జగన్ ను నొక్కేస్తారా…?

చిత్రంగా వుంది వైకాపా అభిమానుల వ్యవహారం. ఎన్నికల్లో వైకాపా ఓటమిని వారు బాగానే తట్టుకున్నారు. కానీ జగన్ అభిమానుల్లో చాలా మందిని కలవరపెడుతున్న ప్రశ్నలు కొన్ని వున్నాయి. Advertisement జగన్ ను నొక్కేసేందుకు చంద్రబాబు…

చిత్రంగా వుంది వైకాపా అభిమానుల వ్యవహారం. ఎన్నికల్లో వైకాపా ఓటమిని వారు బాగానే తట్టుకున్నారు. కానీ జగన్ అభిమానుల్లో చాలా మందిని కలవరపెడుతున్న ప్రశ్నలు కొన్ని వున్నాయి.

జగన్ ను నొక్కేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారా?

చంద్రబాబు ఊరుకున్నా, రామోజీ మిన్నకుంటారా? తన ఈనాడు ప్రత్యర్థి అయిన సాక్షిని లేకుండా చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేయకుండా వుంటారా?

జగన్ తన పార్టీ ఎమ్మల్యేలను కాసుకోగలరా? వారు అయిదేళ్ల పాటు జగన్ తో మిగుల్తురా?

అసలు అయిదేళ్ల పాటు జగన్ పార్టీని నిలబెట్టుకోగలరా?

ఇవన్నీ ప్రశ్నలు. చాలా మంది అభిమానులు ఈ ప్రశ్నలు సంధిస్తూ, వీటిపై మీ అభిప్రాయం రాయండంటూ నాకు మెయిల్స్ ఇచ్చారు. 

ఓ వ్యక్తిపై అభిమానం వున్నపుడు ఇలా ఆందోళన చెందడం సహజం. ఈ ఆందోళనకు చాలా కారణాలున్నాయి. 

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ త్వరలో జైలుకు వెళ్లిపోతాడన్న ప్రచారం బాగా జరిగింది. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే, ఆ విధంగా అరెస్టయిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తాడని విమర్శలు వినిపించాయి. ఆ సంగతి అలా వుంచితే, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి సరిపడా బలం సంపాదించాక, తొలిసారి ఈనాడు కు ఇచ్చిన ఇంటర్వూలో అన్న మాటలు కూడా జగన్ అభిమానులకు ఆందోళన కారణాలవుతున్నాయి. అవినీతి పరులను ఏడాదిలోగా జైలుకు పంపిస్తాం అని చంద్రబాబు అన్నారు. జగన్ కేసుల నేపథ్యంలో అతగాడు అత్యంత భయంకరమైన అవినీతి పరుడు అని ముద్ర ఎప్పుడో వేసేసారు. అవినీతిపరుడా కాదా అన్నది కోర్టు ఇంకా తేల్చలేదన్నది ఇక్కడ లెక్కలోకి లేనేలేదు. చంద్రబాబు ఇలా అన్నారంటే, ఆయన కన్ను జగన్ పై వున్నట్లే. పైగా అది సహజం కూడా. 

ఎందుకంటే ఇప్పుడు రెండుశాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారు. మరో అయిదేళ్లనాటికి ఈ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలి. ఎదురు లేకుండా చూసుకోవాలి. రాజకీయ నాయకుడు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. వైఎస్ కూడా రెండోసారి గెలుపొందగానే ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించారు. 2014నాటికి కాంగ్రెస్ కు, తనకు పోటీ వుండకూడదనుకున్నారు. కానీ ఆయన ఒకటి తలిస్తే, దైవమొకటి తలిచాడు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు కూడా 2019నాటి జగన్ అడ్డు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది ఖాయం. రాజకీయంగా తప్పు కూడా కాదు. పైగా అది బాబుకు చాలా అవసరం. ఎందుకంటే, అప్పటకి లోకేష్ ను సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత తండ్రిగా చంద్రబాబుపై వుంది. 

