నాగులాపల్లి శ్రీకాంత్ ను గుర్తు తెచ్చుకోండి

ఇది సుమారు ఎనిమదేళ్ల క్రిందటి సంగతి. నాగులాపల్లి శ్రీకాంత్. యంగ్ ఐఎఎస్ అధికారి. 1998 బ్యాచ్. ఒకప్పుడు రాజమండి పుష్కరాలకు అక్కడ పనిచేసి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నికార్సయిన నిజాయతీకి పేరు. అలాంటి…

ఇది సుమారు ఎనిమదేళ్ల క్రిందటి సంగతి. నాగులాపల్లి శ్రీకాంత్. యంగ్ ఐఎఎస్ అధికారి. 1998 బ్యాచ్. ఒకప్పుడు రాజమండి పుష్కరాలకు అక్కడ పనిచేసి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నికార్సయిన నిజాయతీకి పేరు. అలాంటి అధికారిని విశాఖ మున్సిపల్ కమీషనర్ గా నియమించారు వైఎస్ తను ముఖ్యమంత్రిగా వున్నపుడు. అప్పటికి ఇంకా పాలకవర్గం లేదు. ఎన్నికలు జరగాల్సివుంది. ఆయన వస్తూనే విశాఖ భవిష్యత్ దర్శనం చేసారు. 

ఇవాళ విశాఖ వాసులు కావచ్చు..విశాఖ కు వెళ్లిన వాళ్లు కావచ్చు చూస్తున్న నాలుగు లైన్ల రోడ్లు, సిరిపురం నుంచి రామ్ నగర్, రామ్ నగర్ నుంచి ఆశీలు మెట్ట, ఆశీలు మెట్ట నుంచి సిరిపురం. అనే ఈ స్వేర్ ఆయన రూపకల్పనే. అలాగే ముడసర్లోవ  మీదుగా సింహాచలం విశాలమైన రోడ్లు..అలాగే సర్క్యూట్ హవుస్ పక్క నుంచి  విఐపి రోడ్. ఇవన్నీ ఆయన తన భవిష్యదర్శనంతో ప్లాన్ చేసారు. రాజకీయనాయకులు సన్నాయి నొక్కులు నొక్కారు. విశాఖకు ఇంత వెడల్పాటి రోడ్లు అవసరమా అన్నారు. ఈ రహదారుల నిర్మాణంలో కొన్ని మత సంస్థల జాగాలు పోయాయి. వాళ్లు వైఎస్ కు మొరపెట్టుకుంటే, కుర్రాడు మంచి పని చేస్తున్నాడు చేయనివ్వండి అన్నారు కానీ అడ్డం పడలేదు.  

సర్య్కూట్ హవుస్ ప్రాంతంలో రోడ్లువిశాలం చేసి, ప్రభుత్వ భూమలు సరిచేస్తే, మేమున్నామంటూ అప్పటి ప్రజా ప్రతినిధులు కొందరు తమకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఆయన ఆ స్థలాలు భవిష్యత్ అవసరాలకు చాలా కీలకమంటూ చెప్పడంతో వైఎస్ ఆ పైలును పక్కన పెట్టారు. 

ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే, ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న అన్ని తరహా వైర్లకు డక్ట్ ల విధానం నిర్మాణం అన్నది అప్పట్లోనే శ్రీకాంత్ అమలు చేసారు. సిరిపురం-రామ్ నగర్-ఆశీలుమెట్ట-సిరిపురం కారిడార్ లో ఆయన ఈ డక్ట్ ల నిర్మాణం జరిపించారు. 

మరిన్ని రోడ్లు విశాలం చేయాలని ఆయన అప్పట్లో అనుకున్నారు. కానీ ఆయన నిజాయతీ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఏ ఒక్క బిల్డరుకు, ఎంత రికమెండేషన్ వున్నా, ఎంత డబ్బు చూపించినా ఆయన అనుమతి ఇచ్చేవారు కాదు. పైగా శ్రీకాంత్ దగ్గర వున్న మరో గొప్ప గుణం మీడియాలో ప్రచారానికి ఏ మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. దాంతో త్వరగా ప్రమోషన్ వచ్చేసింది. బదిలీ అయిపోయారు. తరువాత మళ్లీ పాలకవర్గం వచ్చింది. విశాఖ నానా బాధలు పడింది. అది విశాఖ వాసులకు అందరికీ ఎరుకే. నాటికి నేడు మళ్లీ విశాఖలో మరో రహదారి విశాలం కావాలంటే, మరోసారి స్పెషల్ అధికారి పాలన వస్తేనే సాధ్యమయింది. అది ఇప్పుడు ఈ 2014లో. చావుల మదుం నుంచి రైల్వేస్టేషన్ మీదుగా దొండపర్తి వరకు. 

అంటే రాజకీయనాయకులు వుంటే అభివృద్ధి సాధ్యమా నిజయతి, విజన్ వున్న అధికారలకు స్వేచ్ఛ వుంటే సాధ్యమా అన్నది అర్థమవుతుంది. 

కొసమెరపు ఏమిటంటే, వైఎస్ తన సామాజికవర్గం అధికారులను అందలం ఎక్కించేవారు, వారు ఆడింది ఆట పాడింది పాట అన్నది చాలా కీలకమైన విమర్శ. వైఎస్ ఇచ్చారో, వారు తీసుకున్నారో వారికే తెలియాలి కానీ, నాగులాపల్లి శ్రీకాంత్ మాత్రం వైఎస్ ను అపారంగా ద్వేషించే సామాజికవర్గానికి చెందిన వారు,. అది నిజమో కాదో తెలుసుకునేలా శ్రీకాంత్ ఎన్నడూ ప్రవర్తించలేదు. అయినా వైఎస్ ఆయన ప్రణాళికలకు అడ్డుపడలేదు,.

అలాంటి అధికారులు కావాలి ఇప్పుడు విశాఖ పునర్నిర్మాణానికి. పాలకవర్గం ఎన్నికలు నిరాటంకంగా కొన్నేళ్ల పాటు వాయిదా వేసి విశాఖను వారికి అప్పగించాలి. అన్నట్లు ఇక్కడ ఇంకో ముచ్చట. ఇప్పుడు చంద్రబాబు ఐటి సలహాదారుగా దగ్గర వుంచుకున్న సంజయ్ జాజూ కూడా విశాఖ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి, తన విజన్ తో బాబు మనసు గెల్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ సేవ అంటూ చెబుతున్న కాన్సెప్ట్ కు ఆయనే రూపకల్పన చేసి తొలిసారి విశాఖలో అమలు చేసారు కార్పొరేషన్ ద్వారా. అది విని అప్పట్లో బాబు జాజు ను రాజధానికి పిలిచి, దాని వ్యవహారం తెలుసుకుని, రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేసారు. 

సరైన అధికారులను నియమించడం, ప్రోత్సహించడం చేస్తే అద్భుతాలు జరుతాయనడానికి ఇలాంటివే ఉదాహరణలు. కానీ రాజకీయల బారిన పడి చాలా మంది అధికారులు తమ ప్రతిభ కనబర్చే అవకాశం రాదు. పూనం మాలకొండయ్య, రత్నప్రభ, విద్యాసాగర్, ఇలాంటి వాళ్లంతా చేద్దామన్నా రాజకీయాలు చేయనియ్యవు. అది మన వ్యవస్థ చేసుకున్న పాపం. 

చాణక్య

[email protected]