మా వరప్రసాద్ (శాంతా బయోటెక్నిక్స్, హాసం) తన తండ్రి వర్ధంతికి ప్రతీ ఏడూ తన యింట్లో ఏదో ఒక ప్రవచన కార్యక్రమం పెట్టిస్తూంటాడు. ఎవరైనా పెద్దవాళ్లను తీసుకుని వచ్చి వాళ్ల చేత తండ్రి, తల్లి, కుటుంబసభ్యుల మధ్య వుండవలసిన ఆదరాభిమానాల గురించి ఉపన్యసింప చేసి, యీ నాటి సమాజంలో మానవీయ సంబంధాలు పెంపొందించుకోవలసిన అంశం గురించిన పుస్తకమో, ఆడియో సిడియో ఆవిష్కరింప చేస్తూ వుంటాడు. ఈ ఏడు చాగంటి కోటేశ్వరరావుగారిని పిలవడం జరిగింది. ఆయన తండ్రి ఔన్నత్యం గురించి మాట్లాడుతూనే ''అమ్మపదం'' పుస్తకంలో తల్లి గురించి రాసిన 'మాతృషోడశి' పద్యాల గురించి, వాటికి బాపుగారు అద్భుతంగా వేసిన చిత్రాల గురించి మాట్లాడారు. తల్లిపై 156 కవితలు సేకరించి అనేకమంది సభ్యులున్న సంపాదకవర్గం సంపాదకత్వంలో కూర్చిన ఆ పుస్తకాన్ని జిఎంఆర్-వరలక్ష్మి ఫౌండేషన్ వారు 2011 లో ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం యీ 'మాతృషోడశి'తోనే ప్రారంభమవుతుంది. 'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను. ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి, ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు. ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.' అనే థీమ్‌తో వేదవ్యాసుడు ''వాయుపురాణం''లో రాసిన 16 శ్లోకాలే – మాతృషోడశి. ఈ శ్లోకాలకు ముళ్లపూడి వెంకటరమణగారు తెలుగుసేత చేయగా బాపుగారు తన చేత్తో శ్లోకాలను, అర్థాలను రాసి అనితరసాధ్యంగా రంగుల్లో బొమ్మలు వేశారు. ఫౌండేషన్ వారు ఆ పేజీలను మాత్రం ఆర్ట్ పేపర్లో ముద్రించారు.
Click Here for Mathruvandanam E-Book
చాగంటివారు తన ప్రసంగంలో ఆ పుస్తకం గురించి ప్రస్తావించగానే అందరూ వరప్రసాద్‌ను ఆ పుస్తకం సంపాదించి యిమ్మనమని అడగసాగారు. 250 పేజీల ఆ పుస్తకం ధర రూ.300. దానిలో ప్రస్తుతానికి కావలసినది యీ 16 పేజీలే కదాని, జిఎంఆర్ ఫౌండేషన్ వారి అనుమతి తీసుకుని వాటిని ఆ పుస్తకంలో కంటె పెద్దగా అంటే ఎ4 సైజులో ''మాతృవందనం'' పేర ఒక రంగుల పుస్తకంగా వేయించాడు వరప్రసాద్. దానికి చాగంటి వారు, తనికెళ్ల భరణి ముందుమాట రాయగా, వరప్రసాద్ తల్లి గురించి మంచి కవిత రాశాడు. నవంబరులో వచ్చే తన పుట్టినరోజుని ఆయన కొన్నేళ్లగా మాతృదినోత్సవంగా జరుపుకుంటున్నాడు. అదేమిటంటే బిడ్డ పుట్టిన రోజే అప్పటిదాకా యిల్లాలుగా వున్న తల్లిగా పుడుతుంది అంటాడు. ''మీరు ఏకైక సంతానం కాబట్టి యీ లాజిక్ పనికి వస్తుంది, రెండో, మూడో బిడ్డగా పుట్టినవాడి సంగతేమిటి?'' అంటే ''ప్రసవమంటే స్త్రీకి పునర్జన్మే, వైద్యంలో ఎన్ని ఆధునిక పద్ధతులు వచ్చినా ప్రసూతిలో వున్న అపాయాలను తొలగించలేకపోతున్నారు. అందువలన అప్పుడు కూడా తల్లికి మళ్లీ-పుట్టిన రోజే'' అంటాడు. ఈ కాన్సెప్ట్ బాగానే వుందనిపించింది. ఎందుకంటే వయసు వస్తున్న కొద్దీ పుట్టినరోజు జరుపుకోవడం సిగ్గుగా అనిపిస్తుంది. ఆ రోజు మా అమ్మను సత్కరిస్తున్నాను అంటే భేషుగ్గా వుంటుంది. ఈ నవంబరులో తన పుట్టినరోజున, అదే మాతృదినోత్సవాన తన శాంతా-వసంతా (మొదటిది తల్లి పేరు, రెండోది భార్య పేరు) ట్రస్టు పేర ప్రచురించిన ''మాతృవందనం'' పుస్తకాన్ని చాగంటి వారి చేత ఆవిష్కరింప చేయాలనుకున్నాడు. చాగంటివారికి యీ ఐడియా చాలా బాగా నచ్చింది. 