అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
శాఖాధిపతులకు అన్నీ తెలియాలా…?
పాతరోజుల్లో రాజులు సామాన్యుల కష్టాలను తెలుసుకోవడానికి మారువేషాల్లో తిరిగేవారనీ చదువుకునేవాళ్లం. మన నాయకులు కూడా అప్పుడప్పుడు మేమూ సామాన్యులమే అని చూపించుకుంటూ వుంటారు. శ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టినపుడు గునపం పట్టో, పల్లెబాట పట్టినపుడు గుడిసెలోకి దూరి అతను కాచి పెట్టుకున్న గంజి తాగో, దారిలో ఏ సంతో కనబడితే కారు దిగి కూరగాయల రేట్లు కనుక్కునో 'మేమూ సామాన్యులమే' అని చాటి చెప్తూ వుంటారు. మంత్రులు యిలా చేస్తున్నపుడు వెంటనున్న టై కట్టుకున్న అధికారులు యిలాటి చేష్టలు ఏమీ చేసే ప్రయత్నం చేయరు. సీరియస్‌గా అన్నీ గమనిస్తూ ప్రెస్ కవరేజి సరిగ్గా వస్తోందా లేదా, ఫోటోలు అందంగా తీస్తున్నారా లేదా అని చూసుకుంటూ వుంటారు. ఫోటోలు రాకపోతే యింత ప్రయాసా వ్యర్థమే కదా!
జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆర్భాటపు ఖర్చులు తగ్గించేస్తాం అంటూ చాలా ప్రచారమే జరిగింది. రాజ్ నారాయణ్‌గారు తన గదిలో ఫర్నిచర్ అంతా తీయించేసి, పరుపులు పరిపించారు. గమనించవలసిన దేమిటంటే ప్రజాజీవితంలోంచి వచ్చిన నాయకులే యివన్నీ చేస్తారు తప్ప అధికారగణం యిటువంటివాటి జోలికి పోరు. వాళ్ల ఆఫీసు ఫర్నిచరూ, అదీ మామూలుగానే వుంటుంది.
పెట్రోలు ధరలు పెరిగినపుడు యిటువంటి యాక్టివిటీ మరింత పెరుగుతుంది. ధరలు పెరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నాయకులు ఎడ్లబండిపై వస్తారు. అధికారపక్షంవారు పెట్రోలు ఆదా అంటూ ఆ రోజు ఒకే కారులో యిద్దరు ముగ్గురు మంత్రులు రావచ్చు. అదే పార్టీలో మంత్రులు కాబోయి కాలేకపోయినవారు సైకిళ్లమీద వచ్చి తమ నిజాయితీని మరింతగా ప్రదర్శించవచ్చు. ఇదంతా ఒక్కరోజు ముచ్చటే. అయితే సెక్యూరిటీ వారు, అధికారులు ఆ ఒక్క రోజూ కూడా మామూలుగా వారివారి వాహనాల్లో వచ్చి వెళతారు. ముఖ్యమంత్రి సింబాలిక్‌గా నడిచి వచ్చినా ఆయన స్టాఫ్ మాత్రం ఎప్పటిలాగా కార్లలోనే వచ్చి వెళతారు.
– – –
ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారులు ఆకాశహర్మ్యాలలో నివసిస్తున్నారని, పేదసాదల కష్టాలు వారికి పట్టవని, అందుకే సామాన్యుణ్ని దృష్టిలో పెట్టుకోకుండా పథకాలు రూపొందించి అధికారంలో వున్నవారిని తప్పుదారి పట్టిస్తూంటారని రాస్తూంటారు. ధరలు నిత్యం పెరిగిపోతున్నాయనీ, అధికారులు సామాన్య కుటుంబీకుడిలా చాలీచాలని డబ్బు జేబులో, సంచీ చేత్తో పట్టుకుని బజారు కెళ్లి కూరగాయలు, పప్పులు ఉప్పులూ స్వయంగా కొంటేనే సామాన్యులు పడే కష్టాలు తెలుస్తాయని అని రాస్తూ వుంటారు కొందరు పాత్రికేయులు.
ఇవన్నీ రొమాంటిక్ థాట్సే తప్ప వీటిలో సత్యం వుండదు. నేను అధికార బాధ్యతల్లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాల వలన తాము బాగుపడ్డామని అనేక మంది రైతులు, గ్రామాల్లో వుండే పేదలు, వినియోగదారులు, మధ్యతరగతి కుటుంబీకులు అనుకుని నాకు చెపుతూండేవారు. కానీ వ్యక్తిగతంగా చూస్తే నేను డబ్బు పట్టుకుని బజారుకీ వెళ్లను. కొనుగోళ్లూ చేయను. అయినా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు రూపొందించడానికి కావలసినంత అవగాహన, ఆరాటం నాకు వుంది.
