వేలం పాటలో భారీ మొత్తానికి అమ్ముడైన రోజు…సదరు క్రికెటర్లను చూసి అంతా ఆశ్చర్యపోయారు. వామ్మో అంత డబ్బా.. అంటూ వాళ్ల స్థాయి పెరిగిపోయినట్టుగా చూశారు! ఏడాదికి ఒకటిన్నర నెల సమయంలో… ఆడే పద్నాలుగు మ్యాచ్ లకు అంత డబ్బా.. అనుకున్నారు! మిగిలిన స్టార్ క్రికెటర్లందరి కన్నా ఎక్కువ ధరకు అమ్ముడయ్యే సరికి వీళ్లను మరింత ప్రత్యేకంగా చూశారు. ప్రత్యేకించి ఇంతకు ముందు సీజన్ వేలం పాట సమయంలో యువరాజ్ కు పలికిన ధర అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం జీఎమ్ ఆర్ గ్రూప్ యువీని ఏకంగా ఏడాదికి 16 కోట్ల రూపాయలను వెచ్చించి కొనుక్కొంది. యువీని దక్కించుకోవడానికి ప్రాంచైజ్ ల మధ్య ఏర్పడిన పోటీతో వేలంలో ఆయన ధర అక్కడ వరకూ వెళ్లింది.
మరి అప్పట్లో యువీ కోసం అంత పెట్టిన ఆ సంస్థ ఉన్నట్టుండి చేతులెత్తేసింది. యువీని భరించలేమని.. అంత ధర చెల్లించుకోలేమని చెప్పి అతడిని వదులుకుంది. కేవలం యువీని మాత్రమే కాదు.. తాము భారీ ధరను చెల్లిస్తున్న మనోజ్ తివారీ, శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్ ను కూడా డీడీ యాజమాన్యం వదిలేసుకుంది. ఐపీఎల్ కు సంబంధించి వీరే కాదు.. ఇప్పుడు మరికొందరు భారీ మొత్తాలు పొందుతున్న క్రికెటర్లకూ ఇబ్బంది తప్పలేదు. పది కోట్ల పై మొత్తాన్ని వెచ్చించి దినేష్ కార్తీక్ ను కొని ఆశ్చర్యపరిచిన బెంగళూరు ఇప్పుడు ఆ క్రికెటర్ ను వదులుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే.. తమ తురుపు ముక్కలు అనుకున్న స్టెయిన్, ఇషాంత్ లను వదిలిపెట్టింది. బడ్జెట్ లెక్కలను వేసుకునే.. ఐపీఎల్ ప్రాంచైజ్ లు ఈ విధంగా వీరందరిని వదులుకున్నాయి.
అయినా.. వీటికి ముందు చూపు ఉండదా! కోట్ల రూపాయలను వెచ్చించే ముందు.. క్రికెటర్ల వర్త్ గురించి, వారితో ఉండే లాభాల గురించి అంచనాలుండవా… అంత ప్లాన్ లేకుండా వేలం పాడతారా? అప్పటికీ యువరాజ్ వంటి క్రికెటర్లు వేలం రోజునే డబ్బు ప్రధానం కాదని స్పష్టం చేస్తూ వచ్చారు. పదహారు కోట్ల రూపాయలు తను కోరుకున్న మొత్తం కాదు… 1.6 కోట్ల రూపాయలు ఇచ్చినా తను ఆడటానికి సిద్ధంగానే ఉంటానని యువీ అప్పట్లోనే స్పష్టం చేశాడు. అయితే లేని అతి చేసే ప్రాంచైజ్ లు ఆ డబ్బు చెల్లించలేమంటూ చేతులెత్తేస్తూ ఆటగాళ్లను ఐపీఎల్ కు దూరం చేస్తూ అటు క్రికెటర్లకు, వారి అభిమానులను అసంతృప్తి పరుస్తున్నాయి. డబ్బు కన్నా.. ఆటకు దూరం చేయడమే ఆట్మాస్పియర్ ను దెబ్బతీస్తోంది.