ఎమ్బీయస్‌: జగన్‌పై దాడి – 2/2

నాలుగో వాదన – జగన్‌ రాజకీయాలతో సంబంధం లేకుండా అతని మీదో, అతని కుటుంబం మీదో కక్ష ఉన్న వారో, వారివలన నష్టపోయినవారో దాడి చేశారు. అలా అనుకున్నా వాళ్లు పకడ్బందీగా చేస్తారు. ఏడాదిగా…

నాలుగో వాదన – జగన్‌ రాజకీయాలతో సంబంధం లేకుండా అతని మీదో, అతని కుటుంబం మీదో కక్ష ఉన్న వారో, వారివలన నష్టపోయినవారో దాడి చేశారు. అలా అనుకున్నా వాళ్లు పకడ్బందీగా చేస్తారు. ఏడాదిగా జనం మధ్యలో ఉన్నపుడు ఏ డాబా మీద నుంచో ఓ బాంబు వేసేవారు. అతను బస చేసిన ప్రదేశంమీద ఆయుధాలతో దాడి చేసేవారు. ఇలా మనిషి దొరికి పోయేట్లా ఎందుకు చేస్తారు? మనిషంటూ దొరికిన తర్వాత అతను తన వెనక్కాల ఎవరున్నారో చెప్పేసే ప్రమాదం ఉంది కదా. ఇప్పటికే రాజకీయంగా వేడెక్కిన రాష్ట్రం మరీ వేడెక్కుతుంది కదా. జగన్‌ అభిమానులు వారిని వెంటాడి, వేటాడతారు కదా. అంత రిస్కు ఎందుకు తీసుకుంటారు? ఏది చేసినా గుట్టు చప్పుడు కాకుండా చేసేవారు.

మరి దాడి చేసిన శ్రీనివాస్‌ జగన్‌ అభిమానా? టిడిపి పంపిన కిరాయి రౌడీయా (కిరాయి హంతకుడు అనడానికి మనసు ఒప్పటం లేదు)? అతను జగన్‌ అభిమాని అని, ఫ్లెక్సీలు కట్టాడని, జగన్‌కు మేలు చేయాలనే దాడి చేశాడనీ టిడిపి వాదిస్తోంది. అతను 'సానుభూతి వస్తుందని చేశా' అన్నాడు టీవీ కెమెరాల ముందు. 'అతని చేత అలా అనిపించారు' అంటుంది సాక్షి. పోలీసు కస్టడీలో ఉండగా ఏం చెప్పాడో అది వివరంగా బయటకు రాలేదు. అది కూడా పోలీసుల బలవంతం మీద అలా చెప్పాను అని కోర్టులో అంటే వీగిపోతుంది. ఇప్పుడు ఎన్‌ఐఏ వాళ్లు తమ అదుపులో తీసుకున్నాక ఏం చెప్తాడో, (లేక వాళ్లు ఏం చెప్పిస్తారో) చూడాలి.

అతను నిజంగా అభిమానా? అభిమానులు వెర్రిగానే ప్రవర్తిస్తారన్నమాట నిజం. సినిమా స్టార్లు వచ్చేవరకు గంటల తరబడి వేచి చూసి, వచ్చాక వాళ్ల కారు మీద రాళ్లేసేరకం ఉంటారు. ఇతనూ అలాగే జగన్‌ను గాయపరచి అభిమానాన్ని చాటుకుందా మనుకున్నాడా? సంఘటన తర్వాత సాటి అభిమానులు 'జగన్‌ అనుకోకుండా యింకోవైపు తిరక్కపోయి వుంటే ఆ పదునైన కత్తితో ఏ నరమో తెగి ప్రాణం పోయేది కదా, ఇదేనా నీ అభిమానం?' అని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడు? 'అబ్బే, అలా జరగకుండా మేమిద్దరం గంటల తరబడి రిహార్సల్‌ వేసుకుని పర్‌ఫెక్ట్‌ టైమింగుతో చేశాం' అని చెప్పేవాడా? అసలు యీ దాడి వలన సానుభూతి వస్తుందని ఎలా అనుకున్నాడు? దాడి జరిగి రెండు నెలలు దాటింది. జగన్‌ పేర గుళ్లల్లో, మసీదుల్లో, చర్చిల్లో ఉధృతంగా పూజలు జరిగాయా? జనాలు ఉపవాసాలు చేశారా? ఎలా ఉన్నావు నాయనా అని అందరూ ఆయన ఉన్న చోటకి పరుగులు పెట్టారా? ఎప్పటిలాగ జగన్‌ను పాదయాత్రలో చూడడానికి వచ్చేవారు వస్తూనే ఉన్నారు, పేపర్లలో, టీవీల్లో తిట్టేవాళ్లు తిడుతూనే ఉన్నారు.

