మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి 'రావణుడు' అనే బిరుదు ఇచ్చేశాడు క్రికెటర్ యువరాజ్‌సింగ్ తండ్రి యోగరాజ్. రావణుడి పాపం పండినట్టే ఏదో ఒక రోజు ధోనీ పాపం కూడా పండుతుందని యోగరాజ్ శాపనార్ధాలు పెట్టేశాడు.
వరల్డ్ కప్ 2015లో టీమిండియా తరఫున యువరాజ్‌సింగ్‌కి అవకాశం రాకుండా చేయడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడనీ, 2011 వరల్డ్ కప్ హీరో అయిన యువరాజ్‌సింగ్‌ని అప్పటినుంచీ ధోనీ మానసికంగా వేధిస్తూనే వున్నాడని యోగరాజ్ ఆరోపించడం గమనార్హం. వాస్తవానికి యోగరాజ్, ధోనీపై ఆరోపణలు చేయడం ఇదే కొత్త కాదు. గత కొంతకాలంగా 'సీరియల్' తరహాలో యోగరాజ్, ధోనీపై దుమ్మెత్తిపోస్తున్నాడు.
ధోనీ డిక్టేటర్ అనీ, తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాడనీ, తనకన్నా టాలెంట్ వున్నవారిని అణగదొక్కుతాడనీ యోగరాజ్ ఆరోపించాడు. అహంకారంతో విర్రవీగుతోన్న ధోనీ ఆటలు ఇంకెన్నాళ్ళో చెల్లవనీ, అతి త్వరలోనే అతని పాపం పండే రోజొస్తుందని యోగరాజ్ చెప్పుకొచ్చాడు ఓ ఇంటర్వ్యూలో. నో డౌట్.. యువీ 2011 వరల్డ్ కప్ హీరో. అయితే క్యాన్సర్ బారిన పడ్డాక యువీ మునుపటి వేగాన్ని ప్రదర్శించలేకపోయాడు మైదానంలో. బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా విఫలమవడం వల్లే యువీ క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో క్రికెట్‌లో రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
యువీకి ఎంతో కొంత అన్యాయం జరిగిందని చాలామంది ఏకీభవిస్తారు. అలాగని యువీ తండ్రి, యోగరాజ్.. ధోనీని పట్టుకుని నానా రకాలుగా విమర్శలు చేయడాన్నీ పూర్తిగా సమర్థించేయలేం.