రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా విడుదలైన వెంటనే, హీరోయిన్ జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై చెలరేగిన వివాదం, ఆ తర్వాత కొన్ని రోజులకే చాలా పెద్దదైంది.
దీంతో జాన్వి కపూర్ పూర్తిగా ఈ సినిమాకు దూరమైంది. ప్రచారానికి కూడా రాలేదు. ఎక్కడా పెద్ది ప్రస్తావన తీసుకురాలేదు.
ఎట్టకేలకు పెద్దిలో తన పాత్ర చిత్రీకరణపై స్పందించింది జాన్వి కపూర్. సినిమాలో తనను కొన్ని షాట్స్ లో అభ్యంతరకరంగా చూపించారనే విషయాన్ని అంగీకరించింది జాన్వి. తనను మితిమీరిన గ్లామర్ కోణంలో చూపించారనే విమర్శ వందకు వందశాతం నిజమని చెప్పుకొచ్చింది.
“ఇలాంటి సన్నివేశాలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో తలుచుకుంటే, ఓ మహిళగా చాలా బాధేసింది. ఆ తప్పు వల్ల కలిగిన అవమాన భారాన్ని నేను జీవితాంతం మోయక తప్పదు. ఈ విషయంలో నేను ఇంకాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సింది. సినిమాలో నా పాత్ర చిత్రీకరణ కచ్చితంగా ఇబ్బందికరంగా ఉందనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను.”
సినిమాలో జాన్వి కపూర్ శరీరాన్ని మితిమీరి చూపించారని, అది సమాజంలో లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఆ విమర్శల్ని జాన్వి కపూర్ తాజాగా అంగీకరించింది.
సాధారణంగా నటీనటులు దర్శకుడు చెప్పినట్లే చేస్తారని, తను కూడా అలానే చేశానని.. అలా అని తప్పును ఒకరిపై నెట్టేయడం తనకు ఎంతమాత్రం నచ్చదంటోంది జాన్వి.
సౌత్ లో ముందుగానే పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వడం లేదా కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయో ముందుగానే చెప్పడం లాంటివి చాలా అరుదుగా జరుగుతాయని అంటోంది.
ఈ చేదు అనుభవం వల్ల తనకు ఓ మంచి జరిగిందని, ఇకపై ఏ దర్శకుడైనా తనను అభ్యంతరకరంగా చూపిస్తే వెంటనే నిలదీస్తానని అంటోంది జాన్వి కపూర్. పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని చెబుతోంది.
సినిమాలో హీరోయిన్ కు తనపై ఆసక్తి లేదని తెలిసి కూడా హీరో ఆమెను వేధించడం.. కరెంట్ పోయినప్పుడు ఆమె అనుమతి లేకుండానే చీకట్లో ముద్దు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ప్రేమ పేరిట లైంగిక వేధింపులను చూపించారంటూ విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ నిరసనలపై జాన్వీ కపూర్ ఓపెన్ గా స్పందించింది.
వీటిపై దర్శకుడు బుచ్చిబాబు అప్పట్లోనే బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు, వెంటనే అలాంటి సన్నివేశాల్ని సినిమా నుంచి తొలగించాడు కూడా. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