'అబ్బే, ఇవన్నీ శ్రద్ధగా ఆలోచించేటంత తెలివితేటలు అతనికి లేవండి, ఏదో ఆవేశంలో చేశాడు, ఏదో రకమైన గుర్తింపు కోసం తెగించాడు' అని అంటారా? ఆ మాట టిడిపి వాళ్లు, వైసిపి వాళ్లు యిద్దరూ ఒప్పుకోవడం లేదు. అతనికి చాలా ప్లానింగ్‌ ఉంది. వెనక్కాల నుంచి ఎవరో అడిస్తూంటే వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ల ప్లానుని పకడ్బందీగా అమలు చేశాడు అంటున్నారు. టీవీలో చూడగానే అతను తిక్కతిక్కగా అనిపించినా, తక్కువ్వాడేమీ కాదని తోచింది – వైజాగ్‌ వచ్చాకనే అతని ఆర్థికస్థితిలో మార్పు రావడం, 6 ఫోన్లు, 9 సిమ్‌ల ద్వారా 1110 ఫోన్‌ కాల్స్‌ చేయడం, అతని సోదరి ఖాతాలో కొలీగ్‌ 40 వేల డబ్బు బదిలీ చేయడం చూస్తూంటే!

చివరకు రాష్ట్రప్రభుత్వం సిట్‌ విచారణ చేసి తేల్చిన విషయాలను వైజాగ్‌ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ లడ్డా జనవరి 2న వెల్లడించారు. సింపుల్‌గా చెప్పాలంటే – 'ఏదో సంచనలం కోసం చేశాడు తప్ప కుట్ర ఏమీ లేదు' అని తేల్చేశారు వాళ్లు. వాళ్ల కథనం ప్రకారం – నిందితుడు పది నెలల క్రితమే యిది ప్లాను చేశాడు. అప్పుడే ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంటులో పనికి చేరాడు. అలా పని చేయాలంటే ఎఇపి (ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌) ఉండాలి. అతనిపై ఏ కేసులూ లేవని ఎయిర్‌పోర్టు అధికారులకు పోలీసులు నివేదిక యిచ్చారు. (సాక్షి దీనిలో తప్పులు పట్టింది. తూగోజిల్లా పోలీసులు యిచ్చారని ఓ సారి, వైజాగ్‌ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌ వాళ్లిచ్చారని మరోసారి చెప్పారట. అసలు ఏఇపి కోసం ఎవరూ అప్లయి చేయలేదని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ వాళ్లు చెప్పారట. అంటే ఏ సెక్యూరిటీ అనుమతి లేకుండా పనిచేసేయవచ్చన్నమాట) జగన్‌పై దాడి చేయడానికి రెండు కోడి కత్తులు కొని, ఒకటి తూగోజిల్లాలో ఠాణేలంకలో దాచి, మరోటి వైజాగ్‌ తెచ్చాడు.

జగన్‌పై దాడి చేసినప్పుడు అతనికి సెప్టిక్‌ కాకుండా స్టెరిలైజ్‌ చేశాడు. తను చేయబోయే పని గురించి తన ఫ్రెండ్స్‌తో ముందే చెప్పాడు. అక్టోబరు 18న చేద్దామనుకున్నాడు కానీ కుదరలేదు. ఆ పై వారం చేశాడు. దానికి ముందు ఒక అమ్మాయి చేత, మరో అబ్బాయి తో కలిసి 9 పేజీల లేఖ రాయించాడు. అది తనతో తెచ్చుకున్నాడు. జేబులోని పర్సులో కోడికత్తిని పెట్టుకుని ఎయిర్‌పోర్టుకి వస్తే పోలీసులు అతని పాస్‌ చూసి లోపలికి పంపేశారు కానీ పర్సును తనిఖీ చేయలేదు. (కోడి కత్తి బ్లేడు అంగుళన్నర నుంచి, రెండున్నర అంగుళాలు ఉంటుందట, పిడి కనీసం 3 అంగుళాలుండకపోతే పట్టుకోలేం. పర్సులో నాలుగంగుళాలకు మించిన వస్తువు పట్టదు. కత్తి ఫోటో చూస్తూంటే దాన్ని పర్సులో ఎలా దూర్చాడో అనిపిస్తోంది) తనకేదైనా అయితే తన అవయవాలను దానం చేయమని రాసుకున్నాడు. (తనకు ఏదైనా జరిగే డేంజరు ఉందని ఎందుకనుకున్నాడు? ప్రాణం పోయినా ఫర్వాలేదనుకుని దీనిలోకి దిగాడా? ప్రాణం కంటె సంచనలం సృష్టించడం ముఖ్యమనుకున్నాడా?)

