దేశంలో ఎక్కడ పవర్ ప్రాజెక్టు పెట్టినా ఏదో ఒక వివాదం తప్పదు. పునరావాసం సరిగ్గా జరగలేదన్న నింద తప్పదు. అందువలన మహాన్ ప్రాజెక్టు గురించి కూడా మనం పెద్దగా పట్టించుకునేవారం కాదు. కానీ అక్కడ గిరిజనులకు నష్టం జరిగిందన్న వాదనను ఇంగ్లండు ఎంపీల ముందు వినిపించడానికి వెళ్లబోయిన 'గ్రీన్‌పీస్' కార్యకర్త ప్రియా పిళ్లయ్‌కు కేంద్ర హోం శాఖ వీసా తిరస్కరించడంతో, గ్రీన్‌పీస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంతో అందరి దృష్టీ దీనిపై పడింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా కేంద్రానికి 35 కి.మీ.ల దూరంలో మహాన్ ప్రాంతం వుంది. అక్కడ మంచి నాణ్యమైన బొగ్గు దొరుకుతుంది కాబట్టి 1975 ప్రాంతాల నుండి బొగ్గు తవ్వకాలు మొదలై 1977లో మొదటి పవర్ ప్లాంట్ వచ్చింది. అక్కడ మరింతగా విస్తరించడానికి ఎస్సార్ పవర్, హిందాల్కో కలిసి జాయింటు వెంచర్‌గా ఏర్పడి 2006లో ఒక కోల్ బ్లాక్ ఎలాట్ చేయించుకున్నాయి. చకచకా పనులు పూర్తి చేసుకుంటూ పోయి, 2010 కల్లా ఎస్సార్ చైర్మన్ పవర్ ప్లాంట్ పని 65% పూర్తయిందని మన్‌మోహన్ సింగ్‌కు ఉత్తరం రాశాడు. వెంటనే పర్యావరణ శాఖ చూసే మంత్రి జయరాం రమేష్ తగులుకున్నాడు – అనుమతులు అన్నీ రాకుండా మీరు ప్లాంట్ నిర్మాణం ఎలా చేపట్టారు? అంటూ.
ఎందుకంటే అక్కడ చుట్టూ వున్న అడవుల్లో 5 లక్షల సాల్ వృక్షాలున్నాయి. ఎన్‌టిపిసి, ఎన్‌సిఎల్, రిలయన్స్, హిండాల్కో, జేపీ సంస్థలు నాలుగు థాబ్దాలగా మైనింగ్ చేస్తున్న కారణంగా జిల్లాలో వున్న అడవుల్లో మూడో వంతు యిప్పటికే నాశనమయ్యాయి. వాటిని పరిరక్షించవలసిన అవసరం వుంది. పునరావాసం కల్పిస్తామని చెప్పిన కంపెనీలు వాటి గురించి శ్రద్ధ పట్టలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పర్యావరణ మంత్రిత్వశాఖ మహాన్ ప్రాజెక్టు ముందుకు వెళ్లడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. అబ్బే ఆ అడవులంత ముఖ్యమైనవి కావు, మా ప్రాజెక్టు ప్రభావం అక్కడున్న రెండు నదులపై, వన్యప్రాణులపై, రిహాండ్ డ్యామ్ రిజర్వాయరుపై ఎంత తక్కువగా పడుతుందో చూడండి అంటూ కంపెనీ 2010-11లో రిపోర్టులు దాఖలు చేసింది. పర్యావరణ శాఖ వాటిల్లో తప్పులు పట్టి, యివి నమ్మను పొమ్మంది. 2011లో మంత్రిగా వచ్చిన జయంతి నటరాజన్ అనుమతి నిరాకరించింది. ఫైలు ప్రధాని కార్యాలయానికి చేరింది. ఆయన ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక మంత్రులబృందాన్ని ఏర్పరచి, దానికి పంపించారు. ఆ బృందం పర్యావరణ శాఖ అభ్యంతరాలను తోసిరాజని ఆ జాయింటు వెంచర్‌కు మొదటి స్టేజికి క్లియరెన్సు యిచ్చేసింది. అక్కడ నివసిస్తున్న ప్రజల అనుమతి తీసుకుంటే చాలంది.
