''అవినీతి ఆరోపణలపై స్పందన'' వ్యాసంలో 'బాబు కూడా అవినీతికి పాల్పడ్డారని ఏ మాత్రం రుజువైనా వచ్చినా ఆంధ్రులు హతాశులవుతారు' అన్న వాక్యంపై చాలామంది వ్యాఖ్యలు చేశారు. బాబు అవినీతిపరుడు కాడా? అంటూ ప్రశ్నలు సంధించారు. వైయస్ అవినీతిపరుడైతే 2009లో ఎలా గెలిచాడని లాజిక్ లాగారు. ఇవన్నీ వివరించాలంటే ఒకటి రెండు వాక్యాల్లో జవాబివ్వడం కుదరదు కాబట్టే యీ వ్యాసం. నా వాక్యంలో కీలకమైన మాట '..రుజువైనా'! అది గమనిస్తే చాలా విషయాలు మీకే బోధపడతాయి.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాబు యిమేజి వేరు, జగన్ యిమేజి వేరు. రాజకీయనాయకుల్లో అవినీతి లేదంటే చిన్నపిల్లవాడు కూడా నమ్మడు. ఏ మేరకు అవినీతిపరుడు అన్నదే ప్రశ్న. వైయస్ మూర్తీభవించిన అవినీతిపరుడని కోడై కూసిన తెలుగు మీడియా బాబు దగ్గరకు వచ్చేసరికి మూగబోతుంది. ఆయన హయాంలో జరిగిన అవినీతిని అధికారుల నెత్తిన చుట్టేస్తుంది. జగన్ ఏనాడూ అధికారం చేపట్టకపోయినా అవినీతిపరుడుగా ముద్ర కొడుతుంది. దీన్ని మధ్యతరగతి ప్రజలు, ఆలోచనాపరులు అందరూ గుడ్డిగా నమ్మడానికి యిష్టపడతారు. దీన్నే నేను మాటిమాటికీ ఎత్తి చూపుతూంటాను. ఎన్నికలలో ఓట్లు కొంటున్నారు అని అందరికీ తెలుసు. ఓ పార్టీవాళ్లు ఓటుకు వెయ్యి యిస్తున్నారంటే మరొకరు 1200 యిస్తున్నారంటే, యింకోరు 1500 యిస్తున్నారు అని వార్తలు వస్తూనే వున్నాయి. జనాలు చెప్పుకుంటూనే వుంటారు. వీరిలో ఒకరు మాత్రమే అవినీతిపరులని, తక్కినవాళ్లందరూ స్వచ్ఛంగా వున్నారని ఎలా అనగలరు? అని నేను పదేపదే అడుగుతాను. దీనికి ఆ యా పార్టీల అభిమానుల వద్ద నుండి సమాధానం రాదు. అందరికీ తెలుసు – అలా ఖర్చు పెట్టేది కష్టార్జితం కాదు, అక్రమంగా సంపాదించిన డబ్బే అని. ఒక వేళ కష్టార్జితమే ఖర్చు పెట్టినా, అది పెట్టుబడిగా చూస్తున్నారని, పదవిలోకి వచ్చి దానికి మూడింతలు అడ్డగోలు మార్గంలో ఆర్జిద్దామనే ప్లానులో వున్నారనీ అర్థం చేసుకోవాలి. జండాలు మోసేవాళ్లకు కాకుండా వ్యాపారవేత్తలకు టిక్కెట్లు ఎందుకు యిస్తున్నారని కార్యకర్తలను పార్టీ అధినేతలను ప్రశ్నించినప్పుడు వాళ్లు ఏం సమాధానం చెప్తున్నారు? 'పార్టీ నడవాలంటే కార్యకర్తలుంటే చాలదు, నిధులు కావాలి. అవి సమకూర్చినవారికి టిక్కెట్టు యివ్వకపోతే ఎలా?' అని. గతంలో రాజకీయనాయకులకు, వ్యాపారస్తులకు మధ్య యిచ్చిపుచ్చుకోవడాలు వుండేవి. ఈ డొంకతిరుగుడు ఎందుకుని యిటీవల వ్యాపారస్తులు తామే రాజకీయాల్లోకి దిగిపోయి కావలసినవి చేసేసుకుంటున్నారు. నిధులిచ్చినవారికి నియమాలు ఉల్లంఘించి పనులు చేసిపెట్టాలి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి వచ్చినవారికి అక్రమంగా ఆర్జించుకునే అవకాశం యివ్వాలి. లేకపోతే పార్టీలో తిరుగుబాటు వచ్చి, విడిచి వెళ్లిపోతారు, గద్దె కూలిపోతుంది.
