మారుతారా: దేవుడిసొత్తు దోపిడీపై హైకోర్టు మొట్టికాయ్!

తమాషా ఏంటంటే.. చంద్రబాబునాయుడు తాను సాంకేతికతతో ఆటలాడుకునే మేధావి నాయకుడినని చెప్పుకుంటూ ఉంటారు.

హైకోర్టు సాక్షిగా ఇది ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ! తిరుమల వేంకటేశ్వరస్వామివారికి తాను అపరిమితమైన భక్తుడినని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. అదే దేవదేవుడి సొత్తును అడ్డదారుల్లో ప్రెవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి ఎలా తెగించారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

టీటీడీ భూమిని ఒబెరాయ్ గ్రూపునకు చెందిన స్వర హోటల్స్ కు కేటాయిచండంపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. పూర్తిగా వ్యాపార నిర్ణయంగా కనిపిస్తున్నదని హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం విశేషం.

దేవుడి సొత్తుతో ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో ఇకనైనా బుద్ధి వస్తుందా? అని ప్రజలు అనుకుంటున్నారు. హైకోర్టు మొట్టికాయ వేసే వ్యాఖ్యలకు కూడా మార్పు రాకపోతే.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూడా అనుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి అర్బన్ మండలం ఆర్ఎస్ గ్రామం పరిధిలోని 20 ఎకరాల భూమిని ఒబెరాయ్ గ్రూపునకు చెందిన స్వర హోటల్స్ కు కేటాయించారు. దేవుడి భూములను ఇలా ప్రెవేటు సంస్థకు అప్పగించడంపై భూమన కరుణాకర రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అయితే టీటీడీ భూమిని తొలుత పర్యాటక శాఖకు కేటాయించి.. అందుకు బదులుగా ఆ శాఖనుంచి వేరే స్థలాన్ని టీటీడీ తీసుకుంది. అలా వచ్చిన భూమిని పర్యాటక శాఖ స్వర హోటల్స్ కు ఇచ్చింది. ఈ డొంకతిరుగుడు అక్రమాలపై భూమన కేసు వేయగా.. ఇదంతా వ్యాపారంలా కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.

400 కోట్ల రూపాయల టీటీడీ భూమిని పర్యాటక శాఖకు అప్పగించేసి, కేవలం 20 కోట్ల భూమిని బదులుగా తీసుకున్నారనేది భూమన చేస్తున్న ఆరోపణ. అందులో ఏ కొంతనిజమున్నా సరే.. ఏపీ సర్కారు తిరుమల దేవదేవుని ఆస్తులకు తీరని ద్రోహం చేసిన పాపానికి ఒడిగట్టినట్టే లెక్క.

ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. టీటీడీ వాదనల్లో పసలేదని తేలిపోతోంది. అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మించాలని టీటీడీ మొదట్లో భావించిందని.. సాంకేతిక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తమాషా ఏంటంటే.. చంద్రబాబునాయుడు తాను సాంకేతికతతో ఆటలాడుకునే మేధావి నాయకుడినని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఆయన పాలనలో.. సాంకేతిక కారణాల వల్ల.. టీటీడీ కోసం బేస్ క్యాంపు నిర్మించడం సాధ్యం కాలేదు గానీ.. అదే స్థలంలో.. ఇప్పుడు ఒబెరాయ్ గ్రూపు హోటల్స్ ను నిర్మిస్తారని అనడం వంచనే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

ఆ స్థలాన్ని హోటల్స్ కు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం అంటూ టీటీడీ వాదిస్తోంది. ప్రభుత్వం మీదకు నెడుతున్నారు గానీ.. ప్రభుత్వానికి ఆ స్థలాన్ని అప్పగించి, చవకభూముల్ని బదులుగా తీసుకున్న నిర్ణయం టీటీడీదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఇదంతా పెద్ద వ్యాపారంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. భూకేటాయింపులపై మొత్తం స్టేటస్ రిపోర్టును తమ ముందుంచాలని ఆదేశించడం విశేషం.

One Reply to “మారుతారా: దేవుడిసొత్తు దోపిడీపై హైకోర్టు మొట్టికాయ్!”

Comments are closed.