అందరి కంటె ఎక్కువగా జయపాల్ రెడ్డి ఓటమి ఒక గుణపాఠం నేర్పుతుంది. కాంగ్రెసులో వుంటూ కెసియార్ బలాన్ని పెద్దగా చూపించి, అధిష్టానాన్ని తప్పుదారి పట్టించి, తెలంగాణ యిస్తే చాలు, విజయం మనదే అని వాళ్లను మభ్యపరచిన యీ శకుని, చేవెళ్ల నియోజకవర్గంలో మళ్లీ నిలబడే సాహసం చేయలేని యీ పిరికిమనిషి మెహబూబ్ నగర్‌లో కూడా నెగ్గలేకపోయాడు. నిజానికి ఆ జిల్లాలో కాంగ్రెసుకు మరే జిల్లాలోనూ రానంతగా 31% ఓట్లు వచ్చాయి. అయినా యీ కుటిలమేధావి గెలవలేదు. ఎందుకంటే వీళ్లు తయారు చేసిన ఫ్రాంకిన్‌స్టీన్ వంటి కెసియార్ వీళ్లనే కబళించాడు. కెసియార్‌ను పెద్దవాణ్ని చేసే క్రమంలో అతని మోకాలి దాకా వచ్చే నాయకుడు కూడా లేకుండా కాంగ్రెసు చేసుకుంది. రాష్ట్రస్థాయి నాయకుడు ఒక్కడూ లేడని అనుకున్నాం కానీ జిల్లా స్థాయి వాడు కూడా లేడని తేలిపోయింది. సోనియా, రాహుల్ సభలను కూడా నిర్వహించలేకపోయిన అసమర్థులు వీరు. తన పార్టీ చేసిన మేలు కూడా వీళ్లు చెప్పుకోలేక పోయారు. హైదరాబాదు విశ్వనగరం అని, దేశంలో మూడో వంతు ఫార్మా యిక్కడే వుందని, మూడోవంతు పౌల్ట్రీ యిక్కడే వుందని, ఐటిఐయార్ యిక్కడే వచ్చిందని అధికారం చిక్కాక కెసియార్ చెప్తున్నారు. ఈ విజయాల్లో మా పాత్ర ఎంతో వుందని కాంగ్రెసు చెప్పుకోలేదెందుకు? ఇన్ని వున్నా తెలంగాణ వెనకబడిందని కెసియార్ అబద్ధాలు చెపుతూ, ఆ పేరుతో ఉద్యమం నడుపుతూ, కాంగ్రెసును దోషిగా నిలబెడుతూ వుంటే వీళ్లూ అతనితో వంతపాడి, ఆంధ్రులను తిడుతూ కాలక్షేపం చేశారెందుకు? వీళ్లకు వచ్చినదల్లా సోనియా వద్దకు వెళ్లి ఏడవడం, తెలంగాణ యిస్తే 90% సీట్లు తెస్తామని బీరాలు పలకడం. సోనియాకు కూడా వీళ్లంత తెలివితేటలే వుండడం వలన వీళ్ల మాట నమ్మింది. ఇప్పుడు వగచినా, వీళ్లపై అరిచినా ఏం ప్రయోజనం?
ఎన్నికల ప్రచారంలో కొత్త కెసియార్‌ను ప్రజలు చూశారు. ఉద్యమం నడిపినంతకాలం ఆయన ఎప్పుడూ బద్ధకంగానే వున్నాడు. బస్సు యాత్ర, పల్లె నిద్ర, తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్ట అంటూ ప్రకటనలు యివ్వడం, ఆ తర్వాత ఏమీ చేయకుండా ఫామ్ హౌస్‌లో పడుక్కోవడం. అయితే ఎన్నికల సమయంలో ఉదయమే లేచి ప్రచారం మొదలుపెట్టారు. 20 రోజుల్లో 107 ఎన్నికల సభలు నిర్వహించారు. 96 నియోజకవర్గాలకు స్వయంగా వెళ్లారు. ఆయన ముందు వేరే ఏ నాయకుడూ ఆనలేదు. ఆంధ్రలో మోదీ ఎఫెక్ట్, పవన్ ఎఫెక్ట్ అంటూ లెక్కలు వేస్తున్నారు కానీ తెలంగాణలో అవేమీ పనిచేయకపోవడానికి, ఉద్యమం నడిచిన జిల్లాల్లో బిజెపికి సీట్లు రాకపోవడానికి కారణం కెసియారే! దేశమంతా ఆకాశానికి ఎత్తేస్తున్న మోదీని 'సన్నాసి' అనగలిగినవాడు కెసియారే. కాంగ్రెసు చేతిలో తెలంగాణ పెడితే రాజీ పడుతుందని, టిడిపి ఆంధ్ర పార్టీ అని ప్రచారం చేయడంతో బాటు టిడిపితో చేతులు కలిపిన బిజెపికి పార్లమెంటులో నైనా గెలిపిద్దామని చూస్తే తెలంగాణ రక్షించుకోలేమని గట్టిగా చెప్పి తెలంగాణవాదుల ఓట్లు కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. లేకపోతే వాళ్లలో కొంతమంది రాష్ట్రంలో తెరాసను, కేంద్రంలో బిజెపిని గెలిపిద్దాం అనుకున్నారు. క్రాస్ ఓటింగులో అటూయిటూ అయితే ఫలితం దెబ్బ తింటుందని కెసియార్ ఊహించి, సమస్యపై ఫోకస్ చేసి దాన్ని ఎడ్రస్ చేశారు. ఇలాటి జాగ్రత్తలు తీసుకుని వుండకపోతే కెసియార్ ఏ 55 వద్దనో ఆగిపోయి వుండేవారు. పోలింగ్ చివరి థకు వచ్చేసరికి తెలంగాణవాదుల ఓట్లు చెదిరిపోకుండా అన్నీ తెరాసకే పడ్డాయి. ఈ 34% ఓట్లే తెరాస మాగ్జిమమ్ స్ట్రెంగ్త్ అని నా ఉద్దేశం. దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని తెరాస ప్రస్థానం మొదలవుతోంది. వచ్చే ఐదేళ్లలో బాగా పాలిస్తే తెరాస బలం పెరుగుతుంది, లేకపోతే తరుగుతుంది.