దీనికి ఏ పార్టీ అతీతం కాదు. కానీ టిడిపిని అతీతమనుకోమని దాని అభిమానులు వాదిస్తారు. బాబు నిప్పు అని నమ్మమంటారు. అవును, నిప్పే అని తెలుగు మీడియా మనకు నిత్యం చెపుతూ వుంటుంది. తెలుగు మీడియా అంటే నా ఉద్దేశం ఈనాడు, దాన్ని అనుకరించే యితర పత్రికలు. సాక్షి తెలుగు పేపరే అయినా అది విశాలాంధ్ర, ప్రజాశక్తి లాగ ఒక పార్టీకి అంకితమైన పత్రిక, అందువలన దాని పొలిటికల్ రిపోర్టింగులో వలపక్షం వుంటుంది పాఠకుడికి ముందే తెలిసిపోతుంది. తటస్థంగా వుంటాం అని చెప్పుకుంటూ ఒకరి పక్షం వహించేవాటితోనే యిబ్బంది. ఈనాడు పత్రిక దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగువారి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేస్తూ వచ్చి, వారి కళ్లకు గంతలు కట్టే స్థాయికి వచ్చింది. చెన్నారెడ్డి, నేదురుమల్లి వగైరా కాంగ్రెసు ముఖ్యమంత్రులను ఈనాడు అవినీతికి ప్రతిరూపాలుగా చూపించింది. వారిలో మంచి ఏదైనా వుంటే హైలైట్ చేయలేదు. అవినీతి జరిగింది, సరే ఏ మేరకు, యితరులతో పోలిస్తే ఏ స్థాయిది..? అని మనకు చెప్పలేదు, అడగాలని మనకు తోచనీయలేదు. 1983 ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు రోజు రామోజీరావు గారు సంతకం పెట్టిన లేఖలో తాను కాంగ్రెసుకు తొలినుంచి వ్యతిరేకినని చాటుకున్నారు. (కాంగ్రెసు ఓడిపోతుందని అప్పటికే ఆయన సర్వేలు చెప్పేయి) మార్గదర్శిపై విచారణ సమయంలో తను కాంగ్రెసు వ్యతిరేకినని చెప్పుకోవడం చేతనే వైయస్ ప్రభుత్వం వేధిస్తోందని రాతపూర్వకంగా ప్రకటించారు. కాంగ్రెసు వ్యతిరేకతను బాహాటంగా చాటుకుంటున్నా ఈనాడు పత్రికావిలువలకు కట్టుబడ్డ పత్రికగా చలామణీ కావడమే వింతల్లో కల్లా వింత. ఆయన కాంగ్రెసు వ్యతిరేకతే బిజెపి ప్రభుత్వం ద్వారా పద్మవిభూషణ్ తెచ్చిపెట్టింది. ఆయన సాధించిన విజయాలు తక్కువేమీ కావు, వాటిలో ఏ ఒక్కటైనా చాలు పద్మవిభూషణ్ యివ్వడానికి. కానీ ఆయన చిక్కుకున్న వివాదాలూ తక్కువవి కావు. ఈనాడు వైజాగ్ ఆఫీసు కేసు ఒక్కటి చాలు, పద్మ ఎవార్డు ఆపడానికి. కానీ గతంలో ఆడ్వాణీపై క్రిమినల్ కేసు వున్నా యిచ్చాం కదా, యీయనకి మాత్రం ఎందుకివ్వకూడదు అనుకుని యిచ్చేసినట్లున్నారు.
