ఉప ఎన్నిక కాదు…కురుక్షేత్రమే…!

సిట్టింగ్ ఎమ్మెల్యేల, ఎంపీల మరణాల వల్ల లేదా వివిధ కారణాలతో సీటు వదులుకోవడం వల్ల జరిగే ఉప ఎన్నికలు సాధారణంగా అంత ప్రాధాన్యం సంతరించుకోవు. ఒకేసారి ఐదారు ఉప ఎన్నికలు జరిగితే హడివిడి ఉంటుంది.…

సిట్టింగ్ ఎమ్మెల్యేల, ఎంపీల మరణాల వల్ల లేదా వివిధ కారణాలతో సీటు వదులుకోవడం వల్ల జరిగే ఉప ఎన్నికలు సాధారణంగా అంత ప్రాధాన్యం సంతరించుకోవు. ఒకేసారి ఐదారు ఉప ఎన్నికలు జరిగితే హడివిడి ఉంటుంది. కాని తెలంగాణలో మెదక్ ఉప ఎన్నిక జాతీయస్థాయిలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు అన్ని పార్టీల్లో జాతీయ నాయకుల దృష్టి మెదక్ మీదనే ఉంది. కారణం అందరికీ తెలిసిందే. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వదులుకున్న సీటు కావడం. సాధారణ రాజకీయ నాయకుడికి సంబంధించిన సీటైతే ఇంత ఉత్కంఠ ఉండదు. ఇంత హడావిడి జరగదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఉప ఎన్నిక కాదు, కురుక్షేత్రమేననడంలో సందేహం లేదు. కేసీఆర్ దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన మెదక్ స్థానం మళ్లీ టీఆర్‌ఎస్‌కే దక్కుతుందా? కాంగ్రెసు లేదా బీజేపీ గెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అత్యంత దగ్గరగా ఉంది.

కేసీఆర్‌కు వ్యక్తిగతంగా సవాల్

ముఖ్యమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్న, వినూత్న నిర్ణయాలతో, చర్యలతో దూకుడుగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు మెదక్ ఉప ఎన్నిక వ్యక్తిగతంగా ఓ పెద్ద సవాల్‌గా మారింది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారంగా పరిణమించింది. ఇప్పటివరకు తెలంగాణ అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే తెలంగాణ అన్న పరిస్థితి ఉంది. కేసీఆర్ వాదమే తెలంగాణవాదం అన్నట్లుగా ఉంది. కేసీఆర్ వ్యతిరేకులంతా తెలంగాణ వ్యతిరేకులనే భావన సామాన్య జనంలో ఉంది. ఈ ఉక్కు కవచాన్ని బద్దలు కొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మెదక్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోతే కేసీఆర్ వ్యక్తిగతంగా ఓడిపోయినట్లేనని, ఆయన పలుకుబడి పలచబడుతుందని అనుకుంటున్నాయి. ఇక్కడ కాంగ్రెసు గెలిచినా, బీజేపీ గెలిచినా ఆ పార్టీలకు వెయ్యేనుగుల బలం సమకూరినట్లే భావించాలి. ఆ రెండు పార్టీల్లో ఏదైనా గెలిచినట్లయితే ఆ గెలుపును అడ్డం పెట్టుకొని తాము బలవంతులమైనట్లు ప్రచారం చేసుకుంటాయి. టీఆర్‌ఎస్ గెలిస్తే తాను తిరుగులేని నాయకుడినని కేసీఆర్ భావిస్తారు. 

