2002 జనవరిలో డి.రామానాయుడు గారి సమర్పణలో ''నువ్వు లేక నేను లేను'' అనే సినిమా రిలీజైంది. వెంకటేశ్ కాకుండా బయటి హీరోతో సురేష్‌బాబు నిర్మించిన తొలిచిత్రం అది. దానిలో బ్రహ్మానందంది పురోహితుడి పాత్ర. హరికథలు చెప్తూ వుంటాడు. అతనికి గ్యాస్ ట్రబుల్. వదిలినప్పుడల్లా దాన్ని త్యాగరాజకీర్తనగా వ్యవహరిస్తూ వుంటాడు. అది నీచాతినీచమైన వర్ణన. తెలుగు సంస్కృతికే అవమానకరం. సంగీతం కోసం పెట్టిన ''హాసం'' పత్రిక యీ సినిమాపై ధ్వజం ఎత్తాలి, ఏకిపారేయాలి అని మామీద ఒత్తిడి వచ్చింది. 2001 అక్టోబరులో హాసం తొలిసంచిక వచ్చింది. అంటే అప్పటికి మూడు నెలలు కూడా కాలేదు. ఆ స్టేజిలో సురేష్ ప్రొడక్షన్స్‌పై యుద్ధం ప్రకటించాలా వద్దా అన్నది మా ముందు వున్న ప్రశ్న. గ్యాస్ ట్రబుల్ పై కామెడీ సృష్టించడమే దౌర్భాగ్యం. కానీ హిందీ హీరోలు మొదలుపెట్టారు, తెలుగు హీరోలూ దాన్ని అనుకరించారు. ఇక తెలుగు కమెడియన్ల మాట చెప్పేదేముంది? అయితే దాన్ని కీర్తన అనడం ఏమిటి? పైగా త్యాగరాజ కీర్తన అని త్యాగరాజస్వామి పేరు యిలా వాడడం ఏమిటి? తప్పకుండా ఖండించవలసిన, ఉద్యమించవలసిన విషయమే. ఘాటుగా ఎడిటోరియల్ రాసి సంగీతాభిమానులందరినీ సినిమా నిర్మాతకు లేఖలు పంపమని కోరి, భవిష్యత్తులో ఎవరూ యిలా చేయకుండా బుద్ధి చెప్పవలసినంత కర్తవ్యం మా ముందు వుంది. కానీ పెద్ద పత్రికలు ఏవీ ఆ పని చేయలేదు. చిన్న పత్రిక మనం చేయగలమా? చేయాలా? సంగీతం కోసం అంకితమైన పత్రిక అని చెప్పుకున్న పత్రిక కాబట్టి మీరు చేసి తీరాల్సిందే అని కొందరు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు. ఎడిటరుగారు, నేను కూర్చుని గట్టిగా ఆలోచించాం. మేనేజింగ్ ఎడిటరుగా నాపై రెండు బాధ్యతలున్నాయి. పబ్లిషరుగా వరప్రసాద్ పేరున్నా, ఆయన హాసం విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకోలేదు. ఆయన వ్యాపారకుశలత, సమయం, పరిచయాలు, శక్తియుక్తులు అన్నీ శాంతాకే అంకితం చేశాడు. నేను అడిగినప్పుడల్లా ఏ ప్రశ్నా వేయకుండా డబ్బు యివ్వడం తప్ప మరేమీ చేయలేదు. పత్రిక మార్కెట్లోకి వెలువడ్డాక అందరు పాఠకులతో బాటే ఆయనా చూసేవాడు. ఎవరైనా వచ్చి హాసంను మెచ్చుకుంటే సంతోషించేవాడు. అందువలన ఆయన తరఫున కూడా ఆలోచించి ఆయన వ్యాపారప్రయోజనాలు చూసుకోవలసిన బాధ్యత కూడా నాపై వుంది. మరో పక్క కో-ఎడిటరుగా ఎలాగూ బాధ్యత వుంది.
