cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జగన్‌పై దాడి - 1/2

ఎమ్బీయస్‌: జగన్‌పై దాడి - 1/2

ముందే చెప్పేస్తున్నాను - 2018 అక్టోబరు 25న జగన్‌పై దాడి ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో నాకు తెలియదు. నేనేమీ కొత్త రహస్యాలు చెప్పబోవటం లేదు. ఈ ఆర్టికల్‌ చదివాక మీరు మరింత అయోమయానికి గురైతే అది నా తప్పు కాదు. దాడి తర్వాతి సంఘటనలలో నా దృష్టిని ఆకర్షించినవి పంచుకుంటున్నానంతే. నిజానికి దీనిపై ఆర్టికల్‌ రాయదగినంత సబ్జక్టు లేదని చాలాకాలం ఊరుకున్నాను. కానీ పోనుపోను టిడిపి వైఖరి చూస్తూ ఉంటే దీనిలో ఏదైనా ఉందేమో, అది మిస్సవుతున్నామేమోనని అనిపించసాగింది.

1984లో మల్లెల బాబ్జీ సంఘటన జరిగినపుడు కూడా ముందులో చిన్న సంఘటనగా, ఓ అభిమాని వెర్రి చేష్టగా కొట్టిపారేయడం జరిగింది. కానీ తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడంతో, చనిపోతూ లేఖ రాయడంతో అది పెద్ద విషయంగా తేలింది. తాజాగా ఎన్‌ఐఏ విచారణపై టిడిపి ప్రభుత్వం స్పందించిన తీరు విస్మయాన్ని కొలుపుతోంది. ఒట్టి పంతానికే పోతోందా, లేక అంతకంటె లోతుగా ఏమైనా ఉందా అనే సందేహం వస్తోంది. 

రఫేల్‌ వివాదం ఏడాదిగా నలుగుతోంది. డిఫెన్సు డీల్స్‌ గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మామూలేలే అనుకుని తాపీగా చదువుకుంటూ ఉన్నాను తప్ప ఆర్టికల్‌ ఏదీ రాయాలనిపించలేదు. కానీ పోనుపోను మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే సంశయాలు బలపడుతున్నాయి. కాగ్‌ విషయంలో సుప్రీం కోర్టుని తప్పుదారి పట్టించడమేమిటి? తాజాగా అలోక్‌ వర్మ వచ్చి సీట్లో కూర్చోగానే హడావుడిగా తరిమివేయడానికి కారణం ఏమిటి? రఫేల్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తాడన్న భయమేనా? నిజంగా ఏదో గోల్‌మాల్‌ జరిగిందా? లేకపోతే పారదర్శకంగా ఎందుకు ఉండటం లేదు? అనే అనుమానం మోదీపై కలుగుతోంది.

అదే విధంగా యీ దాడి జరిగిన దగ్గర్నుంచి, టిడిపి నాయకుల ప్రవర్తనే కాదు, డిజిపి ప్రవర్తన కూడా ఆక్షేపణీయంగానే ఉంది. నిందితుణ్ని రెండునెలలకు పైగా దగ్గర ఉంచుకుని కూడా నిర్ద్వంద్వంగా ఏమీ తేల్చకుండా, అలా అని కోర్టు వాళ్లు ఎన్‌ఐఏకు అప్పగిస్తే దాన్ని తప్పుబట్టి.. ఏం జరుగుతోంది? అటు చూస్తే వైసిపి యిది కచ్చితంగా హత్యాయత్నమే అంటుంది. నిజం తేలేదెలా?

