న ఆశ.. చివరికి నష్టపోయామని తెలిశాక ప్రాణాలు తీసేస్తుంది.
కొసమెరుపు: ఈసారి మల్టీలెవల్ మార్కెటింగ్‌లో ఎక్కువమంది బాధితులెవరో తెలుసా.? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఎందుకంటే పేరు బాగుంది కదా, 'సోషల్ ట్రేడింగ్' అని. సోషల్ మీడియాకే కాదు, సోషల్ ట్రేడింగ్‌కీ అడిక్ట్ అయిపోయారు మరి.!