సాధారణంగా ఏ హీరో అయినా సినిమా సినిమాకు తన పారితోషికం పెంచుకుంటాడు. స్టార్ హీరోల సంగతైతే చెప్పనక్కర్లేదు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ సవరిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ కెరీర్ మాత్రం అలా సాగలేదు.
మరీ ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత పవన్ చేసిన సినిమాలకు, అతడు అందుకున్న పారితోషికాలకు పొంతన లేదు. ఒక సినిమాకు 50 కోట్లు, మరో సినిమాకు వంద కోట్లు, మధ్యలో 11 కోట్లు.. ఇలా సాగింది పవన్ తీసుకునే రెమ్యూనరేషన్. అసలు పవన్ తీసుకునే మొత్తాల్లో ఎందుకింత వ్యత్యాసం,
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు పవన్ కల్యాణ్. దిల్ రాజు ఆ సినిమాకు నిర్మాత. ఆ టైమ్ లో పార్టీని నిలబెట్టడానికి పవన్ కు డబ్బు అవసరం. పైగా అంతకుముందు చిత్రం అజ్ఞాతవాసి డిజాస్టర్. ఆ తర్వాత భారీ విరామం. దీంతో ఆయన రెమ్యూనరేషన్ గురించి ఆలోచించలేదు.
రూ.50 కోట్లు తీసుకొని ఈ సినిమా చేయడానికి అంగీకరించారు పవన్. అదే టైమ్ లో కరోనా మొదలైంది. థియేటర్లు మూతపడ్డాయి. తెరిచిన తర్వాత కూడా కఠినమైన నిబంధనల కారణంగా ఆక్యుపెన్సీ తగ్గింది. నిర్మాతకు నష్టాలు తప్పలేదు. దీంతో ఒప్పుకున్న రెమ్యూనరేషన్ కంటే తక్కువే తీసుకున్నారు పవన్.
ఇదే విషయాన్ని ఓ సందర్భంలో దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ కు సంబంధించి దాదాపు 5 కోట్ల ఎమౌంట్ ను ఆయన ఇప్పటికీ తీసుకోలేదని వెల్లడించారు. ఇక ఈ సినిమాతో వచ్చిన డబ్బును ఆయన పూర్తిగా పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించారు.
వకీల్ సాబ్ తర్వాత భీమ్లానాయక్ చేశారు. ఈ సినిమాకు కూడా ఆయన 50 కోట్లు తీసుకున్నట్టు టాక్. ఈ మొత్తాన్ని మాత్రం పవన్ పూర్తిస్థాయిలో అందుకున్నట్టు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ లో దాదాపు సగం పవన్ పారితోషికానికే వెళ్లినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి.
భీమ్లానాయక్ తర్వాత బ్రో సినిమా వచ్చింది. ఈ సినిమాను కూడా ఆయన 50 కోట్లకు అంగీకరించారు. అయితే సినిమా షూటింగ్ టైమ్ లో ఆయనకు పూర్తి మొత్తం అందినట్టు లేదు.
ఎందుకంటే, తన రెమ్యూనరేషన్ ఫిక్స్ అవ్వడానికి ముందే, ఆయన కొన్ని అవసరాల కోసం నిర్మాత నుంచి కొంత డబ్బు తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత బ్రో సినిమా చేయడంతో, పారితోషికం తగ్గినట్టు చెబుతారు.
ఇదే పద్ధతి హరిహర వీరమల్లు విషయంలో కూడా జరిగింది. ఆ సినిమా నిర్మాత నుంచి చాలా ఏళ్ల కిందటే కొంత మొత్తం తీసుకున్నారు పవన్ కల్యాణ్. పైగా సినిమా అగ్రిమెంట్ కూడా చాన్నాళ్ల కిందటే జరిగింది.
దీంతో ఈ సినిమాకు పవన్ 11 నుంచి 20 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు చెబుతారు. అంటే.. బ్రో సినిమా పారితోషికంతో పోలిస్తే, 60 నుంచి 78 శాతం తక్కువ మొత్తానికే హరిహర వీరమల్లు సినిమా చేసినట్టు లెక్క.
పైగా ఈ సినిమాకు పవన్ దగ్గరుండి ప్రచారం కూడా నిర్వహించారు. చాలా కారణాల వల్ల ఈ సినిమా నిర్మాత నష్టపోయారని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నానని వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూల్లో తన పారితోషికం ఎంతో కూడా తనకు తెలియదని, సినిమా హిట్టయితే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు.
హరిహర వీరమల్లు తర్వాత ఓజీ చేశారు. ఈ సినిమాకు అమాంతం వంద కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్ లో పవన్ కల్యాణ్, అత్యధిక పారితోషికం అందుకున్న సినిమా ఇదే.
ఈ మూవీ తర్వాత మళ్లీ ఆయన రెమ్యూనరేషన్ అమాంతం పడిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆయన కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నట్టు సమాచారం. దీనికి కూడా కొన్ని కారణాలున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా టైపులోనే ఉస్తాద్ కూడా చాన్నాళ్లుగా లేట్ అయింది. అడ్వాన్స్ ఎమౌంట్, చాన్నాళ్లు పవన్ దగ్గర ఉండిపోయింది. దీనికితోడు మైత్రీ నిర్మాతల నుంచి ఆయన అప్పు కూడా తీసుకున్నారు. ఆ మొత్తాన్ని కూడా మాఫీ చేస్తూ, ఫైనల్ గా 25 కోట్లకు ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసినట్టు తెలుస్తోంది.
ఇలా పవన్ కల్యాణ్ పారితోషికాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. పాత కమిట్ మెంట్లు, అప్పులు, అడ్వాన్సులు, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తన పారితోషాల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు పవన్.
తన సొంత పారితోషికం కంటే సినిమా అవసరాలు, తన ఇతర ఖర్చులకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయం, అప్పటి సందర్భం బట్టి ఆయన అప్పటికప్పుడు పారితోషికంపై నిర్ణయాలు తీసుకున్నారు.
రూ.163 కోట్లు ఆస్తి.. రూ.60 కోట్లు ఆదాయం..
పవన్ కల్యాణ్ నికర ఆస్తుల విలువ 163 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. చర, స్థిరాస్తుల మొత్తం విలువ రూ.164.53 కోట్లు ఉందని తెలిపారు. ఇక వివిధ బ్యాంకులు, వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును రూ.65.77 కోట్లుగా పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 వరకు ఐదేళ్లలో రూ.60.77 కోట్లు సంపాదించినట్టు ఆయన పేర్కొన్నారు.