నేతినేతి వాదం అని ఉపనిషత్తుల్లో ఓ సిద్ధాంతం ఉంది. వెన్న కాస్తే వచ్చే నేతితో దానికి సంబంధం లేదు. న ప్లస్‌ ఇతి - నేతి అవుతుంది. న, ఇతి అంటే యిది కాదు అని అర్థం. దేని గురించైనా తెలుసుకోవాలంటే, అది ఏదికాదో ముందు తెలుసుకోవాలి. 'నేను' అంటే ఎవరు? అని ప్రశ్న. శరీరమా? కాదు, ఎందుకంటే 'ఇది నా శరీరం' అంటాం. అలాగే మనస్సు గురించి 'నా మనస్సు' అంటాం. అంటే 'నేను' అనేది వేరే ఉందన్నమాట... యిలా సాగుతుంది వాదన. అలాగే జగన్‌పై దాడి విషయంలో వినిపిస్తున్న సిద్ధాంతాల్లో ఏవి కావో లాజికల్‌గా కొట్టేసుకుంటూ వచ్చేద్దాం.

మొదటగా చూడాల్సింది - 'జగన్‌పై అది హత్యాయత్నం, చేయించినది టిడిపి వారు, మరీ ముఖ్యంగా బాబు' అనే ఆరోపణ గురించి. అలా చేయించాల్సిన అవసరం బాబుకి ఏముంది? ఆ ప్రయత్నం సఫలమై ఒకవేళ... ఒకవేళ జగన్‌ మరణించాడే అనుకోండి. దానివలన బాబుకి నష్టమే తప్ప లాభమేముంది? ప్రమాదంలో వైయస్‌ అకాల మరణం వలన ఉవ్వెత్తుగా సానుభూతి వచ్చిపడింది. వైయస్‌ బతికుండగా అసహ్యించుకున్న వాళ్లు సైతం 'పాపం పోయాడు' అనుకున్నారు. (ఆ సానుభూతిని అర్జంటుగా తన ఓటుబ్యాంకుగా మలచుకోవాలన్న ఆశే జగన్‌ను యీ స్థితికి తీసుకువచ్చింది) కాంగ్రెసు వాళ్లు జగన్‌పై కేసులు పెట్టినపుడు కూడా చనిపోయిన వైయస్‌కు గురి పెట్టకుండా కేవలం జగన్‌కే గురిపెట్టబోయి నానా తంటాలూ పడ్డారు. 

ఈ రోజుల్లో సింపతీ ఓటు కున్న బలం అంతాయింతా కాదు. అనకూడదు కానీ, యీనాడు అసెంబ్లీలో చూస్తే అనేకమంది మాజీ ఎమ్మెల్యేల వితంతువులు, కొడుకులు, కూతుళ్లు, తమ్ముళ్లు కనబడతారు. పోయిన ఎమ్మెల్యేకు నివాళిగా వారి వారసులను పోటీ లేకుండా నెగ్గిద్దాం అనే విజ్ఞప్తులు తరచు వినబడుతూ ఉంటాయి. బాబుకు సింపతీ విలువ బాగా తెలుసు. బతికుండగా హరికృష్ణను కరివేపాకులా తీసిపారేసినా, పోగానే ఆయన కూతురికి కూకట్‌పల్లిలో టిక్కెట్టిచ్చారు. ఎంతోమంది టిడిపి ఉద్దండులు దానికోసం పోటీ పడినా సుహాసినికి ఆ సీటు దక్కిందంటే కారణం, వాళ్ల నాన్న మరణించడం! మరి అలాటప్పుడు అనవసరంగా జగన్‌ను చంపించి, అతని విగ్రహాలు రాష్ట్రమంతా వెలిసేట్లా చేస్తారా బాబు? ఇప్పటికే రాష్ట్రమంతా ఎన్టీయార్‌, వైయస్సార్‌ విగ్రహాలతో కిటకిటలాడి పోతోంది. ఇప్పుడు జగన్‌వి కూడా తోడైతే..? ఆ విగ్రహాలను సోపానాలుగా చేసుకుని జగన్‌ సోదరో, భార్యో బాబుకి పోటీగా తయారైతే ఎంత తలకాయనొప్పి?