రోషాగ్నుల రణక్షేత్రం

‘కురుక్షేత్రం’ సినిమాలో ‘ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం’ అనే పాట ఉంది. మెదక్ ఉప ఎన్నిక ఇదే పరిస్థితిని తలపిస్తోంది. అన్ని పార్టీల నాయకులు కత్తులు నూరుతున్నారు. బూతు పురాణాలు వినిపిస్తున్నారు. పదునైన విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకురుకుంటున్నారు. ‘నువ్వు బచ్చా’ అని ఒకరంటే, ‘నువ్వు లుచ్ఛా’ అని మరొకరు తిప్పికొడుతున్నారు.  సాధారణ ఎన్నికలకు మించి ఇక్కడ పౌరుషాగ్ని రగులుతోంది. నైతిక విలువల గురించి నాయకులు ధర్మోపన్యాసాలు ఇస్తున్నారు. అన్ని పార్టీల నుంచి బడా నాయకులు ప్రచారానికి వస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెసు రాష్ర్ట అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అగ్ని పరీక్షగా మారగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రాణాంతకంగా పరిణమించింది. ఎందుకంటే మెదక్‌లో ఆయనే పోటీ చేయాలనుకున్నారు. కాని…అనూహ్యంగా కాంగ్రెసు నాయకుడు జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) భాజపాలోకి దూకి అభ్యర్థిగా అవతారమెత్తారు. ఆయన పార్టీకి కొత్త కాబట్టి గెలిపించుకోవల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగానే ఉంది. అది బీజేపీకి నూరు శాతం సహకరిస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే బాగుంటుందని నాయకులు చంద్రబాబుకు సలహా ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చాం కాబట్టి, ఇక్కడ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ మద్దతు తీసుకుందామన్నారు. కాని…బాబు బీజేపీయే నిలబడుతుందని, టీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ అసంతృప్తి టీడీపీ నాయకుల్లో ఉంది. 

కాంగ్రెసు గెలిచితీరాలంటున్న సోనియా

మెదక్ ఉప ఎన్నికపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసక్తికరంగానే కాకుండా పట్టుదలగా ఉన్నారు. ఆమెకు కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కోపం ఉంది. కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేస్తారని ఆమె ఆశించారు. ఆంధ్రప్రదేశ్‌లో జీరో అయిపోయినా తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనుకున్నారు.  ఆ ఆశతోనే తెలంగాణ రాష్ర్టం ఇచ్చారు. కాని…చివరకు కేసీఆర్ చెయ్యివడంతో సోనియా హతాశురాలయ్యారు. మెదక్ ఉప ఎన్నికలో ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు.  అందుకే రాష్ర్ట రాజకీయాల్లో తలనెరిసిన ఢిల్లీ కాంగ్రెసు దిగ్గజాలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ సహా ఆర్సీ కుంతియా, సచిన్ పైలట్ మొదలైన ఢిల్లీ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. ఇక మోస్ట్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెసు నాయకులందరినీ మోహరిస్తున్నారు. మొత్తం నలభై మంది నాయకులు ముమ్మరంగా ప్రచారానికి దిగుతున్నారు.మెదక్‌ను అధినేత్రి సోనియాకు బహుమతిగా ఇస్తామంటున్న పొన్నాల ఆ పని చేయలేకపోతే ఆయన పదవికి గండం రావడం ఖాయమని కొందరు నాయకులు చెబుతున్నారు. 

రథసారథి హరీష్ రావు

కురుక్షేత్ర యుద్ధంలో అర్జనుడికి శ్రీకృష్ణుడు రథసారథి కాగా, ఎన్నికల యుద్ధంలో కేసీఆర్‌కు మేనల్లుడు, మంత్రి అయిన హరీష్‌రావు రథసారథి. సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన హరీష్ ఈ ఉప ఎన్నికను కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ గెలుపు బాధ్యతను మేనల్లుడికి అప్పగించారు. పకడ్బందీగా వ్యూహం రూపొందిస్తున్నారు. తన మెజారిటీ కంటే ఎక్కువ రావాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో టీఆర్‌ఎస్ ప్రధాన నాయకులంతా తలో బాధ్యత తీసుకున్నారు. ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవని హరీష్‌రావు అంటున్నారు. వ్యూహ రచనలో మామ లక్షణాలను పుణికిపుచ్చుకున్న హరీష్ అంతపనీ చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే ఆ క్రెడిట్ హరీష్‌కు దక్కుతుంది. మెదక్‌లో టీఆర్‌ఎస్ గెలుపు అత్యంత సులభమని, భారీ మెజారిటీ సాధనే తమ ముందున్న సవాలని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ అధికారానికొచ్చిన కొద్ది కాలానికే జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి దానికే గెలుపు అవకాశాలుంటాయి. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సిపిఎం, సిపిఐ) టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ అత్యంత జాగ్రత్తగా ఉన్నారు. ఇక సాధారణంగా జనరల్ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కాని…మెదక్ ఉప ఎన్నికలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ ఇసి ప్రత్యేకంగా నిఘా వేసింది. మొత్తం మీద మెదక్ ఉప ఎన్నిక సంచలనం రేపుతోంది. 

– అమృత