ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ట్రయిలర్ రిలీజ్ చేశారు, ఆ వెంటనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు.
వెంటవెంటనే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ హంగామా నుంచి ఒక్కరు మాత్రం మిస్సయ్యారు. అతడే నాగవంశీ.
అవును.. ఆదర్శ కుటుంబం ప్రచార ప్రహసనంలో నాగవంశీ కనిపించట్లేదు. అలా ఎందుకు జరిగిందనేది చాలామంది ప్రశ్న.
ఆయన తనంతట తానే తప్పుకున్నారా? లేక యూనిట్ అంతా కలసి చర్చించి నాగవంశీని తప్పించారా?
ఎవరు ఔనన్నా కాదన్నా సోషల్ మీడియాలో నాగవంశీ ఓ ప్రభంజనం. ఆయన ‘నో ఫిల్టర్’ కామెంట్స్ చాలామందికి నచ్చుతాయి.
కొంతమందికి కోపం తెప్పిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆయన ట్రోలింగ్ కు గురవుతుంటారు.
మరోసారి అలాంటి వివాదాలు, ట్రోలింగ్స్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో నాగవంశీ, ఆదర్శ కుటుంబం ప్రచారం నుంచి తప్పుకున్నారని అనుకోవాలి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కనీసం ఆయన ఓ అతిథిగా కూడా కనిపించట్లేదు.
నాగవంశీకి సంబంధించినంత వరకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్. ఆదర్శ కుటుంబానికి, ఆ బ్యానర్ కు సంబంధం లేదు కాబట్టి ఆయన కనిపించట్లేదని కొంతమంది వాదించొచ్చు.
కానీ హారిక-హాసిని, సితార ఒకటే. పైగా ఆదర్శ కుటుంబం సినిమాను పోస్ట్ పోన్ చేసినప్పుడు ఎవ్వరూ ముందుకురాలేదు. నాగవంశీనే మీడియాను ఫేస్ చేశారు.
పైగా ప్రచారం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆయనే చూసుకుంటున్నాడు. కాబట్టి ఆదర్శ కుటుంబం యూనిట్ తో ఆయనకు సంబంధం లేదనలేం. ఆయన వస్తానంటే అక్కడ నో చెప్పే వారు కూడా ఎవ్వరూ లేరు.
సో.. ఈ సినిమా ప్రచారం నుంచి నాగవంశీనే స్వయంగా తప్పుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన కనిపిస్తే సినిమా వాయిదా గురించి, టికెట్ రేట్ల పెంపు గురించి అడుగుతారు.
ఇంకాస్త ముందుకెళ్లి జైలర్-2పై కూడా ప్రశ్నలు వస్తాయి. ఇలా చర్చ పక్కదోవ పట్టకుండా ఉండేందుకు ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారేమో.
ఈ క్రమంలో నాగవంశీకి, త్రివిక్రమ్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదు. ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉండాలని నాగవంశీనే సొంతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రశ్నా నీదే… సమాధానమూ నీదే… అలాగే కానీ