పైగా బాబుకి మోసచరిత్ర ఉంది కానీ రక్తచరిత్ర లేదు. ఆయనది ఫ్యాక్షనిస్టు కుటుంబం కాదు, ఆ పోకడలు లేవు. ఈ మధ్య లక్ష్మీపార్వతి చెప్పుకున్నారు - వాళ్లింట్లో పనివాళ్ల దగ్గర్నుంచి అందరూ బాబు గూఢచారులేట. భార్యాభర్తలు మాట్లాడుకున్నవి కూడా అతనికి తెలిసిపోయేవట. అలాటప్పుడు వాళ్ల చేతే ఎన్టీయార్‌కు విషప్రయోగం చేయించి కడతేర్చవచ్చుగా. జగన్‌ ఒక్కడే బాబుకి ఆంధ్రలో ప్రతిపక్ష నాయకుడు. అతను వాళ్ల నాన్న మరణం దగ్గర్నుంచి వీధుల్లో తిరుగుతూనే ఉన్నాడు. ఇంటిపట్టున ఉండేది బహుతక్కువ. జనం మధ్యలో ఉండగా ఏమైనా చేయించడం ఎంత సులభం? దొమ్మీ జరిగింది, దానిలో ఎవరో తోసేశారు, పొడిచేశారు అనేయవచ్చు కదా. బాబు చాలా కష్టపడి యీ స్థాయికి వచ్చారు. అడుగడుగునా ప్రత్యర్థులతో పోరాడుతూనే ఉన్నారు. టిడిపిలోనే ఎంతోమంది అసూయాపరులు అవరోధాలు కల్పించారు. వాళ్లలో ఎవరినీ యీయన చంపించలేదు. తన రాజకీయ చాతుర్యం/కౌటిల్యం/కుటిలత్వంతో ఒక్కొక్కరిని పక్కకు నెట్టేస్తూ పైకి వచ్చారు. ఈయన చేతిలో దెబ్బ తిన్నవాళ్లు మోసపోయామని ఆక్రోశించారు కానీ నన్ను చంపించబోయాడని ఆరోపణలు చేయలేదు. అలాటి బాబు, యీ రోజు జగన్‌ని చంపించి, అతన్ని అమరవీరుడిగా చేస్తారా?

రెండో వాదన - 'బిజెపి చేయించింది. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగింది కాబట్టి శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించి, బాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయించడానికి యీ పన్నాగం పన్నింది' అని. దీనికి ఆధారం 2018 మార్చిలో వెలువడిన శివాజీ విరచిత గరుడ పురాణం! ఇది జరగగానే 'అబ్బ, బ్రహ్మంగారి కాలజ్ఞానంలా అచ్చు అలాగే జరిగింది' అనేశారు టిడిపి వారు. శివాజీ కూడా భుజాలు చరుచుకున్నారు. వీరెవరికీ తట్టలేదు - ఒకసారి శివాజీ వాళ్ల స్ట్రాటజీని బయటపెట్టాక, స్క్రిప్టు మార్చేయకుండా ఉంటారా? సినిమా కథ లీకైతేనే సన్నివేశాలు మార్చేస్తారు కదా. ఆర్నెల్ల క్రితం లీకైనా, అదే స్క్రిప్టు పట్టుకుని కూర్చుంటారా? వెరైటీ కోసం అధికార పార్టీ నాయకుడిమీదనే దాడి చేయించడమో,  లేదా వైజాగ్‌ సదస్సులకు వస్తున్న విదేశీ ప్రముఖుల మీదో, దేశీయ పారిశ్రామిక వేత్తలమీదో ఉత్తుత్తి దాడి చేయించేవారు కదా! అయినా శివాజీ చెప్పిన గరుడ పురాణం రాజకీయాలతో ముఖపరిచయం ఉన్నవారెవరైనా రాసేయగల స్క్రిప్టు. ఐటీ దాడులు జరుగుతాయి వగైరా ఎవరైనా ఊహించవచ్చు. 

