‘వేదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పొడుగు సుందరి దీక్షా సేథ్, బాలీవుడ్‌లో నటిస్తోన్న సినిమా ‘లేకర్ హమ్ దీవానా దిల్’ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో తెగ కష్టపడిపోతోంది దీక్షా సేథ్. క్షణం తీరిక లేకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న దీక్ష, ఈ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తాను ఓ వెలుగు వెలిగిపోతాననే ధీమా వ్యక్తం చేస్తోంది.
సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాననీ, బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా నత్తా చాటుకుంటానంటోన్న దీక్ష, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నందున సౌత్‌కి కాస్త గ్యాప్ ఇచ్చానే తప్ప, సౌత్ సినిమాలకు దూరం కాలేదని చెబుతోంది. తెలుగులో ‘మిరపకాయ్’, ‘వాంటెడ్’, ‘నిప్పు’ తదితర సినిమాల్లో నటించినా, ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదనే చెప్పాలి. ‘మిరపకాయ్’ హిట్టయినా.. ఆ క్రెడిట్ ఆమె ఖాతాలో పడలేదు.
ఇక, తమిళంలోనూ ఒకటీ అరా సినిమాల్లో నటించిన దీక్ష, అక్కడా పెద్దగా బావుకున్నదేం లేదు. అయినాసరే, సౌత్‌లో తనకు మంచి గుర్తింపు వచ్చిందని ముంబైలో చెప్పుకుంటోంది దీక్షా సేథ్. ఏమో.. ఒక్క సినిమాతో దశ మారిపోవచ్చు. తెలుగులో ‘మల్లీశ్వరి’, ‘అల్లరి పిడుగు’ వంటి ఫ్లాప్ సినిమాలు చేసిన కత్రినాకైఫ్, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోలేదూ.! దీక్ష దశ కూడా అలానే తిరుగుతుందేమో వేచి చూడాలి.