వైసిపి వాళ్లు ఎయిర్‌పోర్టులో క్యాంటీన్‌ యజమాని టిడిపి సానుభూతి పరుడు, వారి ద్వారా చాలా ప్రయోజనాలు పొందాడు, శ్రీనివాస్‌ చేత అతను చేయించిన హత్యాప్రయత్నమే యిది అంటూ ముందుకు తెచ్చిన అంశాలను తోసిరాజన్నారు. బహుశా ఆ ఆధారాలు చాలలేదేమో!  శ్రీనివాస్‌ తన ప్రాంతంలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విషయం మాకు తెలియదన్నారు. ఘటన జరిగిన రోజే పదినెలల క్రితం కట్టిన ఫ్లెక్సీ విషయం బయటపడడం వెనుక ఎలాటి ముందస్తు వ్యూహం లేదన్నారు. ఫ్లెక్సిలో గరుడపక్షి వేయడానికి, ఆపరేషన్‌ గరుడకు సంబంధం లేదు, కేవలం యాదృచ్ఛికం, శ్రీనివాస్‌కు పక్షి అంటే యిష్టం అన్నారు. ఆ 9 పేజీల లేఖ నలగకపోవడానికి కారణం అతను ఎయిర్‌పోర్టుకి మరొకరి బ్యాగ్‌లో పెట్టి తెచ్చాడని, తర్వాత జేబులో పెట్టుకున్నాడనీ అన్నారు. (ఈ లేఖ దాడి చేసినపుడు అతని జేబులో లేదని, ఉంటే జేబులో ఎత్తుగా కనబడేదని, వెంటనే సోదా చేసి లాక్కుని ఉండేవారని, అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత రాత్రికి సర్ఫేస్‌ అయిందని సాక్షి ఎత్తి చూపింది, అందుకని యీ వివరణ).

ఈ ప్రకటనను వైసిపి ఎలాగూ ఆమోదించలేదు. 'ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు' అని ముందే డిక్లేర్‌ చేసేసింది. కానీ టిడిపి అలా అనలేదు కదా. వాళ్లు 'దీనిలో ఎవరి ప్రమేయమూ లేదు' అంటూ చేసిన ఆ ప్రకటనను ఖండించలేదు. వాళ్ల ఆధ్వర్యంలో నడిచే పోలీసు వ్యవస్థే కాబట్టి కరక్టే అని నమ్మి తీరాలి. మరి అలాటప్పుడు వారు చెప్తూ వచ్చిన కుట్ర థియరీ తప్పని ఒప్పుకోవాలి కదా. జగన్‌ తన మీద తనే చేయించుకున్న దాడి అని కొన్నాళ్లు, లేదు, తల్లి తదితర కుటుంబసభ్యులు చేయించారని కొన్నాళ్లు అన్నారు. అవన్నీ తప్పుడు మాటలు అని వెనక్కి తీసుకోవాలి కదా. ఇంకా 'కోడికత్తి పార్టీ' అంటూ అవహేళన చేయడమేమిటి? అలా కింది స్థాయి నాయకులు అంటే పోనీలే అనుకుంటాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనడమేమిటి? ఒకసారి కాదు, పదేపదే అనడమేమిటి?