ఎడిటరుగారికి సినిమావాళ్లతో పరిచయాలు ఎక్కువ. వారి రాగద్వేషాలన్నీ కరతలామలకం. బ్రహ్మానందంగారు పండితుడు కదా యీ పాత్రకు ఎలా ఒప్పుకున్నారని వాకబు చేస్తే ఆయన యిష్టపడకపోయినా సురేష్‌బాబు ఎదుట నిలబడి 'కామెడీయే కదా, ఏం ఫర్వాలేదు చేయండి' అని చేయించారని తెలిసింది. గతంలో ఈటీవీ సుమన్ రాళ్లపల్లి చేత యిలాగే 'నాకుతా..' స్వామివారి పాత్ర చేయించారట. పెద్ద నిర్మాతలతో యిదే చిక్కు. ఆర్టిస్టులకు త్యాగరాజస్వామిపై భక్తి వున్నా భుక్తి కోసం నిర్మాతను కాదనలేరు. ''ప్రేమనగర్''లో 'లేలేలే నా రాజా' పాటకు అక్కినేని అభ్యంతరం చెప్పారు, కెవి చలం, రాజబాబులతో కలిసి చేసిన కామెడీ ట్రాక్‌కు రమాప్రభ అభ్యంతరం చెప్పారు. అయినా రామానాయుడు వారిపై ఒత్తిడి చేసి చేయించారు. (రామానాయుడు గారిపై నేను రాసిన నివాళికి, దీనికీ వైరుధ్యం లేదు. నిర్మాతగా నిలదొక్కుకోవడానికి వాళ్లు యిలాటి పనులు చేస్తారు. ప్రజలు తిరస్కరించనంతకాలం వాళ్లు పాఠాలు నేర్చుకోరు. ప్రేమనగరూ ఆడింది, ఈ సినిమానూ ఆడింది. దీని గురించి ప్రెస్‌మీట్‌లో పాత్రికేయులు అడిగినప్పుడు 'కామెడీ కదండీ, దానికి పెద్ద రభస ఎందుకు?' అనే సురేష్ వాదించారు). సరే యిప్పుడు ఉద్యమం లేవనెత్తితే వచ్చే పరిణామాలేమిటి అని అడిగాను.
'హాసం' పత్రిక శాస్త్రీయ సంగీతంపై ఆధారపడి నడిచే పత్రిక కాదు. తెలుగువారికి పరిచితమైన కళారూపం సినిమా ఒక్కటే కాబట్టి, సినిమా సంగీతం గురించే ఎక్కువ చెప్తున్నాం. సినిమా ఫీల్డులో వున్నవారు సహకరిస్తేనే పత్రిక నడుస్తుంది. వాళ్లు సహాయనిరాకరణ చేస్తే పత్రికకు మెటీరియల్ దొరకదు. మనం ఒక ఉత్కృష్టమైన లక్ష్యంతో ఉద్యమిస్తున్నాం కాబట్టి… అని ముందుకు వెళితే ముక్కు బద్దలవుతుంది. ఎందుకంటే వాళ్లల్లో వాళ్లకు ఎన్ని వున్నా, బయటి నుంచి విమర్శలు వస్తే 'ఇదే ముప్పు రేపు మనకి వస్తే' అనే భావనతో అంతా ఏకమవుతారు.' అన్నాడాయన. ఆ విషయం కొన్నాళ్లకు రుజువైంది కూడా. బాబూరావు అనే జర్నలిస్టు పీఆర్వోగా తను సంపాదించిన డబ్బుతో ''చిత్రం'' అని హాసంకు కాస్త ముందుగా పత్రిక పెట్టారు. చాలా మంచి పేరు తెచ్చుకుంది. (ఆ సక్సెస్‌కు కారణం దాని డిజైన్ ఫెంగ్‌షుయి ప్రకారం వుండడం అని ఆ శాస్త్రంపై వచ్చిన పుస్తకంలో రచయిత వివరించాడు). మా హాసంకు అనేకరకాలుగా సహాయపడిన మంచిమనిషి ఆయన. కానీ కొన్నాళ్లకు ఒక వివాదంలో యిరుక్కున్నాడు. బొంబాయి నుంచి వచ్చిన సోనాలీ జోషీ అనే నటీమణి తన సినిమా దర్శకుడిపై విమర్శలు చేసి, 'మా'లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ప్రెస్‌మీట్‌లో తిట్టేసి వెళ్లిపోయింది. తక్కిన పత్రికలు లైట్‌గా తీసుకున్నాయి కానీ చిత్రం మాత్రం 'మా'పై ధ్వజమెత్తింది. అప్పట్లో 'మా'కు సెక్రటరీగా వున్న ఎవియస్ దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని చిత్రంపై పగబట్టారు. సినిమా యిండస్ట్రీ అంతా వెలివేసేట్టు చేశారు. మూడేళ్లు కూడా నడవకుండానే పత్రిక మూతపడింది. బొంబాయి నటీమణి యిటువైపు తిరిగి చూడలేదు. బాబూరావు ఆర్థికంగా నష్టపోయి యిల్లు అమ్ముకుని మళ్లీ ఉద్యోగంలోకి చేరవలసి వచ్చింది. ఇలా వుంటాయి సినిమా వాళ్ల రియాక్షన్లు.