చిన్నప్పటినుండీ నేను ఒక తరహాలో పెరిగాను. మా నాన్నగారు లాయరుగా, జడ్జీగా పేరు పొందినవారు. కలిగిన కుటుంబం కాబట్టి దేనికీ తడుముకోనక్కరలేని పరిస్థితి. చదువు అయిపోగానే స్టేటుబ్యాంక్‌లో ఉద్యోగం. దానిలో వుండగానే సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం. నౌకర్లు, చాకర్లు యింట్లో ఎప్పుడూ వున్నారు. వీటివలన నా పనులు నేనే చేసుకునే అవసరం ఎప్పుడూ రాలేదు. 'చాలా సింపుల్‌గా వున్నట్టు కనబడతారు, అబ్రహాం లింకన్‌లా మీ బూట్లు మీరే పాలిష్ చేసుకుంటారా?' అని ఎవరో అడిగారు యీ మధ్య. 'పాలిష్ చేసుకోగలను కానీ ఆ అవసరమే పడటం లేదు' అన్నాను.
ఒకప్పుడు గాంధేయవాదులు డబ్బున్నా సరే వాళ్ల బట్టలు వాళ్లే ఉతుక్కుని, వాళ్లే యిస్త్రీ చేసుకుని, వాళ్ల గదులు వాళ్లే తుడుచుకుని, వాళ్ల వంట వాళ్లే వండుకుని… యిలా వుండేవారు. ఇప్పుడు గాంధేయవాదులు కాకపోయినా కొత్తతరం యువతీయువకులు కుటుంబానికి దూరంగా హాస్టళ్లలో, ఆ తర్వాత విదేశాలలో వుండడం చేత పైన చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు. నాకు అలాటి అవసరం పడకపోవడం వలన అవేమీ నేర్చుకోలేదు. నాకు యిప్పటికీ వంట రాదు. కాఫీ కాచుకోగలను, ఆమ్లెట్ వేసుకోగలను. అంతే! నిజానికి మా పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటూ వుంటే ముచ్చటగా వుంటుంది. ఏ వంటలోనో సాయం చేయాలంటే నాకు చేతులు రావు – చేతకాక!
నేను జేబులో డబ్బు, చేతిలో సంచి పట్టుకెళ్లి పప్పులు, ఉప్పులూ కొనే సందర్భం యిప్పటిదాకా రాలేదు.
నిజం చెప్పాలంటే నా జేబులో డబ్బే వుండదు. ఓ వయసు వచ్చిన దగ్గర్నుంచి జేబులో పర్సు, డబ్బులు పెట్టుకుని తిరిగే అలవాటు లేదు. ఇప్పుడు క్రెడిట్ కార్డు వచ్చాక అస్సలే లేదు. ఉన్నట్టుండి సిగరెట్టు పెట్టె కొనుక్కోవడం, కూల్ డ్రింక్ తాగడం, లేదా ఆకలేస్తే ఓ సాండ్‌విచ్ కొనుక్కోవడం వంటి చిన్న అవసరమొస్తే ఎలా? పాన్‌షాప్ వాడి దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తానంటే వాడు తెల్లబోవచ్చు. అప్పుడు డ్రైవర్నో, ఫ్యూన్నో అప్పడిగి డబ్బు తీసుకోవడం, యింటికెళ్లగానే అప్పు తీర్చేయమని మా ఆవిడకు చెప్పడం! ఇంట్లో ఏమేం కొనాలో ఏమిటో ఆవిడే చూసుకుంటుంది కాబట్టి ఏ వస్తువు ఖరీదు ఎంత అనేది కూడా తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఇన్‌ఫ్లేషన్‌ప్రూఫ్ అన్నమాట. ధరలు తెలిస్తేనే కదా అవి పెరుగుతున్నాయో లేదో తెలిసేది!
– – –
ఇన్‌ఫ్లేషన్‌ప్రూఫ్ అంటే ఓ జోక్ గుర్తు వచ్చింది. ప్రభుత్వంలో కొన్ని శాఖలపైన యితర శాఖలవాళ్లు జోకులు తయారుచేస్తూ వుంటారు. నిజానిజాల మాట ఎలాగున్నా నవ్వుకోవడానికి బాగుంటాయి.