మళ్లీ స్క్రిప్టు రాయడానికి బద్ధకించి పాతదే అమలు చేశారనుకోండి, మరి బిజెపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలిగా, బర్తరఫ్‌ చేయమని గవర్నరు వద్దకు మహజర్లు పట్టుకుని వెళ్లాలిగా! గరుడపురాణ ప్రవచనకర్త '..ముఖ్య రాజకీయపార్టీ నేతపై ప్రాణాపాయం లేని దాడి చేస్తారు, అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారు..' అన్నారు. మరి అల్లర్లు ఎక్కడా జరగలేదుగా! సాక్షి ఒక్కటే ఆ దాడిని పట్టుకుని వేళ్లాడుతోంది తప్ప బిజెపి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే దానికీ తెలుసు - ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేస్తే బాబుకి సింపతీ పెరిగిపోతుందని. ఆయన బయటకు వచ్చి మీకోసం ఎన్నో చేద్దామనుకున్నాను, కానీ మీ అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని ఆ దుర్మార్గులు బయటకు నెట్టేశారు. మీరే వారికి బుద్ధి చెప్పాలి, అని కాన్వాసింగ్‌ మొదలుపెడతాడు. గవర్నరు పాలన సరిగ్గా సాగకపోతే ఆ పాపభారం బిజెపిపై పడుతుంది. ఎందుకొచ్చిన తంటాలు, అంతకంటె బాబునే కంటిన్యూ చేసి ఆ రూపాయి ఏం చేశావ్‌, ఆ అర్ధ ఎక్కడ పెట్టావు? అని దబాయిస్తూ గడపడమే మేలు. అందువలన గరుడ పురాణం లింకు దీనికి లేదు అనుకోవచ్చు.

ఇక మూడో వాదన - జగనే తనపై తను చేయించుకుని, సింపతీ కొట్టేద్దామనుకున్నాడు అని. ఇప్పటికే జగన్‌ అంటేనే సింపతీకి, పరామర్శకు పర్యాయపదం అయిపోయాడు. ఋణమాఫీ గురించి ఒక్క అబద్ధం ఆడలేకపోవడం చేత అధికారం పోగొట్టుకున్నానని యిప్పటికే సెల్ఫ్‌పిటీలో ఉన్నాడు. నిజంగా తనను తాను చంపించుకోడు కదా, ఎటాక్‌కు గురయ్యాడు అనగానే అయ్యోపాపం అని వచ్చి ఓట్లేసేస్తారా? బాబు మావోయిస్టు ఎటాక్‌కు గురయ్యారు. మరణం అంచులదాకా వెళ్లి వచ్చారు, అయినా జనం జాలిపడ్డారా? ఓడించి యింటికి పంపించి రెస్టు తీసుకోమన్నారు. అది చూసి కూడా జగన్‌ మళ్లీ అలాటి సింపతీ కోసం పాకులాడతాడా? పైగా యిలాటి ఎటాక్‌ జరిగిందంటే మల్లెల బాబ్జీ ఉదంతం గుర్తుకు వచ్చి అందరూ నవ్వుకుంటారనే భయం ఉంటుంది. దాని గురించి చాలామంది మర్చిపోయి ఉంటారు కానీ జగన్‌ సంఘటన రాగానే దాన్ని తవ్వి, తలపోశారు. 