అంతెందుకు, రాంగోపాల్ వర్మకు వివాదాలు, విమర్శలు కొత్త కాదు కదా, ఐస్‌క్రీమ్‌పై గ్రేట్ ఆంధ్రలో వచ్చిన రివ్యూపై ఆయన రియాక్షన్ గుర్తు చేసుకోండి. సమీక్షకుడు సినిమాపై విమర్శతో ఆగకుండా ఈయన సినిమా చూసి బుర్ర పాడు చేసుకున్నవాడిది స్వయంకృతాపరాధం.. వర్మ ప్రతి సినిమాతో ప్రేక్షకులను వెర్రివెంగళాయిలను చేస్తున్నా అతని మాయలో పడి టిక్కెట్టు కొనే తింగరిమేళాలు యింకా వున్నారు..- వంటి వ్యాఖ్యలు చేశాడు. అలాటి అధికప్రసంగాలు చాలా ఏళ్లగా సినిమా రివ్యూలలో చూస్తూనే వున్నాం. సినిమావాళ్లు తమ సినిమాల్లో సమాజాన్ని, మీడియాను ఏకేస్తూ వుంటారు, మీడియావారు సినిమాలను ఏకేస్తూ వుంటారు. ఇది చైన్ రియాక్షన్. కానీ యీ సందర్భంలో వర్మ సమీక్షకుడిపై విరుచుకు పడ్డారు. కెమెరా ముందుకు వచ్చి తనతో వాదనకు దిగాలనే అపూర్వమైన డిమాండ్ చేశారు. (రాత టెక్నిక్కు వేరే, కూత టెక్నిక్కు వేరే. తనకు వాదించడం వచ్చు కదాని ఆయన చర్చకు పిలిచాడు. రేపు ఒక అండర్ వరల్డ్ డాన్ వర్మతో 'మా పాత్రలను మీ సినిమాల్లో సరిగ్గా చూపించటం లేదు, నాతో గన్‌ఫైట్‌కి రా' అంటే…?) కలంపేర్ల చాటున గ్రేట్ ఆంధ్రా అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్‌లా పని చేస్తోందన్నారు. పత్రికలలో పేరు లేకుండా వ్యాసాలు రావడం, మారుపేర్లతో రాయడం అత్యంత సహజమైన విషయం. కానీ వర్మకు అది నేరంగా తోచింది. సమీక్షకుడికి బుద్ధి చెప్పడానికి కాబోలు నెలకో ఐస్‌క్రీమ్ తీస్తానని ప్రతిన బూనారు. ఇటీవల స్వప్న అనే యాంకర్ వర్మను యింటర్వ్యూ చేస్తూ ఓ ప్రశ్న అడిగారు – 'మీరు ఐస్‌క్రీమ్-15 తీస్తున్నారు, మీ అపాయింట్‌మెంట్ కోసం బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక్కరికే టైము కేటాయించగలరు. ఎవరికి ఎపాయింట్‌మెంట్ యిస్తారు?' అని.
ప్రశ్న రెండోభాగం ఎంత వూహాజనితమో, మొదటి భాగమూ అంతే వూహాజనితమా? లేక విష్‌ఫుల్ థింకింగా? అని చిరునవ్వు మొలిచింది. అంతలోనే తోచింది – వర్మ ఐస్‌క్రీమ్ 3 నుంచి 14 ఎగ్గొట్టి రేపే 15 తీసి యిదిగో అని కూడా అనగలరని. ఆ యింటర్వ్యూలో యాంకర్ దేవుడి పట్ల వర్మ భావాల గురించి అడుగుతోంది. ఆయన ఉదాత్తంగా వుండే వెస్టర్న్ ఫిలాసఫీతో, ఇండియన్ పురాణాలను పోల్చి చెప్పి (ఆరంజిలతో ఆపిల్స్ పోల్చినట్లు అంటారు ఇంగ్లీషులో) గందరగోళ పరుస్తున్నాడు. పోలిస్తే అటూయిటూ పురాణాలను పోల్చి చెప్పాలి. ఎందుకంటే యివెంత విడ్డూరంగా వుంటాయో, అవీ అంతే విడ్డూరంగా వుంటాయి. ఫిలాసఫీలైతే రెండూ సబ్లయిమ్‌గానే వుంటాయి. ఇండియన్ ఫిలాసఫీ నేను చదవలేదని చెపుతూ హిందూ పురాణపాత్రలను అపహాస్యం చేయడానికి పూనుకున్నాడాయన. కానీ యాంకర్ ఆ వైరుధ్యాన్ని ఎత్తి చూపలేదు. చూపితే వర్మ ఇంటర్వ్యూ యివ్వను పొమ్మనవచ్చు. ఐస్‌క్రీమ్ సినిమా సమీక్ష సమయంలో యిచ్చిన టీవీ యింటర్వ్యూలలో