సేల్స్ టాక్స్ డిపార్టుమెంటులో పనిచేసేవారు ఇన్‌ఫ్లేషన్‌ప్రూఫ్ అని ఓ మిత్రుడు చమత్కరించాడు. ఎందుకంటే వాళ్లకు టూత్ పేస్ట్, మాచ్ బాక్స్, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ అన్నీ ఫ్రీగా వస్తాయి కాబట్టి! కొనేవాడి కయితే వాటి రేటు పెరిగినా, తరిగినా తెలుస్తుంది. ఫ్రీగా వచ్చేవాడికి తేడా ఏం తెలుస్తుంది?
వాళ్లమీదే యింకో జోక్! నిజాయితీపరుడైన ఐయేయస్ అధికారి ఇన్‌చార్జిగా వెళితే అక్కడి స్టాఫ్ అందరూ పండగ చేసుకుంటారట. అంటే అక్కడ అందరూ లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్నారని అర్థం కాదట. తాము తీసుకునే లంచాలలో వాటా యివ్వక్కర లేదు కదానిట! అందరి కంటె పై వాడు లంచగొండి అయితే సింహభాగం (లయన్స్ షేర్) అతనికే వెళుతుంది కదా! అతను మడి గట్టుకుని 'నీసు ముట్టకపోతే' అంత పెద్ద వాటా మనకే దక్కుతుందిగా అన్న ఆనందంట!
– – –
జోకులు పక్కన పెట్టి నా సంగతి చెప్పాలంటే మీలో ఎవరైనా నా జేబులో బలవంతంగా నోట్లు కుక్కి, బజారు కెళ్లి పప్పులు పట్టుకురా అంటే చచ్చేనే! నేను అగ్రికల్చరల్ సెక్రటరీగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ చాలా ఏళ్లు చేసినా యిప్పటికీ నాకు ఏ పప్పు ఏదో, దేనితో ఏది చేస్తారో చెప్పలేను. అంటే నాకు మెదడులో జ్ఞానప్రకాశాలు వెదజల్లే ప్రాంతాలు కొన్ని వున్నా, అజ్ఞానాంధకారం రాజ్యం ఏలుతున్న సొరంగాలు కూడా కొన్ని వున్నాయన్నమాట!
టేబుల్ మీద కనబడిన పదార్థం బాగుందనిపిస్తే తినేయడమే తప్ప, ఇడ్లీ ఏ పప్పుతో చేస్తారు? వడ ఏ పప్పుతో చేస్తారు? దోస దేనితో తయారవుతుంది? పకోడీలో ఏ పిండి వాడతారు? యివేమీ చెప్పలేను. పేర్లు తెలుసు – మినప్పప్పు, శనగపిండి అని.. ఏది ఎలా వుంటుందో, ఏ వంటకం దానితో తయారవుతుందో చెప్పలేను. నాలుగు పప్పులు కళ్ల ఎదురుగా పెట్టి ఏది ఏదో గుర్తు పట్టు అంటే కొంచెం కుస్తీ పట్టి ఇంగ్లీషులో చెప్పగలను కానీ అస్సలు గుర్తుండదు. గుర్తున్నా కూడా అదేదో చంటిపిల్లలకు స్కూల్ టీచరు అడిగితే చెప్పినట్లు చెప్పడమే కానీ, ఐ హేవ్ నో గట్ ఫీలింగ్. ఇది యిదే అని ఖచ్చితంగా, ఘంటాపథంగా చెప్పలేను. అది చూడగానే దానితో చేసిన తినుబండారం గుర్తుకురాదు.
చాలామంది నన్ను అడుగుతూవుంటారు – ఎవరైనా ఒక విద్యలో నిష్ణాతులవుతారు, తక్కినవాటిలో వారికి అస్సలు ఏమీ తెలియదు. ఒక డాక్టరుకి లా అస్సలు తెలియదు, ఒక లాయరుకు ఎకౌంటెన్సీ తెలియదు. కానీ మీ ఐయేయస్ అధికారులు మాత్రం యివాళ అడవుల డిపార్టుమెంటులో పనిచేస్తారు, రేపు సముద్రాల శాఖలో పనిచేస్తారు. కితం ఏడాది నీటి శాఖలో పనిచేస్తే వచ్చే ఏడాది నిప్పుల శాఖలో పని చేస్తారు. ఇన్ని శాఖల గురించి పరిజ్ఞానం ఎలా సంపాదిస్తారు? అని.