ఏ నాయకుడిపై సంఘటన జరిగినా ముఖ్యమంత్రి, తదితర నాయకుల నుంచి మొదటగా వచ్చే స్టేటుమెంటు – 'దీన్ని మేం ఖండిస్తున్నాం, ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు తావు లేదు' అని. ఇన్నేళ్ల రాజకీయానుభవం ఉన్న బాబు గారి నోట వచ్చిన మాట – 'సానుభూతి కోసమే హత్యాయత్నం చేయించారు' అని. అది డ్రామాయో, సినిమాయో అంత త్వరగా ఎలా చెప్పగలరు? మాటవరసకి, బాబు ఎన్టీయార్‌పై దాడికి మల్లెల బాబ్జీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, కానీ మధ్యలో ఇంకో బ్లేడ్‌ బాబ్జీ వచ్చి నిజంగా ఎటాక్‌ చేస్తే..? అప్పుడు దాన్ని డ్రామా అనగలమా? అందువలన వార్త బయటకు రాగానే దాడి చేసినవాడు ఎవరూ, ఏమిటి, వాడి కథేమిటి తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి తప్ప తొందరపడి ఏమీ అనకూడదు.

రాజకీయ చాతుర్యం ఉన్నవాడైతే మొదట కంగారు పడినట్లు నటించి, తర్వాత 'అబ్బే యిదంతా ఉత్తుత్తిదేట, అనవసరంగా ఆవేదన పడ్డాను' అనాలి. కానీ బాబు అలా చేయక విమర్శల పాలయ్యారు. ఎందుకంటే రాజకీయ నాయకులు మనసులో అభిప్రాయాలు ఎలా వున్నా బయటకు మర్యాదలు నటిస్తారు. బాబు యీ విషయంలో మర్యాద పాటించకపోవడంతో గతంలో ఆయనపై దాడి జరిగినపుడు వైయస్‌ పాటించిన మర్యాదను అందరూ గుర్తు చేసుకున్నారు. జగన్‌ను పరామర్శించిన వాళ్లను కూడా బాబు తప్పుపట్టారు (దీనిలో కాంగ్రెసువారికి మినహాయింపు వుంది) ఇక డిజిపి ఠాకూర్‌ గారు – ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా,  మధ్యాహ్నం 12.45 గంటలకు సంఘటన జరిగితే 1.30 కల్లా ఆయన 'సానుభూతి కోసమే దాడి జరిగింది, దాడి చేసినతని మానసిక స్థితి సరిగ్గా లేదు' అనడమేమిటి?

మామూలుగా పోలీసులు ప్రెస్‌ వాళ్లు ఎంత రొక్కించినా ఏదీ ఓ పట్టాన చెప్పరు. 'విచారణ జరుపుతున్నాం, అన్ని విషయాలూ ఒకేసారి చెపుతాం' అంటారు. మరి ఈయనేమిటి? దివ్యదృష్టి ఉన్నట్లు సంఘటన జరిగిన గంటలోపే అలా సెలవిచ్చాడు? ఆయనేమైనా డాక్టరా, మానసిక స్థితి గురించి పరీక్షలు చేయకుండానే మాట్లాడడానికి? 'మీ పోలీసులను నేను నమ్మను' అని అనడానికి జగన్‌కు అవకాశ మిచ్చినట్లయింది కదా. మనలో మనమాట, ఆయన అలా అనకపోయినా, జగన్‌ అదే స్టేటుమెంటు యిచ్చేవాడనుకోండి. కానీ యీయన ఆ నింద పడడం దేనికి? ఏం బావుకున్నాడు? టిడిపి నాయకుల హర్షధ్వానాలా? అవి ఎలాగూ ఉంటాయి కదా! ఇప్పుడు ఫైనల్‌ విచారణ తర్వాత విచారణాధికారి అతని మానసిక స్థితి బాగాలేదని అనలేదు. పది నెలల క్రితమే పక్కాగా ప్లాన్‌ చేశాడు అన్నారు. మరి డిజిపిగారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి?