వర్మ చేసిన వాదం ఒకటుంది – 'ప్రేక్షకుడు సినిమాకు వెళ్లకుండా యీ విమర్శకుడు అడ్డుపడుతున్నాడు. ఎవరైనా బట్టల షాపులోకి వెళ్లి తనకు నచ్చిన చొక్కా కొనుక్కుందామని చూస్తాడు. కానీ యితను ఆ షాపు బయట నుంచుని లోపలికి వెళ్లకు, ఆ చొక్కా నీకు నప్పదు అని చెపుతున్నాడు. అది తప్పుకదా' అని. బట్టలషాపు లోపలికి వెళ్లినందుకు చార్జి ఏమీ వుండదు. చొక్కా కొంటేనే ఖర్చు. కానీ సినిమాహాలు లోపలకి వెళ్లడానికే ఖర్చవుతుంది. వెళ్లాక లోపల చూపిన సినిమా నచ్చినా నచ్చకపోయినా చేయగలిగేది ఏమీ వుండదు. అందుకే ఓ పుస్తకాన్ని గాని, సినిమా టిక్కెట్టును కానీ కొనడానికి ముందు సమీక్ష చూసి మరీ కొంటాం. లోకమంతా యిదే తీరు. పాతికేళ్లకు మించి ఫీల్డులో వున్న వర్మగారికి యిది తెలియకపోదు. కానీ అసహనం. సినిమా రంగంలో వుండడం వలన వచ్చే ఆక్యుపేషనల్ హజార్డ్. ఆయన రాముణ్ని, కృష్ణుణ్ని, వినాయకుణ్ని ఎవరినైనా ఏమైనా అనవచ్చు కానీ ఆయన సినిమాచూసే ప్రేక్షకులకీ, తీసే నిర్మాతలకీ దురద – అంటే మాత్రం అది అపచారం.
సినిమావారి స్వభావాలను కాచివడపోసిన ఎడిటరుగారు 'మనం 'నువ్వు లేక నేను లేను' గురించి ఉద్యమిస్తే మాత్రం కొద్దికాలంలో 'పత్రిక లేదు లేదా ఎడిటరు లేడు' అని చెప్పుకోవాలి.' అని నిర్మొహమాటంగా చెప్పారు. 'డిస్క్రిషన్ యీజ్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వేలర్' అని గుర్తు తెచ్చుకుని, త్యాగరాజస్వామి పేర జరుగుతున్న అపచారాన్ని ఎదుర్కోలేని మా నిస్సహాయతను మేమే నిందించుకుని, 'ఇది హిందూ ఆర్గనైజేషన్స్ దృష్టికి వెళ్లిందట, హిందూమతానికి ద్రోహం జరిగిందన్న వాదనతో వాళ్లు సినిమాహాళ్ల ఎదుట ఆందోళన చేస్తారట. అప్పుడు నిర్మాతలే దిగి వస్తారు' అని వూరడించుకుని, త్యాగరాజస్వామికి అపచారం చేసిన వాళ్లకు దేవుడే దండన విధిస్తాడని ఆశ పెట్టుకుని, అంతరాత్మను జోకొట్టుకున్నాం. దేవుడు వాళ్లకు ఏ శిక్షా వేయలేదు. ఆ సినిమా హిట్ అయింది. సురేష్‌బాబు యింకా పెద్ద నిర్మాత అయ్యారు, రామానాయుడుగారికి, బ్రహ్మానందంగారికి అవార్డులు కురిశాయి. హిందూ సంస్థలు ఆందోళన చేయగానే ఆ భాగాల్ని తొలగిస్తామని నిర్మాత హామీ యివ్వడం, తర్వాత దాన్ని తుంగలోకి తొక్కడం జరిగాయి. హిందూ సంస్థలు మళ్లీ పట్టించుకోలేదు. సినిమా విసిడిల్లో ఆ దృశ్యాలు యిప్పటికీ వున్నాయి. త్యాగరాజును తమిళవాళ్లు హైజాక్ చేశామని వూరికే ఆవేశపడిపోతాం. మనం యిస్తున్న గౌరవం యిది. తమిళనాడులో అయితే యిలాటి సినిమా ఆడేందుకు ఛాన్సే లేదు. ప్రజల నిరాసక్తత వల్లనే సినిమావాళ్లు చెలరేగుతారు. సినిమావాళ్లే యిలా వుంటే వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు ఎంత అసహనంగా వుంటారో వూహించండి. అందుకే వినోద్ మెహతాకు అన్ని కష్టాలు వచ్చాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)