ఇక స్థానికుల అనుమతి ప్రహసనం ప్రారంభమైంది. ఉదాహరణకు అమెలియా అనే గ్రామంలో 2013 మార్చి 5 రాత్రి 10 గంటలకు మర్నాడు గ్రామసభ వుంది రమ్మనమని దండోరా వేయించారు. సాధారణంగా అలాటి సభలు వుంటే వారం రోజుల ముందు నుంచీ వేయిస్తారు. దీనికి మాత్రం ఒక్కసారి, అందరూ పడుక్కున్నపుడు వేయించి, మర్నాడు అందరూ పనిపాటలపై వెళ్లిన సమయం చూసి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించి, అందరూ ఒప్పుకుంటున్నారు అని రాసి యిచ్చేశారు. ఆ గ్రామం జనాభా 2 వేలు కాగా, అవేళ హాజరైనది 184 మంది. జనాభాలో 50% మంది వస్తే తప్ప కోరమ్ సరిపోదు. కానీ హాజరై సంతకాలు పెట్టినవారి సంఖ్య – 1185, రికార్డుల ప్రకారం. ఆ సంతకాల్లో 2012 అక్టోబరులో చనిపోయిన నా తండ్రి సంతకం కూడా వుంది, యిదెలా సంభవం? అని ఒకతను కేసు పెట్టాడు. నిజమేనా అని గ్రీన్‌పీస్ వాళ్లు వెళ్లి పోలీసులను అడిగారు. 'మేం విచారణ జరిపి, అంతా సవ్యంగా వుందని తేల్చుకున్నాం' అన్నారు పోలీసులు. 2013లో మొదటి స్టేజికి అనుమతి రాగా, రెండవ స్టేజికి 2014 ఫిబ్రవరిలో వీరప్ప మొయిలీగారు అనుమతి దయ చేయించారు. అంతలోనే ప్రభుత్వం మారడం, కోల్ బ్లాక్ ఎలాట్‌మెంట్ గురించి విస్తృత చర్చలు జరిగి, 2014 సెప్టెంబరులో సుప్రీం కోర్టు 214 కోల్ బ్లాకుల కేటాయింపు రద్దు చేయడం జరిగింది.
ప్రాజెక్టుకోసం భూములు సేకరించినప్పుడు పునరావాసం గురించి, ఉద్యోగాల గురించి గిరిజనులకు యిచ్చిన వాగ్దానాలను కంపెనీలు పట్టించుకోవటం లేదని గ్రీన్‌పీస్ వారు ఆందోళన చేపట్టారు. ఈ జాయింటు వెంచర్‌లో భాగస్వామి అయిన ఎస్సార్ పవర్, మాతృసంస్థ ఎస్సార్ ఎనర్జీ, ఇంగ్లండులో రిజిస్టరైన కంపెనీ. మొన్నటిదాకా లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టయ్యేది. ఒక బ్రిటిషు కంపెనీ ఇండియాకు వచ్చి యిక్కడి ఫారెస్టు చట్టాలను, గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తోంది అని నిరసన తెలపడానికి బ్రిటిష్ ఎంపీలను కలిసి వారికి పరిస్థితి తెలియపరచాలనే ఐడియాతో గ్రీన్‌పీస్ సంస్థ ప్రతినిథిగా ప్రియా పిళ్లయ్ యుకె వెళ్లబోయింది. ఆమెపై భారతప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పత్రికలవారి దృష్టి యీ ప్రాజెక్టుపై పడింది. వాస్తవపరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని మహాన్‌కు బయలుదేరారు. ఎస్సార్ పవర్ ప్రాజెక్టు కంపెనీ వాళ్లు రూ.4500 కోట్లు పెట్టుబడి పెట్టారు. రెండేళ్లపాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చి, రెండు నెలలుగా మూసేసుకున్నారు. మహాన్ కోల్ బ్లాక్ వేలానికి పెడితే కొనుక్కుని పని ప్రారంభించాలి. ఎక్కడో దూరం నుంచి బొగ్గు తెస్తే కిట్టుబాటు కాదు. అందుకని ఆగారు.
ప్లాంట్ కట్టినపుడు నిర్వాసితులైన వారిలో గిరిజనులు ఎక్కువ. వెయ్యి మంది కోసం నంద్‌నగర్ రీసెటిల్‌మెంట్ కాలనీ కట్టారు. దాన్ని మోడల్‌గా చూపించి యితర ప్రాంతప్రజలను కూడా పునరావాసానికి ఒప్పిద్దామని అనుకున్నారు. స్కూళ్లు, హాస్పటల్స్, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనాలు, బస్సులు, ఆటస్థలం, తాగునీరు సౌకర్యం – అన్నీ వుచితమే అన్నారు. నాలుగేళ్లయినా అవేమీ జరగలేదు. అంతెందుకు పక్కనే విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వీళ్లకు మాత్రం కరంటు సరఫరా లేదు. స్కూలు కట్టారు కానీ దాన్ని నడిపే బాధ్యతను ఆరెస్సెస్ సంస్థ సరస్వతీ శిశు మందిర్‌కు అప్పచెప్పి చేతులు దులుపుకున్నారు. 'ఎవరూ జవాబుదారీ కాదు. ఉదయం 7 గంటలకు రావలసిన టీచర్లు నాలుగు గంటలు లేటుగా వస్తారు. వచ్చాక పాఠాలు చెప్పకుండా, మా పిల్లలను అడవిలోకి వెళ్లి వంట చెరుకు పట్టుకురమ్మంటారు' అని పిల్లల తలిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. నిర్వాసితులు చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఋణసౌకర్యం కల్పిస్తామన్నారు, అదీ జరగలేదు.