'ఆ 16 శ్లోకాలపై రెండు రోజుల పాటు చెప్పుకుందాం, బాపుగారు బొమ్మల్లో వేదవ్యాసుని కవిహృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారో గుర్తు చేసుకుందాం' అన్నారు. అలా వాటిపై రెండు రోజులూ కలిపి మూడు గంటల పాటు ప్రసంగించారు. అది ఎస్‌విబిసి ఛానెల్ వారు డిసెంబరు 14న ప్రసారం చేస్తే ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. (యూ ట్యూబ్‌లో దాని లింకు (https://www.youtube.com/watch?v=uBoFmFj0vgM, https://www.youtube.com/watch?v=bPExfqQwjog) ఈ ప్రసంగాలకై వరప్రసాద్ యింటికి వచ్చినవారందరికీ ''మాతృవందనం'' పుస్తకాలు వుచితంగా పంచడం జరిగింది. తీసుకున్న ప్రతివాళ్లు యింకా యింకా కావాలని అడగ నారంభించారు.
డిసెంబరు 15 బాపుగారి పుట్టినరోజు. గాయకుడిగా ఎస్పీ బాలుగారి పుట్టినరోజు కూడా. ''కిన్నెర'' సంస్థ వారు హైదరాబాదులోని సత్యసాయి నిగమాగమంలో ఆ సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేసి బాపుగారి సినిమాలలోని పాటలతో ఒక కార్యక్రమం రూపొందించి, బాలుగారిని ఆహ్వానించారు. బాపుగారి సినిమాల హ్రస్వపరిచయంతో గురుప్రసాద్ గారు రాసిన ''ముత్యమంత..'' అనే చిన్న పుస్తకం ఆవిష్కరిస్తున్నారు. సభాప్రారంభకుడిగా వున్న వరప్రసాద్ ''మనం కూడా బాపుగారిపై ఏదైనా పుస్తకం తయారుచేసి ఆ రోజు వచ్చినవారందరికీ వుచితంగా పంచుదాం.'' అన్నాడు. ఏం చేద్దామని చాలా తీవ్రంగా ఆలోచించిన తర్వాత నాకు తట్టింది – 'మాతృవందనంపై తన ప్రవచనంలో చాగంటివారు బాపు చిత్రలేఖనంలోని విశేషాల గురించి ఉగ్గడించారు కదా. 'వేదవ్యాసుని శ్లోకాలు-శ్రీ బాపు బొమ్మలు- శ్రీ చాగంటి వ్యాఖ్యానం' అనే కాన్సెప్ట్‌తో పుస్తకం వేసి పంచితే 'ఐసింగ్ ద కేక్'లా వుంటుంది' అని. చాగంటివారి మూడు గంటల ప్రసంగంలోంచి ఒక్కో శ్లోకం గురించి శ్లోకార్థం, బాపు బొమ్మలో విశేషం, నేటి సమాజానికి చేసిన అన్వయం సేకరించి సుమారు పది లైన్ల చొప్పున రాసుకొచ్చాను. ఎ4 సైజు కాగితంలో రంగుల పుస్తకంలోని బొమ్మను కాస్త కుదించి, పక్కన యీ మ్యాటర్‌ను యిచ్చాం. సమయం తక్కువ కావడంతో పాపం మా సహాయకుడు నవీన్ చాలా కష్టపడ్డాడు. లోపలి పేజీలు బ్లాక్ అండ్ వైట్‌లో, కవరు పేజీ కలరులో వేసిన 24 పేజీల పుస్తకాన్ని డిసెంబరు 15 సభలో బాలు గారి చేత ఆవిష్కరింప చేశాం. మాతృవందనం శ్లోకాలకు సంగీతం సమకూర్చి, స్వయంగా ఆలపించిన బాలుగారి సిడి కూడా అప్పుడే ఆవిష్కరించబడింది. సభకు వచ్చిన వారికి పుస్తకాలు పంచబోతే 700 పుస్తకాలు చాలలేదు. ఒక్కోరూ రెండు, మూడు అడిగితే ఏం చాలతాయి?
