మళ్లీ రేగిన గేమ్ ఛేంజర్ గాయం.. అసలు తప్పెవరిది?

కార్తీక్ సుబ్బరాజ్ చెప్పినట్లుగా ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న సహజత్వానికి, శంకర్ భారీతనానికి సింక్ కుదరకపోవడం వల్లే సినిమా ఫలితం తారుమారైనట్టు కనిపిస్తోంది.

రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది.

450 కోట్ల రూపాయలు పెట్టి దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా సగం పెట్టుబడిని కూడా థియేటర్ల నుంచి వెనక్కు రాబట్టలేకపోయింది.

ఈ సినిమా ఫెయిల్యూర్ పై అప్పట్లో ఎవరి వెర్షన్ వాళ్లు వినిపించారు. ఒక దశలో కథలోనే చాలా లోపాలున్నాయనే కామెంట్ కూడా వినిపించింది. ఇప్పుడు దానిపై కూడా స్పందించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. గేమ్ ఛేంజర్ కు కథ అందించింది ఇతడే.

చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఎందుకు ఆశించిన స్థాయిలో ఆడలేదనే విషయంపై కార్తీక్ సుబ్బరాజ్ తనదైన వెర్షన్ చెప్పుకొచ్చాడు.

ముందుగా ఈ కథను తమిళంలో మధురై నేపథ్యంలో సాగే ఒక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌ డ్రాప్‌ తో రాశానని కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించాడు.

ప్రస్తుత వ్యవస్థను మార్చాలనుకునే ఒక ఐఏఎస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుందని, హిందీలో అప్పట్లో వచ్చిన న్యూటన్ అనే సినిమా తరహాలో వాస్తవికతకు దగ్గరగా ఉండే యాక్షన్ కథగా గేమ్ చేంజర్ కథ రాశానని అన్నాడు.

రామ్ చరణ్ లాంటి స్టార్, శంకర్ లాంటి పెద్ద దర్శకుడు ఉండడంతో, కథలో మార్పులు చేశారని తెలిపాడు కార్తీక్ సుబ్బరాజు. రిలీజైన తర్వాత సినిమాను థియేటర్లలో చూసి, తను రాసిన కథ పూర్తిగా మారిపోయిన విషయాన్ని గ్రహించానన్నాడు.

గేమ్ చేంజర్ రిజల్ట్ పట్ల నిర్మాత దిల్ రాజు కూడా గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో శంకర్‌పై ఎడిటర్ షమీర్ మహ్మద్ కూడా కొన్ని విమర్శలు చేశాడు. ఇలా చాలామంది శంకర్ నే తప్పుబట్టారు.

ఆర్ఆర్ఆర్ వంటి హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో గేమ్ చేంజర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు తగ్గట్టే భారీ నిర్మాణ విలువలు, గ్రాండ్ విజువల్స్, కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ.. కీలకమైన కథ లేకపోవడం గేమ్ ఛేంజర్ కు మైనస్ గా మారింది.

కార్తీక్ సుబ్బరాజ్ చెప్పినట్లుగా ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న సహజత్వానికి, శంకర్ భారీతనానికి సింక్ కుదరకపోవడం వల్లే సినిమా ఫలితం తారుమారైనట్టు కనిపిస్తోంది.

పెద్ద హీరోల ఇమేజ్, భారీ బడ్జెట్ హంగుల కోసం కథలను పూర్తిగా మార్చడం వల్ల కొన్నిసార్లు ఫలితం ఎలా బెడిసికొడుతుందో చెప్పడానికి గేమ్ ఛేంజర్ ఒక ఉదాహరణగా నిలిచింది.