2014 విషాదనామ సంవత్సరం.!

ప్రతియేటా అనేక విషాద సంఘటనల్ని చూస్తున్నాం. తీవ్రవాదులు మారణహోమం సృష్టించడం. ప్రకృతి ప్రకోపించడం. మానవ తప్పిదాలతో విషాదాలు చోటుచేసుకోవడం.. ఇవన్నీ నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక విషాద సంఘటనలు వెలుగు…

ప్రతియేటా అనేక విషాద సంఘటనల్ని చూస్తున్నాం. తీవ్రవాదులు మారణహోమం సృష్టించడం. ప్రకృతి ప్రకోపించడం. మానవ తప్పిదాలతో విషాదాలు చోటుచేసుకోవడం.. ఇవన్నీ నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక విషాద సంఘటనలు వెలుగు చూశాయి. 

ప్రధానంగా 2014లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో బియాస్‌ జల గండం, నగరం గ్యాస్‌లైన్‌ పేలుడు ఘటన, విశాఖలో హుద్‌హుద్‌ తుపాను బీభత్సం ప్రముఖమైనవి. ఇవి కాకుండా, తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి సమయంలో బాణాసంచా తయారీ జరుగుతుండగా సంభవించిన పేలుళ్ళ ఘటన, చెన్నయ్‌లో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలి తెలుగువారు మరణించడం.. లాంటి అనేక దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.

తుపాను బీభత్సాల్ని అరికట్టలేంగానీ, మిగతా దుర్ఘటనలు చాలావరకు నివారించదగ్గవే. వీటిల్లో మానవ తప్పిదాల కారణంగా జరిగిన దుర్ఘటనల్లో నగరం గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు ఒకటైతే, బాణాసంచా తయారీ సందర్భంగా జరిగిన పేలుడు ఇంకొకటి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల బియాస్‌ నది, పాతిక మంది విద్యార్థుల్ని మింగేసింది.

ప్రాణం అత్యంత విలువైనది. కానీ, చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల్ని తోడేస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం ఈ ఏడాది పలువురు ప్రముఖుల్ని పొట్టన పెట్టుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శోభానాగిరెడ్డి, సినీ నిర్మాత జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బోరు బావులు మింగేసిన ఘటనలూ ఈ ఏడాది చోటుచేసుకున్నాయి.

జాతీయ స్థాయిలో చూసుకుంటే నక్సలైట్లు పోలీసుల్ని మట్టుబెట్టడం, పోలీసులు నక్సలైట్లను అంతమొందించడం వెరసి, ఇరువురి మధ్యా ‘రక్తచరిత్ర’ నెవ్వర్‌ ఎండిరగ్‌.. అనే రీతిలో సాగుతూనే వుంది ఎప్పటిలాగానే. అస్సాంలో బోడో తీవ్రవాదులు 72 మందిని ఊచకోత కోసిన ఘటన ఈ ఏడాదిలోనే అత్యంత విషాదకరమైన సంఘటన భారతదేశానికి. పొరుగు దేశం పాకిస్తాన్‌లో 150 మంది విద్యార్థులు తీవ్రవాదుల తూటాలకు బలైపోవడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

చెప్పుకుంటూ పోతే.. ఈ ఏడాది అనేక విషాదాలు చోటుచేసుకున్నాయి. ఒకదాన్ని మించి ఇంకొకటి చోటుచేసుకోవడం అందర్నీ ఆందోళనకు గురిచేశాయి. కారణం ఏదైనా, కొందరు నరరూప రాక్షసులుగా మారిపోతుండడం మానవాళిని కలవరపెడ్తోంది.