లాల్‌ బహదూర్‌ స్టేడియంలో 1984 జనవరి 9న ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఆ సభలోనే జనం మధ్యన ఉన్నాను. ఎన్టీయార్‌ పాలన పూర్తయిన ఏడాది సందర్భంగా జరిగిన సభ అది. దానిలో ఆయన మురళీధరరావు కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తానని ప్రకటించాడు తప్ప రెచ్చగొట్టే ప్రసంగం ఏదీ చేయలేదు. అందువలన ఆ బాబ్జీ అప్పటికప్పుడు ఆవేశంలో దాడి చేశాడని అనుకోవడానికి లేదు. దాడి జరగ్గానే పెద్ద కలకలం ఏమీ జరగలేదు. ఓ 22 ఏళ్ల రామారావు అభిమాని 'ఇందిరా గాంధీ జిందాబాద్‌' అంటూ చిన్న చాకుతో ఎన్టీయార్‌ బొటనవేలుని గాయపరిస్తే (ఎన్టీయార్‌ తనే గాయం చేసుకున్నాడని బాబ్జీ తర్వాతి రోజుల్లో ఆరోపించాడు) కాస్త రక్తం కారింది. 2 సెం.మీ.ల గాయమట. దానికే ఆయన రెండు, మూడు వారాలు కట్టు కట్టుకుని కనబడ్డాడు.  ఎన్టీయార్‌ సినిమా కెరియర్‌ చూస్తే అనేక ప్రమాదాలకు ఆయన చలించలేదని తెలుస్తుంది. ఎప్పుడో యవ్వనంలోనే కాదు, ''చండశాసనుడు'' (1983) షూటింగు టైములో కూడా ఎడ్లబండి ఆయనపై నుంచి వెళ్లిపోయిందట. ఈ బాబ్జీ సంఘటన జరిగిన 8 నెలలకే అమెరికా వెళ్లి గుండెకు చికిత్స చేయించుకుని వచ్చి కూడా నాదెండ్ల తనను పదవీభ్రష్టుణ్ని చేశాడనగానే జనంలో చెడామడా నెల్లాళ్ల పాటు ఏకధాటీగా తిరిగేసిన ధీశాలి. అలాటాయన చిన్న గాయానికి అంత పెద్ద కట్టు కట్టుకున్నాడంటే ఫన్నీగా అనిపించింది.

ఇప్పుడు టిడిపి వాళ్లు అంటున్నట్టుగానే అప్పట్లో కాంగ్రెసువాళ్లు యిది టిడిపి సింపతీ కోసం ఆడించిన డ్రామా అని, దాని స్క్రీన్‌ప్లే బాబుదే అని అన్నారు. ఆ తర్వాత 1987 నవంబరులో బాబ్జీ ఆత్మహత్య చేసుకోవడం, దానిపై ఎన్టీయార్‌ ప్రభుత్వమే జస్టిస్‌ శ్రీరాములు కమిటీ వేయడం, ఆయన యిచ్చిన నివేదిక టిడిపిని యిరకాటంలోకి నెట్టడం జరిగింది. చనిపోతూ బాబ్జీ రాసిన రెండు లేఖల్లో వివరాలన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం పబ్లిక్‌ సింపతీ కోసం ఎన్టీయార్‌ అల్లుడు చంద్రబాబే యీ పథకాన్ని రచించారు. ఉద్యోగమిస్తాం, 3 లక్షలిస్తాం, యీ నాటకమాడు అని బాబ్జీని 30 వేల అడ్వాన్సు యిచ్చి దింపారు. బాబ్జీని పోలీసులు పట్టుకోగానే ఎన్టీయార్‌ క్షమించేశానన్నారు. కానీ పోలీసులు జైల్లో పెట్టి కేసు నడిపారు. 

