తమిళనాడులో డిఎంకె పార్టీ ఘోరపరాజయం పొందింది. ఎడిఎంకె ఒంటరిగా పోటీ చేస్తోంది కాబట్టి, మనమూ చేయాలి అంటూ స్టాలిన్ ఎగదోయడంతో కరుణానిధి, తన పాతమిత్రులందరినీ బిజెపి పాలు చేసి ఒంటరిగా పోటీ చేశాడు. డిఎంకెకు ఎప్పటిలా 23% ఓట్లు వచ్చాయి. ఎడిఎంకె ఓట్లు 32% నుండి పెరిగి 45%కు చేరాయి. 37 సీట్లు గెలిచింది. బిజెపి, దాని మిత్రపక్షాలు కలిసి 18.6% ఓట్లు గెలుచుకోవడమే కాదు, 5 నియోజకవర్గాలలో ద్వితీయస్థానాన్ని పొంది, డిఎంకెను మూడో స్థానానికి నెట్టేశాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం సమస్తం తనపై వేసుకుని పోరాడిన స్టాలిన్ పరువు పోయింది. ఫలితాలు వచ్చిన మూడో రోజున అతను రాజీనామా చేశాడన్న వార్తలు వచ్చాయి. కరుణానిధి నడిగితే అంతా పుకార్లు అన్నాడు. కాన పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ 'స్టాలిన్ రాజీనామా సమర్పించాడు కానీ పార్టీ ఆమోదించలేదు' అని చెప్పాడు. ఢిల్లీలో రాహుల్, సోనియా రాజీనామాలు తిరస్కరించి డ్రామాయే చెన్నయ్‌లో నిర్వహించారు.
స్టాలిన్ అవస్థ అళగిరికి అమితానందం చేకూర్చింది. అతన్ని వెనక్కి తీసుకుని పార్టీని పటిష్టపరుస్తారా అని అడిగితే కరుణానిధి, 'అళగిరి పార్టీలో వున్నపుడు కూడా డిఎంకె గతంలో మూడుసార్లు ఓడిపోయింది. అళగిరిని నేను పూర్తిగా మర్చిపోయాను. మీరూ మర్చిపోండి.' అన్నాడు. కరుణానిధి తదనంతరం పార్టీ పగ్గాలు స్టాలిన్‌కి వస్తాయని అందరూ అనుకుంటున్నారు కానీ అతనికి, తండ్రికీ చాలా తేడా వుందని ఎన్నికల ఫలితాలు చెప్పాయి. స్టాలిన్ కరుణానిధిలా చదువరి కాదు, రచయిత కాదు, అందర్నీ కలుపుకుని పోయే స్వభావం కలవాడు కాదు, ఎత్తుపైయెత్తుల్లో చాణక్యుడు కాడు. ఎంజియార్ బతికి వుండగా డిఎంకె 13 ఏళ్లపాటు అధికారానికి దూరంగా వున్నా కరుణానిధి ఏదో ఒక ఉద్యమం, కార్యక్రమం చేపడుతూ తన పార్టీని బతికించుకున్నాడు. స్టాలిన్‌కు ఆ సత్తా లేదు. మొన్నటి ఎన్నికలలో 1.30 కోట్ల కొత్త ఓటర్లు వచ్చారు. వారు డిఎంకెకు ఓటేయలేదు. 2 జి స్కాము వంటి అవినీతి ఆరోపణలతో డిఎంకె ప్రతిష్ట మంటగలిసింది. ఇలాటి పరిస్థితుల్లో 2016 ఎసెంబ్లీ ఎన్నికల సమయానికి స్టాలిన్ పుంజుకోగలడా అన్నది సందేహమే.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)