చెప్పవచ్చేదేమిటంటే తెలుగువాళ్లకు ఈనాడు నంది అంటే నంది, పంది అంటే పంది. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీయార్‌పై కుట్ర చేస్తే అది ఈనాడు దృష్టిలో కోపైలట్ కొంపముంచడమైంది, కొన్నేళ్ల తర్వాత అదే పని బాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అయింది. మొదటిది విఫలమైంది. రెండోది సఫలమైంది. నిజానికి రెండుసార్లూ ఎమ్మెల్యేల అసంతృప్తికి ఒకటే కారణం. కాంగ్రెసు సంస్కృతికి అలవాటు పడిన రాజకీయాలకు భిన్నంగా ఎన్టీయార్ కొత్తదనం తెచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఆయన ఎన్నికల ప్రచారానికి డబ్బులు పంచలేదు. కొందరు ఉత్సాహవంతులు ఆస్తులు అమ్ముకుని మరీ దిగారు. అవినీతిరహిత పాలన అని ఎన్టీయార్ చెప్పినది ఒట్టి మాటలగానే వుంటాయనుకున్నారు కానీ ఆయన దాన్ని నిజంగా అమలు చేయబోయేసరికి కంగు తిన్నారు. ''ఆయనకేమండి, సినిమాల్లో దండిగా సంపాదించి, తరతరాలకు తరగనంత సంపాదించి వచ్చి సన్యాసిని, నాకేం అక్కరలేదంటాడు. మరి మేమంతా సంసారులం కదా, నాలుగు రాళ్లు వెనకేసుకోక పోతే ఎలా?'' అని సణుగుడు ప్రారంభమైంది. నిజానికి 1983 ఎన్నికలలో తెలుగుదేశం ఓటర్లకు డబ్బులు పంచలేదు కానీ, రకరకాల ప్రచారానికి చాలానే ఖర్చయింది. అది ఎన్టీయార్‌పై అభిమానం చేతనో, పెట్టుబడిగానో, మరో కారణం చేతనో కొందరు భరించారు. వాళ్లు తమ పెట్టుబడి వెనక్కి రావాలని కోరుకున్నారు. కానీ ఎన్టీయార్ కొరకరాని కొయ్యగా మారారు. వెళ్లి చెప్దామంటే ఆయన వినేవాడు కాదు. ఎదురుపడాలంటే భయం. వ్యతిరేకిస్తూ చాటుగా సంతకాలు పెట్టడానికి మాత్రం రెడీ. అందుకే రెండుసార్లు తిరుగుబాటు చేశారు. స్వభావంలో నాదెండ్లకు, బాబుకు తేడా లేదు. 'పెద్దాయన్ని తప్పించి నన్ను కూర్చోబెడితే మీకు తినే ఛాన్సిస్తాను' అనే హామీతోనే వాళ్లు ఎమ్మెల్యేలను ఆకట్టుకున్నారు.
తమిళ రాజకీయాల్లో రాశాను – ఎమ్జీయార్ మొదటి టర్మ్‌లో అవినీతి లేదంటారని, తన ప్రభుత్వం రద్దయి మధ్యంతర ఎన్నికలు వచ్చిపడేసరికి ఆ దెబ్బకి అవినీతి ప్రారంభించాడంటారనీ రాశాను. ఎన్నికలు ఖరీదైన వ్యవహారం అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు కూడా సెల్‌ఫోన్లు పుచ్చుకున్నారని వార్త వచ్చింది. సుద్దులు చెప్పే అయ్యవార్లే యింత దిగజారితే పాటకజనం మాటేమిటి? పాత కాలంలో ఎన్నికలలో వావిలాల గోపాలకృష్ణయ్యగారి ఎన్నికల ఖర్చు వందల్లో వుండేది. ఈ రోజు ఎన్నికల సభలకే బోల్డు ఖర్చవుతోంది. 50 మంది హాజరయ్యే పుస్తకావిష్కరణ సభకే వేలల్లో ఖర్చవుతోంది. వేలమంది వచ్చే రాజకీయ సభ అంటే ఎంత ఖర్చు! ఖర్చు పెట్టకుండా గోదాలోకి దిగుదామని చూసిన లోకసత్తా ఎక్కడకు చేరిందో చూశాం. అయినా వాళ్లకీ పబ్లిసిటీకి బోల్డు ఖర్చయింది. సేకరించిన విరాళాలన్నీ చూపిస్తున్నాం అంటారు వాళ్లు. ఆచరణలో అదీ సాధ్యం కాదు. ఎందుకంటే జెపిపై అభిమానంతో విరాళం యిద్దామనుకున్న అందరి వద్దా దాని కోసం వైట్ మనీ వుండకపోవచ్చు. క్యాష్‌లో యిస్తా లేదా ఫలానా ఖర్చు భరిస్తా అనే ఆఫర్లు వస్తాయి. అంతెందుకు జెపి కూడా రత్తయ్యవంటి విద్యావ్యాపారికి టిక్కెట్టు యివ్వాల్సి వచ్చింది. వ్యవస్థ యింతలా భ్రష్టు పట్టాక ఎవరో ఒకరు మాత్రం నిప్పులా వున్నారంటే నమ్మడం ఎలా?- (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)