‘కోటా’ పోటీలు మళ్ళీ మొదలయ్యాయి. జాట్లు, గుజ్జర్లు నడిచిన దారిలో పటేళ్ళు నడుస్తున్నారు. ఈ సారి ఈ పోటీలకు కేంద్రం సాక్షాత్తూ నేటి ప్రధాని నరేంద్ర మోడీని ముమ్మారు ముఖ్యమంత్రిని చేసుకున్న రాష్ర్టం గుజరాత్. పటేళ్ళను నిర్లక్షం చేస్తున్నారన్న డిమాండ్ వచ్చిన సందర్భం ఇంకా గొప్పది: పటేళ్ళ( పటీదార్ సామాజిక వర్గం) నుంచే వచ్చిన ఆనంది బెన్ పటేల్ ముఖ్యమంత్రి గా కూర్చున్నారు. అయినప్పటికీ పటేళ్ళకు దక్కాల్సిన అవకాశాలు దక్కటం లేదన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ఈ ‘కోటా’ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాటిల్‌కు నిండా 22 యేళ్ళు లేవు. తమ సామాజిక వర్గాన్ని గుజరాత్‌లోని ‘ఓబీసీ’ కోటాలో చేర్చాలన్నది ఈ డిమాండ్. ఇప్పటికే ఈ ఉద్యమం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. నెత్తురోడింది. ఆస్తులు హారతి కర్పూరం అయిపోయాయి. ఇలా పిలుపు ఇస్తే చాలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆనంది బెన్ ఈ అంశం మీద పరిశీలన జరపటానికి ఒక కమిటీని కూడా వేశారు. సంయమనం పాటించమని ప్రధాని కూడా విన్నవించారు. కానీ ఎక్కడా ఈ ఉద్యమం ఇప్పట్లో కుదుట పడేలా లేదు.
ఇంతకీ ఈ పటేళ్ళ డిమాండ్ ఏమిటి? తమని ‘ఇతర వెనుకబడిన తరగతుల్లో’(ఓబీసీల్లో) చేర్చటం. ఇలా చెయ్యటం వల్ల తమ సామాజిక వర్గానికి విద్య, ఉపాధిలో అవకాశం వస్తుందని. అయితే ఇప్పటికే గుజరాత్లో మొత్తం 49 శాతం రిజర్వేషన్లు అములులో వున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు కలిసి 22 శాతం వుంటే, ఓబీసీలకు 27 శాతం వున్నాయి. కానీ హార్దిక్ పటేల్ మాటల దాడి ఇప్పటికే ఈ కోటాను అనుభవిస్తున్న వారి మీద చేస్తున్నారు. సహజంగా రిజర్వేషన్ కోరుకునే వర్గం, ఇతర ఆధిపత్యవర్గాల మీద ధ్వజమెత్తుతారు. ‘ఒపెన్ కేటగిరీ’ లో వున్న పోస్టులన్నీ , ఆధిపత్య వర్గాలు తన్నుకు పోతున్నాయని అంటుంటారు. కానీ, హార్దిక్ అభ్యంతరం ఎస్సీ, ఎస్టీల మీద వుంది. వీరు అటు తమకు ‘రిజర్వ్ చేసిన సీట్లనే కాకుండా, ఒపెన్ కేటగిరీ’లో సీట్లను కూడా కొట్టేస్తున్నారని అభియోగం మోపుతున్నారు. అయితే తాను ఇప్పటికే ‘ఓబీసీ’లో వున్న వెనుకబడిన కులాల మీద ప్రత్యేకించి దాడి చేయకపోయినా, తొలి వ్యతిరేకత వారినుంచే వస్తుంది. ఎందుకంటే పటేళ్ళను కూడా అందులో చేర్చటం వల్ల, వారికొచ్చే అవకాశాలు గుజరాత్లో బాగా తగ్గిపోతాయి. ఫలితంగా ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ఎక్కుపెట్టినట్లు అవుతుంది.