అయితే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేయగలిగినవి రెండు. ఒకటి అధికారమే ఆక్సిజన్ గా బతికే రాజకీయనాయకులను వైకాపా నుంచి సులువుగా లాగేయడం. అది జరిగిపోతుంది. పెద్దగా ఆలోచించనక్కరలేదు. ఎందుకంటే రాజకీయనాయకులు నిబద్ధత అనే లక్షణాన్ని ఎప్పుడో వదిలేసుకున్నారు కాబట్టి. ఇక రెండవది జగన్ ను కేసుల ద్వారా ఇబ్బందుల పాలు చేయడం,. ఇది కూడా చంద్రబాబుకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే ముందు చూపుతో ఢిల్లీ స్థాయికి చేర్చిన ఆయన మనుషులు వుండనే వున్నారు. మోడీ మద్దతు వుండనే వుంది. కానీ మోడీ దీనికి పరిపూర్ణంగా ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్న. మోడీ కూడా తెలివైన రాజకీయ నాయకుడే. ఎప్పుడూ ఓ ఆప్షన్ వుండేలా చూసుకుంటాడు. కేవలం చంద్రబాబునే నమ్ముకుంటే ఎలా? అందుకే జగన్ ను మరీ లేకుండా చేసుకుంటారా అన్నది అనుమానం.  ఇక రెండవ సంగతి. 

ఇప్పుడు జగన్ ను కనుక అరెస్టు చేస్తే, అతగాడికే మంచింది. జనంలో భయంకరమైన సింపతీ వచ్చేస్తుంది. మేథావులు అనుకునేవాళ్లు, నెటిజన్లు, ఫేస్ బుక్ పోస్టింగ్ లు ఎలా వున్నా, జగన్ ను కావాలని చేస్తున్నారన్న కలర్ వస్తుంది. జనతా ప్రభుత్వం ఇందిర పట్ల చేసిన తప్పిదం ఇదే. అందువల్ల అంత చాన్స్ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. రాజకీయంగా హత్య చేయడమే సులువు. ఇబ్బంది లేని పని. జగన్ వెంట ఎమ్మెల్యేలు, ఎంపీలు వీలయినంతవరకు లేకుండా చేస్తే చాలా వరకు పనైపోతుంది. 
ఇక ఈ తరహా వ్యవహారాన్ని జగన్ ఎంతవరకు తట్టుకుంటారు? నిలబెట్టుకుంటారు అన్నది మరో ఏంగిల్. కేసుల వ్యవహారాన్ని కోర్టుల ద్వారానే ఎదుర్కొంటారు. 

న్యాయపోరాటం సాగిస్తారు అది మామూలే. అంతకన్నా ముందే ఆయన మోడీని కూడా ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. మోడీ ఇంకా ప్రదాని కాకుండానే, ఆయన ఏమీ చెప్పడానికి అవకాశం లేకుండానే, జగన్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. అక్కడ తన ఎంపీలతో కలుస్తారు. దేనిమీద..విభజన హామీల మీద. కానీ ఈ సమయంలో, అలాగే చూస్తా..చేస్తా అని తప్ప మోడీ మరో మాట అనగలరా? అదే ఓ నెల పోయాక అయితే, ఆయన ప్రధాని సీట్లో కుదురుకుంటారు. మంచి చెడ్డ, చేయగలిగింది, చేయలేనిది చెప్పగలరు. కానీ అప్పటిదాకా ఆగకుండా వెళ్లడంలో జగన్ ఆంతర్యం స్పష్టంగా తెలుస్తూనే వుంది. మోడీకి తాను మీకు అనకూలుడనే అని చెప్పడానికే కావచ్చు. గుడలుక్స్ లో వుండడానికి కావచ్చు. 

ఇక జగన్ చేయగలిగింది..చేయాల్సింది. పార్టీని, ప్రజాప్రతినిధులను నిలబెట్టుకోవడం,. ఇది సాధ్యం కావాలంటే జగన్ మారాల్సి వుంటుంది. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేయాల్సివుంటుంది. అందుకోసం పార్టీకి ఓ యంత్రాంగం అనేదాన్ని తయారుచేసుకోవాల్సి వుంటుంది. అనుక్షణం తన మనుషులతో మమేకం కావాల్సివుంటుంది. అదే సమయంలో పార్టీని తాను పటిష్టంగా వుంచుతూ, ప్రజల సమస్యలపై పోరాడే సత్తాను సమకూర్చుకుంటున్నట్లు తన జనాలకు నమ్మకం కూడా కలిగించాలి. 

అందుకు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. చేసే ప్రతి ప్రకటన సరైనదిగా వుండాలి. కానీ జెసి దివాకర రెడ్డి లాంటి వాళ్లు అప్పుడే జగన్ ఇదంతా చేయలేడని, పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుందని వ్యాఖ్యానాలు మొదలెట్టారు. బహుశా ఇదంతా జగన్ వెనుక వున్న వాళ్ల నైతిక బలాన్ని దెబ్బతీయానికి కావచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ జగన్ తట్టుకోవాలి. అప్పుడే పార్టీ నిలదొక్కుకుని, మళ్లీ యుద్దానికి సన్నద్దమవుతుంది. లేదంటే కుదేలవుతుంది.

చాణక్య

[email protected]