అప్పుడే అనిపించింది – ఈ పుస్తకాన్ని ఈ-బుక్‌గా వెలువరించి అందరికీ లభ్యం చేస్తే మంచిదని. పుస్తకాలు వేయించడం ఒక ఎత్తయితే, అడిగిన వారికి వాటిని పంపించడం రెండెత్తులు. పుచ్చుకున్నవారు అంతటితో ఆగటం లేదు, 'మా తమ్ముడికి, తోడల్లుడికి, ఆడపడుచుకి…' అంటున్నారు. ఇలా ఎలక్ట్రానిక్ ఫామ్‌లో అయితే ఎంతమందికి కావాలంటే అంతమందికి పంపవచ్చు. వాళ్లు సెల్‌ఫోన్లోనో, టాబ్లెట్‌లోనో పెట్టుకుని ఎన్నిసార్లయినా చదువుకోవచ్చు. భారతీయ సమాజానికి గల మౌలికబలం కుటుంబసంబంధాలు. అవి క్రమేపీ క్షీణిస్తున్నాయి. తలితండ్రుల పట్ల నిర్లక్ష్యం, నిరాదరణ పెరుగుతోంది. చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టేటప్పుడు యీ శ్లోకాలు చదివినా చదవకపోయినా ఫర్వాలేదు కానీ బతికుండగా ఆప్యాయంగా యింత ముద్ద పెడితే తలిదండ్రులు సంతోషిస్తారు. దురదృష్టమేమిటంటే యీ నాటి బిడ్డలు తాము రేపటి తలిదండ్రులమని మర్చిపోతున్నారు. కుటుంబసభ్యుల పట్ల అనుబంధాలు వుండవలసిన స్థాయిలో లేకపోతే మానసికంగా ఎలా దెబ్బ తింటున్నారో పశ్చిమదేశాలలో మనకు కనబడుతూనే వుంది. చాగంటివారు తన ఉపన్యాసంలో చెప్పిన ఒక ఉదంతాన్ని వింటే వారం రోజులపాటు మనసు మనసులో వుండదు – మన సమాజంలో యింత దౌష్ట్యం వుందా అని. వాళ్ల వూరిలో ఒక వృద్ధాశ్రమానికి యీయన వెళ్లినపుడు రెడీగా వాకిట్లో నిలబడి వున్న ఒకావిడ 'మా అబ్బాయి ఓ పావుగంటలో వచ్చి తీసుకెళ్లిపోతాడండి' అని చెప్పిందట. రెండు గంటలైనా ఆవిడ అలాగే వుండడం చూసి యీయన ఆశ్చర్యపడితే నిర్వాహకురాలు చెప్పిందట – 'వీళ్లబ్బాయి వచ్చి మా అమ్మను మీ ఆశ్రమంలో పెడతాను, మళ్లీమళ్లీ రావడానికి కుదరదేమో, పదేళ్లకు ఒకేసారి డబ్బిచ్చేస్త్తున్నాను అని కట్టేశాడు. మర్నాడు తల్లిని తీసుకుని వచ్చి ఆవిడకు ఏమీ చెప్పకుండా 'అమ్మా కారు దిగు, పావుగంటలో వస్తా, యింటికి వెళ్లిపోదాం' అని చెప్పి దిగబెట్టి వెళ్లిపోయాడు. కాస్సేపటికి ఆశ్రమం వాళ్లు వచ్చి అసలు సంగతి చెప్పడంతో ఆవిడకు మతి భ్రమించింది. 'పావుగంటలో వస్తా' అని కొడుకు చెప్పిన మాటలే మైండ్‌లో రిజిస్టరై పోయి, తక్కినవేవీ నాటుకోలేదు. రోజూ పొద్దున్నే పెట్టె సర్దుకుని గుమ్మంలోనే నిలబడుతుంది. రాత్రి దాకా అదే వరస. మధ్యలో ఆశ్రమం వాళ్లు బతిమాలి అన్నం పెడతారు, నిద్ర పుచ్చుతారు'. ఇలాటి దుర్మార్గులు మన సమాజంలో మన మధ్య పెద్దమనుషుల్లా తిరిగేస్తూన్నారన్న ఆలోచనే కంపరంగా తోస్తుంది.