పునరావాస పనుల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పుడు స్థానికులకు వుద్యోగాలు యిస్తామంటారు. మొదట్లో కూలీపనులు యిస్తారు, ప్రాజెక్టు తయారయ్యాక వీరికి నైపుణ్యం లేదంటూ బయటివారిని తెస్తారు. వీళ్లు గోలపెడతారు. నైపుణ్యం లేని పనివాళ్లను పెట్టుకోవడం కంటె వారి మొహాన ఎంతో కొంత పడేసి వూరుకోబెడితే మంచిదనుకుని నిరుద్యోగ భృతి అంటూ నెలనెలా యిస్తూ వుంటారు. దాంతో వీళ్లకు సోమరితనం పెరుగుతుంది. డబ్బు సరిపోక యిక్కట్లు పడతారు. ఇక్కడా అదే జరిగింది. ఆరేళ్ల క్రితం ఎకరాకు రూ. 4 లక్షల చొప్పున యిచ్చి, భూమి తీసుకున్నారు. నిర్మాణసమయంలో స్థానికులకు రెండు, మూడు నెలలు పని యిచ్చారు తప్ప తర్వాత వుద్యోగాలు యివ్వలేదు. మీకు ట్రైనింగ్ యిచ్చి మీ నైపుణ్యం పెరిగాక ఉద్యోగాలు యిస్తామని చెప్పారు కానీ ట్రైనింగూ లేదు, ఉద్యోగాలూ లేవు. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్‌ల నుండి పనివాళ్లను తెప్పించుకుంటున్నారు. వీరికి నెలకు రూ.7 వేలు (అది అక్కడ రూలు ప్రకారం యివ్వవలసిన కనీసజీతం) నిరుద్యోగ భృతిగా యిస్తున్నారు. 'కుటుంబంలో ఒక్క వ్యక్తికి మాత్రమే అలా యిస్తున్నారు. గతంలో పొలం వుండేటప్పుడు యింట్లో అందరూ పనిచేసి డబ్బు గడించేవారం కదా' (యీ మాటలు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా?) అని వాపోతున్నారు మహాన్ ప్రజలు. ఎస్సార్ వాళ్లింకా నయం. రిలయన్సు వాళ్లయితే ఏమీ యివ్వకుండా చాన్నాళ్లు కాలక్షేపం చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో యీ మధ్యే సగం అలవెన్సు మొదలెట్టారు.
పత్రికల వాళ్లు యివన్నీ స్థానికుల నుండి సేకరిస్తూ వుంటే కంపెనీ మనుష్యులు వచ్చి మీకేం పని? వెళ్లిపోండి అని దబాయించసాగారు. రెండు మూడు రోజుల పాటు వాళ్లు ఎక్కడకు వెళితే అక్కడకు అనుసరించి గమనిస్తూ వున్నారు. కంపెనీ మద్దతుతో 'మహాన్ వికాస్ మంచ్' అనే సమాజం ఏర్పడి, గ్రీన్‌పీస్ కార్యకర్తలతో కలహిస్తోంది. 'ఇక్కడ గిరిజనులకు నష్టం కలుగుతోంది అనే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై చెప్పితే వాళ్లు యిది ఒక సాకుగా తీసుకుని భారత్‌కు పెట్టుబడులు రాకుండా చేస్తారు. అందువలన గ్రీన్‌పీస్ వారి ప్రతినిథి అక్కడకు వెళ్లడానికి వీల్లేదు' అనే అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం ప్రియా పిళ్లయ్ వీసా తిరస్కరించింది. గ్రీన్‌పీస్ ఖాతాలను స్తంభింపచేసింది. స్వయంగా అక్కడకు వెళ్లలేకపోయినా ప్రియా పిళ్లయ్ బ్రిటిషు ఎంపీలతో స్కైప్‌లో మాట్లాడేసింది. ఇక ప్రభుత్వం ఏం సాధించినట్లు? పునరావాసం, పర్యావరణం విషయంలో తప్పు చేసిన కార్పోరేట్లను వెనకేసుకుని రావడం, తప్పును సవరించకపోవడం, బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడడం, తప్పును ఎత్తి చూపించేవారిని దండించడం – యీ విషయాల్లో గతంలో యుపిఏ, యిప్పుడు ఎన్‌డిఏలకు భేదం లేదు. పునరావాసం గురించి యిచ్చిన హామీలు అమలయ్యేట్లు కార్పోరేట్ల మెడలు వంచితే ఎవరు వచ్చి చూసినా, ఎవరు ఫిర్యాదు చేసినా ఏమీ కాదు. అది పాలకులు గ్రహించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)