ఆయన ఆ పల్లవి పాడగానే టిడిపి మంత్రులు చరణాలు అందుకున్నారు. కొందరు ఆపరేషన్‌ గరుడలో భాగమన్నారు, మరి కొందరు జగన్‌ తనే చేయించుకున్నాడన్నారు. ఎలా జరిగినా శాంతిభద్రతలు  అనే అంశం రాష్ట్రపరిధిలోకి వస్తుంది కాబట్టి, వాళ్లే బాధ్యత వహించాలి. కానీ యీ సంఘటన జరగ్గానే రాష్ట్ర పోలీసులు, టిడిపి వారు ఎయిర్‌పోర్టు మా పరిధిలోకి రాదు, కేంద్రం పరిధిలోకి వస్తుంది, అందువలన మాకు బాధ్యత లేదు అని. చిన్నప్పటి నుంచి వింటూంటాం – కత్తిపోటుకి గురైన వ్యక్తి పోలీసు స్టేషన్‌కి వెళితే 'సంఘటన జరిగిన స్థలం మా స్టేషన్‌ పరిధిలోకి రాదు' అని పంపించేశారని. ఇదీ అలాగే తయారైంది. ఎయిర్‌పోర్టులో మూడు నెలలుగా సిసిటివిలు పని చేయటం లేదు. పోలీసులు పర్సు తనిఖీ చేయకపోవడం చేత కాంటీన్‌లోకి కోడి కత్తి వెళ్లింది. ఇవి సరిదిద్దుకోవాలి. లేకపోతే వైజాగ్‌కి విమానంలో రావడానికి మనుషులు దడుస్తారు.

ఇదెలా అంటే అది కేంద్రం బాధ్యత అంటారు. సరే, కేంద్రం పరిధిలోది కాబట్టి కేంద్రసంస్థ విచారణ చేపట్టింది, హమ్మయ్య, వదిలింది గొడవ అనుకోవచ్చుగా! అబ్బే, మేమే విచారణ చేస్తామంటూ గోల దేనికి? హక్కులు కావాలి కానీ, బాధ్యతలు వద్దా? లాజిక్‌ లేని యీ గోలకు కారణం ఏమిటంటే – జగన్‌కు, బిజెపికి ఎలా ముడిపెట్టాలా అన్న తాపత్రయం. జగన్‌ తనపై దాడిని తనే ప్లాను చేసుకున్నాడు, దానికి బిజెపి సహకరించింది, తన జ్యురిస్‌డిక్షన్‌ ఉన్న ప్రాంతంలో చేయించింది – అని నిరూపించాలని. రాజకీయలబ్ధి అనేది బై ప్రోడక్టుగా ఉండాలి. ముందు రాష్ట్రం యిమేజి కాపాడుకోండి. ఈ దాడి జగన్‌ మీద జరిగింది కాబట్టి యిలా అంటున్నారు, రేపు రాహుల్‌ మీద జరిగితే ఏమంటారు? వైజాగ్‌లో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన విదేశీప్రముఖుడిపై జరిగితే ఏం చెప్తారు? మాదేం బాధ్యత లేదంటారా?

ఎయిర్‌పోర్టు దాటి చూడండి, శాంతిభద్రతలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకుంటారా? మరి తిరుపతిలో అమిత్‌ షా పై దాడి జరిగింది. దానికి ఎవరు బాధ్యులు? అదీ బిజెపి వాళ్లు చేయించుకున్న దాడేనా? ఏదైనా సంఘటన జరగ్గానే 'రాయలసీమ రౌడీలు' అనే మాట వాడేస్తూ ఉంటారు. తుని సంఘటన జరగ్గానే బాబు వెంటనే దీని వెనక్కాల వాళ్లే ఉన్నారన్నారు. కడప జిల్లా వాళ్లు అని ఐడెంటిఫై కూడా చేసేశారు. తీరా విచారణ జరిపి కేసులు పెట్టబోతే అందరూ తూగోజిల్లా వాళ్లే తేలారు. అమరావతిలో రాజధాని భూముల అప్పగింత విషయంలో కుప్పలు తగలబడితే వైసిపి వాళ్లని అనేశారు. ఈ మధ్యే ఆ కేసులు ఎత్తేశారు, ఎందుకు? చేసినవాళ్లు అస్మదీయులని తేలిందా?