Click Here for Mathruvandanam E-Book
గతంలో వరప్రసాద్ యింట్లో జరిగిన ప్రవచనాల సందర్భంగా తనికెళ్ల భరణి ఓ కథ చెప్పారు – 'ఇంట్లో భార్యా, భర్తా కొట్టుకుంటున్నారు. 'అత్తగారు ఎలాగూ పోయింది, మావగారు ఎప్పటికీ పోకుండా వున్నాడు, ఇంట్లో ఎందుకు నస? తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తే పోలేదా!' అని భార్య అరుస్తోంది. 'అరవకే, నాన్న వింటాడు' అని బతిమాలుతున్నాడు భర్త. ఇంతలో సంచి పట్టుకుని తండ్రి గదిలోంచి బయటకు వచ్చాడు – పద వెళదాం అన్నాడు. 'నీకు వినబడిందా?' అడిగాడు కొడుకు. 'వినబడాలనేగా యిదంతా..' అన్నాడాయన. ఇద్దరూ స్కూటరెక్కారు. అనాథాశ్రమం దగ్గర పెద్ద క్యూ. అందరూ యిలాటి తండ్రులూ, తల్లులే. 'నువ్వెళ్లు, నేనే క్యూలో నిలబడి ఎడ్మిట్ అవుతానులే' అన్నాడు తండ్రి. హమ్మయ్య, పెళ్లాంతో హోటల్‌కు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుని కొడుకు తుర్రుమన్నాడు. తండ్రి వంతు రాగానే అనాథాశ్రమం పెద్ద 'ఓఁ మీరా!, ముప్ఫయి ఏళ్ల క్రితం మా ఆశ్రమం నుండి ఒక అనాథను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు కదా, ఆ బాబు ఎలా వున్నాడు?' అని అడిగాడు. 'ఇదిగో, యిప్పుడిక్కడ దింపినవాడు వాడే!' అన్నాడు తండ్రి!
చాలా ఏళ్ల క్రితం విన్నా యీ కథ మనసును కలవరపెడుతూనే వుంది. చివర్లో పంచ్ అలాటిది. అంతలోనే ఆలోచనలు. అనాథ కాబట్టి పెంపుడు తండ్రిని అనాథాశ్రమంలో పడేసే హక్కు కోల్పోయాడా? అదే సొంతకొడుకైతే దర్జాగా పడేయవచ్చా? అన్న ప్రశ్న వేధిస్తుంది. అనాథ కాబట్టి, యింకోడి రక్తం కాబట్టి అలాటి బుద్ధి పుట్టింది, యితని రక్తమే అయితే అలా వుండేవాడు కాదు అనుకోవాలా? సొంత కొడుకు యిలా ప్రవర్తిస్తే దానికి లాజిక్ ఏం చెపుతాం? ఈ కథను పొడిగించాలని, మార్చి రాసి భరణికి చూపించాలని తోచినప్పుడల్లా యిలాటి అనేక సందేహాలతో ఆగిపోతాను. వృద్ధాశ్రమానికి తలిదండ్రులను పంపడంలో అమానుషత్వం కనబడుతుంది. అదే సమయంలో వృద్ధులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి అనే సందేశంతో 'వృద్ధ బాలశిక్ష' అనే పేరుతో డివి నరసరాజుగారు ''హాసం''కై ఒక రచన రాసి పంపారు. అంశం చాలా గొప్పది, యింకాస్త యింప్రొవైజ్ చేస్తారా అని అడిగితే చూస్తాను అన్నారు కానీ కథ ముందుకు సాగలేదు. కుటుంబం కలిసి వుంటే చాలా లాభాలున్నాయి. దానికోసం అందరూ సర్దుకోవాలి, అహంభావాలను పక్కకు పెట్టాలి. మారే సమాజంలో అవసరాలు మారుతున్నాయి, అనుభవాలు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి. అందరూ కలిసి ఆలోచిస్తే వర్కబుల్ మోడల్ తట్టకపోదు. ఆ ఆలోచన రావాలంటే తను జన్మకు, ప్రస్తుత స్థితికి కారణం జన్మనిచ్చిన తలిదండ్రులే అన్న ఎఱుక వుండాలి. ఆ ఎఱిక తెప్పించడానికే యీ ''మాతృవందనం'' ప్రయత్నం.
దీని కింద కనబడే లింకు క్లిక్ చేస్తే మాతృవందనం ఈ-బుక్‌కు తీసుకెళుతుంది. దాన్ని మీరు ప్రింటవుట్ తీసుకోవచ్చు, ఎవరికైనా ఫార్వార్డ్ చేయవచ్చు. అంతటితో ఆగకుండా కాస్త టైము వెచ్చించి దాన్ని చదవండి. ఇప్పటికిప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం రాకపోయినా, శ్లోకాలు సమయానికి గుర్తుకు రాకపోయినా భావం మాత్రం మనసుకి హత్తుకుంటే అంతే చాలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)