నా మట్టుకు నేను చేనేత శాఖలో చేశాను – ఫిషరీస్‌లో చేశాను, సివిల్ సప్లయిస్‌లో చేశాను – ఎక్సయిజ్‌లో చేశాను, కమ్మర్షియల్ టాక్స్‌లో చేశాను – ఎగ్రికల్చర్‌లో చేశాను, ప్లానింగ్‌లో చేశాను – కో-ఆపరేషన్‌లో చేశాను.. ఒకదానికీ మరొకదానికీ పొంతన లేదు. మద్యం ముట్టనివారు ఎక్సయిజ్‌లో అమ్మకాలు పెంచి రాణించారు. శాకాహారులు మత్స్య శాఖలో ఉత్పత్తి పెంచి పేరు గడించారు. పట్నంలోనే పుట్టి, పట్నాలలోనే పెరిగిన నా బోటివాడు రూరల్ ఎకానమీపై సాధికారంగా చర్చించగల నేర్పు సంపాదించాడు.
– – –
అంటే ఇక్కడ గ్రహించవలసినది ఒక శాఖను సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసినది – మేనేజ్‌మెంట్ స్కిల్స్! ఏ శాఖకు వెళ్లినా మేము పది, పదిహేను రోజుల్లో దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకుంటాం. అక్కడ అప్పటికే కొందరు ఏళ్లతరబడి పనిచేస్తూ వుంటారు. పరిసరాల గురించి, వనరుల గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి, అనేక ప్రయోగాలు చేసి అనుభవం సంపాదించి వుంటారు. అప్పటికే జరిగిన కృషి ఏ స్థాయిలో జరిగింది, ఎక్కడ సఫలమైంది, ఎక్కడ, ఎందుకు విఫలమైంది, దానికి పరిష్కార మార్గాలేమైనా వున్నాయా యిటువంటివి చూసుకుని, కార్యసాఫల్యానికి తగిన వ్యక్తులను ఎంచుకుని వారిని ఉత్సాహపరచి, పనిదొంగలను శిక్షించి లక్ష్యసాధనకు అందర్నీ పురికొల్పడమే ఓ ఉన్నతాధికారి చేయవలసిన పని.
ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే హ్యూమన్ మేనేజ్‌మెంట్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడంలోనే వున్నాయి మీ ప్రజ్ఞాపాటవాలు. మీరు కార్పోరేట్ ఉద్యోగి కావచ్చు, అంత్రప్రెనార్ కావచ్చు, ప్రభుత్వ అధికారి కావచ్చు. మేనేజ్‌మెంట్ స్కిల్స్ అంటూ వంటపడితే మీరున్న రంగం మారినా మీరు రాణిస్తారు. టాటా గ్రూపు, రిలయన్సు గ్రూపు వంటివి అనేక విభిన్న వ్యాపారాల్లో వున్నాయి. వాటి అధిపతులకు ఆ యా రంగాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతా వుండాలని ఎక్కడా లేదు.
ముకేష్ అంబానీని ఆపి లీటరు పెట్రోలు ధర ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, రతన్ టాటా గార్ని ఆపి పోస్టు -పెయిడ్ కనక్షన్‌లో అతి చవకైనది ఏది అని అడిగితే ఏమో అనవచ్చు. ఇక్కడ కావలసినది దృక్పథం, లక్ష్యశుద్ధి, కార్యదీక్ష. దీనికోసం మహారాజులు మారువేషాల్లో తిరగనక్కరలేదు, మంత్రులు ఎడ్లబండి నెక్కనక్కరలేదు, అధికారులు సిటీబస్సుల్లో ప్రయాణించ నక్కరలేదు.
కొసమెరుపు – సంతానంగారు కలక్టరుగా పనిచేసే రోజుల్లో ఓ రోజు ఎవరికో ఫోన్ చేయాలనుకుని ఎక్స్‌టెన్షన్ ఫోనెత్తారు. తన ఆఫీసుతో పని బడిన ఓ వ్యక్తికి, తన క్యాంప్ క్లర్కుకి జరుగుతున్న సంభాషణ ఆయన చెవిన పడింది.
ఊరికేనే ''ఎవరండీ మాట్లాడుతున్నది?'' అని అడిగారు.
''మధ్యలో తమరెవరండీ?'' అని అడిగాడు అవతలి పార్టీ.
''కలక్టరును'' అన్నారు సంతానంగారు ఠీవిగా.
''అయ్యా కలక్టరుగారూ, నేనేదో మీ క్యాంప్ క్లర్కు లెవెల్లో వ్యవహారం సెటిల్ చేసుకుంటూ వుంటే మధ్యలో మీరెందుకు దూరతారు? దయచేసి ఫోన్ పెట్టేయండి…'' అని హితవు చెప్పాడు ఆ అనుభవజ్ఞుడు.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version