ఇలాటి దాడి బాబుపై ఆయన అభిమాని చేస్తే…? జగన్‌ కంటె బాబుకి అభిమానులు ఎక్కువ కదా, అప్పుడేం చేస్తారు? ఎయిర్‌పోర్టులో జరిగిందా, సీ పోర్టులో జరిగిందా? కేంద్ర పరిధా, అంతర్జాతీయ జలాల్లో జరిగిందా అనే చర్చ చేస్తారా? మా బాధ్యత లేదంటారా? దిల్లీలో ఆంధ్రభవన్‌లో జరిగిందనుకోండి, బాధ్యత దిల్లీ పోలీసులదా, కేంద్ర హోం శాఖదా, అనే చర్చ పెడతారా? జగన్‌ తల్లి చేయించిందని అధికార పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపణ చేశారు. వెంటనే ప్రభుత్వం ఆవిడ మీద కేసు పెట్టి జైల్లోకి తోసేయాలి కదా. విచారించాలి కదా! ఆధారాలేమున్నాయని రాజేంద్రప్రసాద్‌ను అడగాలి కదా! ఏం చేశారు? గమనించ వలసిన విషయమేమంటే – ప్రతిపక్ష నాయకుడిపై దాడి పెద్ద విషయం, దాన్ని సీరియస్‌గానే డీల్‌ చేయాలి. కోడికత్తి అంటూ అవహేళనలు చేసి గాలిలో వదిలేయరాదు. విచారణ చప్పున ముగించాలి. ఎటాక్‌ చేసినవాణ్ని నెలల తరబడి దాచడం అనుమానాలు పెంచినట్లే అయింది. దానికి బదులు జగన్‌ యిక్కడ ఫిర్యాదు చేయలేదు, పక్క రాష్ట్రం వెళ్లిపోయాడు, వెళ్లి యింట్లో పడుక్కున్నాడు, మేమెందుకు పట్టించుకోవాలి? లాటి వాదనలు చెల్లవు. కోర్టు కూడా యివన్నీ వినలేదు.

రాష్ట్రప్రభుత్వం చేసిన పొరబాటును ఎత్తి చూపింది. దాడి పౌరవిమానయాన భద్రతా చట్టం పరిధిలోకి వస్తున్నపుడు కేంద్రప్రభుత్వానికి లేఖ ఎందుకు రాయలేదు? అని నిలదీసింది. దానికి వీళ్ల దగ్గర సమాధానం లేదు. డిజిపి స్థాయి వ్యక్తికి కూడా యీ విషయం తోచలేదంటే పరిస్థితి ఘోరంగా ఉన్నట్లే! విచారణ కేంద్ర సంస్థలపై జరిపించమని వైసిపి కోర్టుని కోరింది. కోర్టు అడిగితే కేంద్రం ఎన్‌ఐఏ చేత చేయిస్తామంది. ఇక బాబుకి అలజడి ప్రారంభమైంది. ఇది రాష్ట్రం హక్కులపై దాడి అంటూ ధ్వజమెత్తింది.  ఎన్‌ఐఏ వాళ్లు వైజాగ్‌ రాగానే వైజాగ్‌ పోలీసు కమిషనర్‌ లడ్డా నాలుగు రోజులు లీవు మీద వెళ్లారు. దానికి మూడు రోజుల క్రితం ఈయనే సిట్‌ విచారణ ఫలితాలను ప్రెస్‌కు వెల్లడించారు. ఈ లీవు సహాయనిరాకరణకు సంకేతమా? ఏమో!

దర్యాప్తు సాగుతూండగానే ఈ కేసు దర్యాప్తు అంశం ఎన్‌ఐఏ పరిధిలోకి రాదని బాబు కేంద్రానికి లేఖ రాశారు. రాకపోతే కోర్టు ఎందుకు అనుమతిస్తుంది? ఆయేషా కేసు సిబిఐ విచారిస్తూంటే లేని అభ్యంతరం దీనిలో ఎందుకు? జగన్‌ కేసు ఎన్‌ఐఏ విచారిస్తే కొంపలేం మునుగుతాయి? ఈయన ఏం మొత్తుకుంటున్నా ఎన్‌ఐఏ వారు శ్రీనివాసరావును నిన్న తమ అదుపులోకి తీసుకున్నారు. వాళ్లయినా సందేహనివృత్తి చేస్తారని ఆశిద్దాం. వాళ్ల ఫైండింగ్స్‌ను టిడిపి ఎలాగూ తిరస్కరిస్తుందని గ్యారంటీగా చెప్పవచ్చు. ఎవరి ప్రమేయం లేకుండా తనే చేశాడనీ, లేదా టిడిపి కాకుండా మరో పార్టీ ప్రమేయంతో చేశాడని ఎన్‌ఐఏ ప్రకటిస్తే వైసిపి ఎలా స్పందిస్తుందాని ఊహించి చూడండి. తమాషాగా ఉంటుంది. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
[email protected]

ఎమ్బీయస్‌: జగన్‌పై దాడి – 1/2