మారుతి..టాలీవుడ్ చిన్న సినిమాలను తనదైన స్టయిల్ లో చిన్న మలుపు తిప్పిన దర్శకుడు. సినిమా కుర్రాళ్లలో ఓ క్రేజ్ తెచ్చుుకున్నవాడు. కానీ ఇప్పుడు వున్నట్లుండి అలా నిలిచిపోయాడు. నిజానికి ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ సినిమాలు అందించిన దర్శకుడు లేరు. కానీ ఇన్ని వివాదాలు, హడావుడి వున్న దర్శకుడూ లేరు. కానీ ఇప్పుడు వున్నట్లుండి సినిమాలు నిలిచిపోయాయి. మారుతి అభిమానులు దీనికి ముమ్మాటికీ మారుతే కారణం అని అంటున్నారు. పరిస్థితిని అన్ని విధాలా తను వాడుకోవాలని అనుకుని కిందా మీదా పడడమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు.
మారుతి తనకు వచ్చిన పేరును బ్రాండ్ నేమ్ గా మార్చుకోవాలనుకున్నారు. అందుకే ఎవరు ఏ మాత్రం మంచి స్క్రిప్ట్ తెచ్చినా, మారుతి ప్రజెంట్స్ బ్యానర్ పై దాన్ని చేసుకోవడానికి అనుమతి ఇచ్చేసారు. దీనికి ఆయన ఉభయతారక సిస్టమ్ ను ఒకదాన్ని తయారు చేసుకున్నట్లు వినికిడి. ఇలా ఓకె అన్న సినిమాలు చాలా వరకు మారుతి ఇమేజ్ ను డామేజ్ చేసాయి. పోనీ హిట్ అయిన సినిమాలైనా పనికివచ్చాయా అంటే వివాదాలకు దారి తీసి, ఇబ్బంది పెట్టాయి.
సరే, మారుతి ప్రెజెంట్స్ వ్యవహారం ఇలా వుంటే స్వంతంగా తీసిన సినిమాలు ఫరవాలేదనిపించినా, అవకాశాలు అంతగా రాలేదు. ఒప్పందాలు, మాటలు చాలా వున్నాయి కానీ ఏవీ మెటీరియలైజ్ కావడం లేదు. అల్లు అరవింద్ తనకో సినిమా చేయమని ఓపెన్ గానే కొత్త జంట ఫంక్షన్లో అడిగారు. మారుతి దగ్గర నాలుగైదు అడ్వాన్స్ లు వున్నాయి. కానీ ఏవీ సెట్ లపైకి వెళ్లడం లేదు. మారుతి స్క్రిప్ట్ లు నిర్మాతలకు నచ్చడం లేదా? లేదా ఆ స్క్రిప్ట్ లకు తగిన హీరోలు దొరకడం లేదా? లేదా అసలు సరైన స్క్రిప్ట్ లు మారుతి తయారుచేసుకోలేకపోతున్నారా?
వెంకటేష్ తో రాధ సినిమా అనుకున్నారు. అది కూడా వివాదాలకు తావుతీసింది. దాంతో ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి మారుతి కెరియర్ అలా నిలబడిపోయింది. ముందు ఓ ప్రొడక్షన్ హవుస్ లో సినిమా అనుకున్నారు. సునీల్ అన్నారు. కుదరలేదు. నాని అన్నారు. నిర్మాత నాట్ ఒకె అన్నారు. దాంతో మరో ప్రొడక్షన్ హవుస్ కు వెళ్లారు. అది వివాదం అయింది. సెట్ అయిందన్నారు. కానీ అక్కడా ఇంకా సెట్ పైకి వెళ్లలేదు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతోంది అని వినికిడి.
ఇలా అయితే ఎలా. మీడియం రేంజ్ దర్శకుల్లో కాంపిటీషన్ ఎక్కువ వుంది. హీరోలు తక్కువ వున్నారు. అలాంటి సమయంలో మారుతి ఎంత స్పీడుగా వుండాలి. కానీ ఎందుకిలా? ఆయన తన స్టామినా చూపించడంలో విఫలమవుతున్నారా? లేక స్టామినా ఇంతేనా అని అభిమానులు అనుకుంటున్నారు.
మరోపక్క మారుతి తన పాత బ్యాచ్ ను వదలలేకపోతున్నారన్న గుసగుసలు వున్నాయి. ఏ సినిమా అయినా దాదాపు అదే సాంకేతిక వర్గం. చిన్న సినిమాల వరకు జెబి లాంటి వాళ్లు ఒకె. కానీ పెద్ద ప్రొడక్షన్ హవుస్ కు వెళ్లినపుడు, పెద్ద సినిమా చేయాలనుకున్నపుడు మారుతి తన స్ట్రాటజీ మార్చుకోవాలి. లేకుంటే ఇంక ఇలా జంక్షన్ లో ఎంతకాలం నిలబడతారు?