ఇక టిడిపి – ఎవరూ వూహించనట్లుగా 15 సీట్లు గెలుచుకుంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో ఆంధ్రమూలాలున్నవారు టిడిపిపైనే ఆశలు పెట్టుకుని ఓట్లు వేశారు. అందుకే అక్కడ 10 వచ్చాయి. ఖమ్మంలో 1 వచ్చింది. వరంగల్‌లో 2, మెహబూబ్‌నగర్‌లో 2 వచ్చాయి. ఒకప్పుడు మెహబూబ్ నగర్‌లో టిడిపి చాలా బలంగా వుండేది. 72 సీట్లలో పోటీ చేసినా గ్రామీణ ప్రాంతాల్లో తెరాసకో, తెలంగాణ యిచ్చిన కాంగ్రెసుకో ఓట్లు పడతాయని టిడిపి నాయకులు ముందే డిసైడై పోయి పెద్దగా కష్టపడలేదు. కాంగ్రెసుపై దేశమంతా వ్యతిరేకత వుందని, తెరాస పోకడలు నచ్చని కాంగ్రెసు వ్యతిరేకులు తమకు ఓట్లు వేసే ఛాన్సు వుందని టిడిపి గ్రహించలేకపోయింది. సిటింగ్ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోతే ప్రత్యామ్నాయ నాయకుణ్ని వీళ్లు డెవలప్ చేసుకోలేదు. దాంతో క్యాడర్ అటూయిటూ చెదిరిపోయారు. 30 నియోజకవర్గాలలో చాలాకాలంగా లీడరు అంటూ లేకుండా పోయాడట. 2014 ఎన్నికలపై ఆశ విడిచి కూర్చోవడం వలననే యిలా జరిగింది. కొందరు కావాలని నిస్తేజంగా వుండి, పార్టీని బలహీన పరచి, చివరిలో తెరాసకు వెళ్లిపోయారు కూడా. తాము ఉద్యమంలో చురుగ్గా లేము కాబట్టి ప్రజలకు తమపై ఆగ్రహం వుంటుందని అనుకున్న టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు హైదరాబాదులోనే మకాం పెట్టి, తమ నియోజకవర్గాలకు తరచుగా వెళ్లకపోవడం చేత ఓడిపోయారని కూడా అంటున్నారు. టిడిపి-బిజెపి కూటమి ఓ పట్టాన ఫైనలైజ్ కాకపోవడం చేత, టిక్కెట్ల పంపిణీ ఆలస్యమై ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలాయి. ఒంటరి పోరాటానికి సిద్ధపడిన తెరాస తన అభ్యర్థులను ఎప్పుడో ఖరారు చేసి, ఎక్కువ కాలం ప్రచారం చేసుకోగలిగింది. బిజెపికి వదిలేసిన సీట్లలో టిడిపి నాయకులు నిరాశపడ్డారు, నల్గొండ లాటి చోట్ల రెబెల్స్‌గా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం టిడిపికి ఉపకరించిందని అనుకోవడానికి లేదు. విభజన పట్ల ఆయన వైఖరిలో స్పష్టత లేదు.
కాంగ్రెసు ప్రతిపక్షంగా వెలుగుతుందని అనుకోవడానికి లేదు. ఆ పార్టీ జాతీయ నాయకత్వమే నీరసించి వుంది. రాష్ట్రస్థాయిలో పదవుల కోసం కీచులాటలు సాగుతున్నాయి. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పదవి విషయంలో డియస్, షబ్బీర్ అలీ పోరాటం చూశాం. ఇలాటి స్థితిలో టిడిపి గట్టి ప్రతిపక్షంగా ఎదగడానికి ఛాన్సుంది. ముఖ్యంగా ఆంధ్రమూలాల వారి పక్షాన వారి ఛాంపియన్‌గా నిలబడవచ్చు. తెరాస పేరు చెప్పుకుని ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్యాడర్ సహాయంతో వారిని ఎదిరించి ప్రజాదరణ పొందవచ్చు. 2019 నాటికి తెలంగాణలో టిడిపి అధికారానికి వచ్చేస్తుంది అని కొందరు ఆశిస్తున్నారు. అది యిక్కడి తెరాస పాలనపై, అక్కడి టిడిపి పాలనపై ఆధారపడి వుంటుంది. తెలంగాణ వెనకబడి, ఆంధ్ర ముందంజ వేస్తే అప్పుడు ఓటర్లు టిడిపివైపు మొగ్గు చూపుతారు. దాని గురించి యిప్పుడే మాట్లాడడం సమంజసం కాదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)