మూవీ రివ్యూ: ఇట్లు అర్జున

డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ అయ్యాయి. కొంచెం నితిన్ ని గుర్తుచేసేలా ఉన్నాయి అనీష్ హావభావాలు.

సినిమా: ఇట్లు అర్జున
రేటింగ్: 2.5/5
బ్యానర్: వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: అనీష్, అనస్వర రాజన్, వెన్నెల కిషోర్, ముఖేష్ రిషి, కలైయరసన్ హరికృష్ణన్, ఎలాంగో కుమరవేల్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, రఘుబాబు, అరుణ భిక్షు, మైమ్ గోపి, ప్రవీణ లలితాబాయి, రోహన్ రాయ్ తదితరులు.
సంగీత దర్శకుడు: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రాజా మహదేవన్
ఎడిటర్: కోటి కె
ఫైట్స్: దినేష్ సుబ్బరాయన్, కరుణాకర్
ప్రొడక్షన్ డిజైనర్: రామ్ కుమార్. ఎ
నిర్మాత: వెంకీ కుడుముల
రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పల
విడుదల తేదీ: నవంబర్ 13, 2026

ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత ఏ. మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరో అనేటప్పటికి కొంత బజ్ వచ్చింది. అక్కినేని నాగార్జున ఈ సినిమాను సమర్పిస్తుండటంతో పాటు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అఖిల్ వంటి హీరోలు కూడా సినిమాకు తమవంతుగా మద్దతు తెలుపుతూ ప్రమోట్ చేశారు. దీంతో కొత్త హీరోతో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఇంతటి బజ్ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? చూద్దాం.

కథేంటంటే.. అర్జున్ (అనీష్) మాట్లాడలేని ఓ చిన్న దొంగ. తన ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే కీర్తి (అనస్వర రాజన్)ను రహస్యంగా ఇష్టపడుతుంటాడు. అయితే, తన మనసులోని ప్రేమను ఆమెకు చెప్పలేకపోతుంటాడు.

మరోవైపు, కీర్తిని ఆమె తల్లి ఎప్పుడూ పద్ధతుల పేరుతో కట్టడి చేస్తుంటుంది. తల్లి వీసా పనిమీద ఢిల్లీకి వెళ్లడంతో కీర్తికి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. దీంతో సరదాగా ఓ పబ్‌కు వెళ్తుంది. అయితే, అక్కడ ఆమె బావ (వెన్నెల కిషోర్) కంటపడటంతో అతడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. ఈ క్రమంలోనే ఆమెకు అర్జున్ ఎదురవుతాడు.

బావ నుంచి తప్పించుకోవడానికి కీర్తి అర్జున్ సాయం కోరుతుంది. అలా ఇద్దరూ అనుకోకుండా ఓ ఫ్లాట్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఓ వ్యక్తి వారికి పాస్‌వర్డ్, పెన్‌డ్రైవ్ ఉన్న బాక్స్‌ను అప్పగిస్తాడు. ఆ తర్వాత ఆ పెన్‌డ్రైవ్ కోసం ఓ పోలీస్ ఆఫీసర్‌తో పాటు పెద్దన్న (ముఖేష్ రిషి)కి చెందిన గ్యాంగ్ కూడా వీరి వెంట పడుతుంది.

అసలు ఈ ప్రమాదకరమైన వ్యవహారంలోకి ఆ జంట ఎలా చిక్కుకున్నారు? పెద్దన్న గ్యాంగ్ నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ.

ఎంచుకున్న కథకి స్పాన్ ఎక్కువ. డెబ్యూ హీరో మీద నిజాంగా ఇది కాస్తంత సాహసమే. ఎందుకంటే తీస్తే సాఫ్ట్ లవ్ స్టోరీ తీయొచ్చు, లేదా యాక్షన్ చిత్రం తీయొచ్చు. ఆ రెండింటినీ బ్లెండ్ చేస్తూ.. పైగా చాలెంజింగ్ అనిపించే మూగ పాత్ర చేస్తూ ఆకట్టుకోవాలంటే కసరత్తు చాలా అవసరం.

ఆ కష్టం కనపడింది. కానీ ఫలితం ఎంత అనేది మాట్లాడుకుంటే.. ఈ చిత్రానికి అయిన ఖర్చుకి రాబడి వస్తుందా అనేదే ప్రశ్న.

కంటెంట్ పరంగా చూస్తే ఒక ప్రేమ జంట.. అనుకోకుండా వాళ్లకి ఒక చనిపోబోతున్న వ్యక్తి నుంచి ఒక వస్తువు అందడం.. దాని కోసం అటు ఒక పోలీస్ ఆఫీసర్, ఇటు కొందరు రౌడీలు వెంటపడడం.. ఇదంతా చెప్తుంటే మీకొక సినిమా గుర్తురావాలి. అదే.. ఆర్జీవీ తీసిన “అనగనగా ఒక రోజు”. అందులో జేడీ-ఊర్మిళ.. ఇందులో అనీష్-అనస్వర; అందులో కేసెట్.. ఇందులో పెన్ డ్రైవ్; అందులో రఘువరన్-ఇందులో కుమారవేల్. అయితే అది కామెడీ, ఇది యాక్షన్. అంతే తేడా.