అయితే గుజరాత్ ఇలాంటి ఉద్యమం రావటం ఇది మొదటి సారి కాదు. 1981లో బక్షి కమిషన్ సిఫారసుల మేరకు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాధవ్ సింహ్ సోలంకి సామాజికంగా, అర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించినప్పుడు, పెద్ద యెత్తున ‘రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం’ వచ్చింది. 1958లో ఆయన రాజీనామా చేశారు. కానీ అత్యధిక మెజారిటీతో తిరిగి గెలిచారు. ఈ వ్యతిరేక ఉద్యమంలో పటేళ్ళు సామాజికవర్గానికి చెందిన విద్యార్థులు కీలకంగా వున్నారు.
అంతే కాదు, ఈ పని చేసిందని ఏకంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన రాజకీయప్రముఖులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు కూడా. ఇప్పడు పటేళ్లు బీజేపీలో కీలకంగా నే వున్నారు. అదీ కాకుండా, బీజేపీ గుజరాత్ అంటే గాంధీ కాకుండా సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పేరు గుర్తుకువచ్చేలా చేసింది. కానీ ఇప్పుడు హార్దిక్ పటేల్, ఇప్పుడు పటేల్ ను సామాజికవర్గ పరంగా తమ వాడని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే, ఈ ఉద్యమం ఇటు బీజేపీకీ, అటు నరేంద్ర మోడీకి అగ్ని పరీక్ష. పైపెచ్చు, ఇప్పుడున్న ఓబీసీలకు చెందిన వ్యక్తిగానే మోడీని బీజేపీ లోకానికి పరిచయం చేసింది.
అయితే ఈ ‘కోటా’ ఉద్యమం ఎటు వైపు పోతుంది. నిజంగానే ఉద్యమం విజయవంతమయి, పటేళ్ళను ఓబీసీలో చేరుస్తారా? అంటే అక్కడి రాష్ర్ట ప్రభుత్వం చేయటానికి తలపెట్టినా, అందుకు అడ్డంకులు చాలా వున్నాయి. సుప్రీం కోర్టు 1992 లో ఇచ్చిన తీర్పులో విద్య,ఉపాధి అవకాశల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదన్న లక్ష్మణ రేఖను గీసింది. కాబట్టి ఇతర బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా వీరి డిమాండ్‌ను అంగీకరించటం సాధ్యం కాదు. అదీ కాక, ఈ మధ్య కూడా జాట్స్ను ఓబీసీల్లో చేర్చటం వీలుపడదని ఇచ్చిన తీర్పులో ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది: ‘ఎవరికి వారు తమని తాము వెనుబడిన సామాజికవర్గంగా’ ప్రకటించుకోకూడదు.
ఒకరకంగా చెప్పాలంటే పేరుకు పటేళ్ళది ‘రిజర్వేషన్ అనుకూల’ ఉద్యమంగా కనిపిస్తున్నా, ఇది పూర్తిగా ‘రిజర్వేషన్ వ్యతిరేక’ ఉద్యమం. అయితే ఈ సారి ఉద్యమానికి ఊపునిచ్చింది. ‘సోషల్ మీడియా నెట్వర్క్’. వేలయేళ్ళగా సామాజికంగా వెలికో, లేక వివక్షకో గురయ్యేవారికి కొన్ని పదుల సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన పూర్తిగా సమానం కాలేరు. అయినా లబ్ధి పొందిన కొద్ది మందిని చూసినప్పుడు, ఈ వర్గాల వారు ఎదిగిపోయారన్న అపోహ కలుగుతుంది. ఇలాంటి లోపభూయిష్టమైన ఆలోచనతో గతంలో వచ్చిన ఉద్యమాలు ఎలా అయ్యాయో, ఈ ఉద్యమమూ అలాగే అవుతుంది. అందులో సందేహం లేదు.
సతీష్ చందర్