సీనియర్ గాయకుడు మందు కొట్టి స్టేజ్ పైకి వచ్చారా?

కొంతమంది సెలబ్రిటీలు మద్యం తాగి కార్యక్రమాలకు హాజరవుతుంటారు.

కొంతమంది సెలబ్రిటీలు మద్యం తాగి కార్యక్రమాలకు హాజరవుతుంటారు. టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఆరోపణలు కొంతమందిపై వచ్చాయి. సరిగ్గా అలాంటి ఆరోపణలే ఇప్పుడు దలెర్ మెహందీపై వచ్చాయి. ఈ సీనియర్ గాయకుడు మద్యం సేవించి, స్టేజ్ పైకొచ్చి పాటలు పాడారంట.

ఒకప్పుడు తన పాటలతో దేశాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తి దలెర్ మెహందీ. ఇటీవల ఉత్తరాఖండ్‌ లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అది కాస్తా వివాదానికి కారణమైంది.

ఈ కార్యక్రమంలో ఆయన పాటలు పాడుతుండగా, ఉత్తరాఖండ్ మంత్రి, నరేంద్రనగర్ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ వేదికపైకి వచ్చి ఆయన ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దలెర్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని, అలాంటప్పుడు ఎలా పాటలు పాడతారని ముఖంపైనే ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.

దలెర్ మెహందీకి ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు రూ.35 లక్షలు చెల్లించినట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్న ప్రముఖ కళాకారుడు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్లని.. దలెర్ మెహందీ మాత్రం వేదికపై అయోమయంగా కనిపించారని ఆయన ఆరోపించారు.

దలెర్ పాటలు స్వయంగా పాడటానికి బదులుగా కేవలం లిప్ ‌సింక్ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రేక్షకులు ఆయన పాటలను ప్రత్యక్షంగా వినేందుకు వచ్చారని, ఆయన తన కళకు తగిన న్యాయం చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా, దలెర్ మెహందీ మద్యం సేవించి కార్యక్రమానికి వచ్చారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వైరల్ అయిన వీడియోల్లో ఆయన మద్యం సేవించినట్టు కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ వివాదంపై దలెర్ మెహందీ సోదరుడు, ప్రముఖ గాయకుడు మికా సింగ్ స్పందించాడు. ఇ‌నస్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో ద్వారా ఆయన తన సోదరుడికి మద్దతుగా నిలబడ్డారు. దలెర్ మెహందీ 3 దశాబ్దాలుగా సంగీత రంగంలో స్టార్‌గా కొనసాగుతున్నారని, ఆయన మద్యం సేవిస్తున్నట్లు ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా అని ప్రశ్నిస్తున్నాడు మికా సింగ్.

ఒక షోకు అంగీకరించిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పటికీ తమ మాట నిలబెట్టుకోవడానికి కళాకారులు ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని.. దలెర్ మెహందీ ఇటీవల పెద్ద ఆపరేషన్ చేయించుకున్నారని, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోయినా కార్యక్రమానికి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.

దలెర్ మెహందీ మద్యం సేవించి ప్రదర్శన ఇచ్చినట్టు ఎవరైనా నిరూపిస్తే తాను పాటలు పాడటం మానేస్తానని సవాల్ విసిరాడు మికా సింగ్.

జరిగిన ఘటనపై దలెర్ కూడా స్పందించారు. తన ఆరోగ్యం బాగోలేదని, లైవ్ షోలో పాటలు పాడే పరిస్థితి లేకపోవడంతో ప్రదర్శనను కొనసాగించడానికి డబ్బింగ్‌ తరహా రికార్డెడ్ వాయిస్‌ ను ఉపయోగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

1990ల్లో ‘బోలో తా రా రా’, ‘దర్ది రబ్ రబ్’, ‘హో జాయేగీ బల్లే బల్లే’ వంటి పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దలెర్ మెహందీ. భాంగ్రా, పాప్ సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రముఖ గాయకుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు.

2 Replies to “సీనియర్ గాయకుడు మందు కొట్టి స్టేజ్ పైకి వచ్చారా?”

  1. పాత్రికేయులు దిగజారిపోయారు అనేది అందరికీ తెలిసినదే

    వీడిది పరాకాష్ట

    దలేర్ మెహెందీ తాగి వచ్చినది దసరా మహోత్సవాలలో భాగంగా జరిగిన పూజా ఉత్సవాలలో. మంత్రి వార్నింగ్ ఇచ్చింది కూడా పవిత్రంగా జరపాల్సిన కార్యక్రమాన్ని తాగి జరుపుతున్నందుకు.

    ఆ సంగతి దాచిపెట్టి అసలు నిజాన్ని రాయని వీడు నిజమైన పాత్రికేయుడు

Comments are closed.