అన్నీ బాగానే సెట్టైనా.. యాక్షన్ ట్రాక్ పకడ్బందీగా రాసినట్టు అనిపించదు.

ఫస్టాఫులో కామెడీ ట్రాక్, టెండర్ లవ్ సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీ నవ్విస్తాయి. ఇంటర్వెల్ వరకు కథనం బాగానే సాగుతుంది.

ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంత నెమ్మదిస్తుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా హీరో దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌ను చేజిక్కించుకోవడానికి గ్యాంగ్ చేసే ప్రయత్నాల చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ట్రాక్ క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ బోయపాటి చిత్రాల మాదిరిగా మారుతుంది. “ఇంత అవసరమా” అనిపిస్తుంటుంది. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త తీసుకుని ఉంటే మరింత కన్విన్సింగ్ గా ఉండేది.

ఈ సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి తమన్ సంగీతం. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకుంటాయి. హీరో మాట్లాడలేని పాత్ర కావడంతో, సినిమాలోని ఎమోషన్స్‌ను, డ్రామాను ప్రేక్షకులకు అందించడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తాయి. ఇక కొత్త హీరోను పరిచయం చేస్తున్న సినిమా అయినప్పటికీ, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్‌గా ఉన్నాయి.

ముఖేష్ రిషి పోషించిన పెద్దన్న పాత్ర కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అలాగే హీరో తండ్రికి సంబంధించిన కథలోనూ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే బలం కనిపించదు. ఒక వ్యక్తి మరణానికి, హీరో గతానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇలాంటి లోపాల వల్ల సెకండాఫ్ ఎమోషన్లెస్ గా సాగుతుంది.

అనీష్ తన మొదటి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్‌ను ఎంచుకున్నాడు. అసలు మాట్లాడలేని పాత్రలో నటిస్తూ, కేవలం హావభావాలు, సైగలు, బాడీ లాంగ్వేజ్‌తోనే తన భావాలను వ్యక్తపరచడం అనేది అనుభవం ఉన్న నటులకు సైతం కష్టమైన విషయమే. అలాంటి పాత్రను ఎంచుకున్నందుకు అనీష్‌ను అభినందించాలి. డెబ్యూ హీరోగా బాగానే నటించాడు. డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ అయ్యాయి. కొంచెం నితిన్ ని గుర్తుచేసేలా ఉన్నాయి అనీష్ హావభావాలు.

అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆమెకు సంబంధించిన ఫస్టాఫ్ సీన్స్ సరదాగా సాగాయి.

వెన్నెల కిషోర్ బాగానే నవ్విస్తే, గెటప్ శ్రీనుని మాత్రం పూర్తిగా వాడుకోలేదనిపించింది.

ముఖేష్ రిషిని మొదట్లో పవర్‌ఫుల్ విలన్‌గా పరిచయం చేసినప్పటికీ, ఆ తర్వాత ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతుంది. తమిళ నటుడు కలైయరసన్ గ్యాంగ్ సభ్యుడిగా బాగానే నటించాడు. రోహన్ రాయ్‌కు పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎలాంగో కుమరవేల్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదనిపించాడు.

మొత్తంగా చెప్పాలంటే, ‘ఇట్లు అర్జున’ అనేది ఒక జంట అనుకోకుండా ఓ గ్యాంగ్‌కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యవహారంలో చిక్కుకోవడం చుట్టూ తిరిగే కథ. హీరోకే కాదు.. దర్శకుడు మహేష్ ఉప్పాలకి కూడా మంచి లాంచ్ ప్యాడ్. కథాంశం కొత్తదేమీ కాకపోయినా, అక్కడక్కడా ఆసక్తికరమైన సన్నివేశాలు, కామెడీ, చక్కటి రొమాంటిక్ ట్రాక్ సినిమాకు ప్లస్ అవుతాయి. కథనం కొన్ని చోట్ల నెమ్మదించడం, బలమైన ట్విస్టులు లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తుంది. కొత్త తరహా ఎంటర్‌టైనర్ ఆశించకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు. తీయడంలో కొన్ని లోపాలున్నా అనీష్‌ తెరంగేట్రానికి ఈ చిత్రం సరైన లాంచ్ ప్యాడ్ అనుకోవచ్చు.

బాటం లైన్: సరైన లాంచ్ ప్యాడ్

6 Replies to “మూవీ రివ్యూ: ఇట్లు అర్జున”

  1. పెన్ డ్రైవ్ కోసం పోలీస్ ఆఫీసర్, మరో వంక గూండాలు వెంట పడే సినిమా మిరాజ్ పేరు తో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఉంది. అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సంపత్ నటించారు.

Comments are closed.