బయట కాంగ్రెసు వాళ్లు యిదంతా నాటకం అని గోల చేస్తూ ఉండగా, అబ్బే అదేం కాదు, నేనే పథకం వేసి, అమలు చేశానని బాబ్జీ పోలీసు అధికారి విజయరామారావుకి లేఖ రాసి యిచ్చాడు. (ఆత్మహత్య చేసుకోబోతూ రాసిన ఉత్తరంలో యిది బలవంతాన రాసినట్లు బాబ్జీ వెల్లడించాడు, విజయరామారావు గారు సిబిఐకు డైరక్టరుగా చేసి, రిటైరయ్యాక టిడిపిలో చేరి, మంత్రి కూడా అయ్యారు) ఓ ఏడాది పోయాక విచారణకు రాగానే రామారావు కోర్టులో స్వయంగా హాజరై బాబ్జీని క్షమించమని కోరారు. జడ్జిగారు అతనికి ఓ ఏడాది శిక్ష వేసి, అండర్‌ ట్రయల్‌గా అతను గడిపిన ఏడాదిని దానికి అడ్ఞస్టు చేసి వెంటనే విడుదల చేసేశారు. బయటకు వచ్చాక బాబ్జీకి గుంటూరు జిల్లా పరిషత్‌ ఆఫీసులో తాత్కాలికంగా తోటమాలిగా పని యిచ్చారు. తనకు యిస్తానన్న పర్మనెంటు ఉద్యోగం యివ్వలేదన్న ఆవేదనతో అతను ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. తర్వాత ఒక దొంగతనంలో పాలు పంచుకున్నాడు. చివరకు విసిగి, వేసారి 1987 నవంబరు 30 న విజయవాడలోని శ్రీ దుర్గా లాడ్జిలో రూము తీసుకుని ఫ్యానుకి ఉరేసుకుని చనిపోయాడు. 

ఆ గదిలోనే ఆ ఉత్తరాలు దొరికాయి. వాటిని పైకి రానీయకుండా తొక్కి పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చేశాయో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెసు డిమాండ్‌ చేసింది. ఇప్పుడు ప్రతీదీకి వైసిపికి అంటగడుతున్నట్లే, అప్పుడు టిడిపి కాంగ్రెసుకు అంటగట్టేది. మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు 'ఆ లాడ్జి కాంగ్రెసు సానుభూతిపరుడుది, అందుకని యిందులో కుట్ర ఉంది' అన్నారు. ముగ్గురు మంత్రులు 'బాబ్జీ ఉత్తరాలు చూస్తే ఎవరో లీగల్‌ బ్రెయిన్‌ రాసినట్లు ఉంది తప్ప సామాన్యుడు రాసినట్లు లేదు' అన్నారు. మొత్తం మీద న్యాయవిచారణ జరిపిస్తామని టిడిపి ప్రభుత్వం ఒప్పుకుంది. జస్టిస్‌ చింతల శ్రీరాములు అనే మాజీ హైకోర్టు జడ్జిని నియమించి మూడు నెలల్లో తేల్చమన్నారు. అది జూన్‌ 21 కల్లా పూర్తయితే ఆయన ఏడాది చివర దాకా గడువు పెంచమని కోరాడు. ఇదంతా 1988 జులై 15 ''ఇండియా టుడే''లో వచ్చింది. 

చివరకు ఆయన అది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని, ఎన్టీయార్‌ మల్లెల బాబ్జీని అలా డ్రామా ఆడమని ప్రేరేపించారని (ఆయన వాడిన మాట - ల్యూర్‌డ్‌) తేల్చారు. వారి మధ్య ఒప్పందం కుదిరిందని, కానీ బాబ్జీ ఆ పని చేశాక చట్టం చేతిలో చిక్కి తన తప్పేమీ లేకపోయినా ఏడాదిపాటు జైల్లో మగ్గాడని నివేదికలో రాశారు. దాంతో టిడిపి శ్రీరాములుపై విరుచుకుపడింది. అయితే చంద్రబాబు తను ముఖ్యమంత్రి అయాక 2002లో ఆయనను టిడిపిలో చేర్చుకున్నారు. ఇది పార్టీ వర్గాల్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ వార్తను 2002 డిసెంబరు 10 ''ద హిందూ''లో చూడవచ్చు. చెప్పవచ్చేదేమిటంటే మల్లెల బాబ్జీ విషయంలో దాన్ని ప్లాన్‌ చేసిన టిడిపి నవ్వులపాలు కావడం తప్ప, సాధించింది ఏమీ లేదు. అలాటప్పుడు వైసిపి మళ్లీ అలాటిది తలపెడుతుందా అనే సందేహం తలెత్తుతుంది. 

- (సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: జగన్‌పై దాడి - 1/2