
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గొప్పతనం ఏమంటే మంచి తెలుగు, వాక్యాలు రాయగలరు. ఏకపక్షంగానైనా సరే, వాదనని గట్టిగా వినిపించగలరు. ఆయన లా చదివి వుంటే బాబుకి ఇపుడు పనికొచ్చేవారు. కోట్లు ఫీజులు తీసుకుని కనీసం బెయిల్ కూడా ఇప్పించలేని లాయర్ల కంటే ఆర్కే మెరుగు. కనీసం ఫీజు డబ్బులైనా మిగిలేవి.
ప్రతివారం కొత్త పలుకులో చంద్రబాబు ధర్మ గుణాల గురించి, జగన్ దుర్మార్గాల గురించి రాస్తూ వుంటారు. ఈ రోజు కూడా బాబు ధర్మ ప్రభువని, జగన్ పాలెగాడని రాసారు. ప్రత్యర్థుల పార్టీలని బలహీనపరచడానికి బాబు ఏం చేసినా అది వ్యూహం, తెలివి, రాజకీయం. అదే పని జగన్ చేస్తే మోసం, దుర్మార్గం, వంచన, ఇంకా డిక్షనరీలో ఎన్ని పేర్లు వుంటే అవన్నీ.
ఆర్కే కి స్వామి భక్తి వుండడంలో తప్పే లేదు. ఎందుకంటే ఆయన ఎదుగుదలంతా బాబు చలవే. సాధారణ విలేకరి నుంచి పత్రికాధిపతి గా ఎదిగి చిన్న సైజ్ ఎంఫైర్ స్థాపించారంటే ప్రతి ఇటుక వెనుక బాబు పచ్చ జెండా వుంది. పత్రికా నిర్వహణలో నష్టాలు వస్తాయని నిరంతరం చెబుతూ జర్నలిస్ట్‌లకి అరకొర జీతాలు పెంచే ఆర్కే, జర్నలిజంలో కాకుండా ఏం వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించారో చెప్పడు. ఆయన అందర్నీ అడుగుతాడు. ఆయన్ని ఎవరూ ప్రశ్నించకూడదు.
జగన్ జర్నీ తీసుకుంటే, గతంలో జగన్‌పైన కేసులుమోపి జైలుకి పంపిన వ్యవహారంలో చంద్రబాబు హస్తం లేదా? 16 నెలలు జైలుపాలు చేసినపుడు చంద్రబాబులోని పాలెగాడి లక్షణం కనబడలేదా? ఇంతకాలం జైలు పక్షి, ఎ1 అని మీరంతా ఎద్దేవా చేయలేదా? మరి ఆ కేసులు ఇంకా కోర్టులో తేలనేలేదు.
జగన్ కేసులు పెండింగ్‌లో వుంటే ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్టు! రెండెకరాల చంద్రబాబు లక్ష కోట్లు సంపాయించి కోర్టు స్టేలు తెచ్చుకుని దొరక్కుండా తప్పించుకుంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కాదా? అక్రమాస్తులకి ఎవరూ అతీతులు కాదు. విలేకరికి వందల కోట్లు ఎలా వచ్చాయో, పచ్చళ్ల నుంచి వేలకోట్లు ఏ రకంగా పోగు పడ్డాయో వెలికి తీస్తే అందరూ జైలులో కూచుని దోమల్ని విసురుకోవాల్సిన వాళ్లే.
జగన్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలని కొని, పార్టీని అస్థిరం చేసి అడ్రస్ లేకుండా చేయాలని చూసినపుడు బాబులోని పాలెగాడు కొత్త పలుకుకి కనపడలేదు. జగన్ మొండితనంతో యుద్ధం చేయకపోతే లేనిపోనివన్నీ రాసి, జగన్‌ని రాజకీయాల్లో లేకుండా చేసేవాళ్లు కాదా? తనకి వునికే లేకుండా చేయడానికి ప్రయత్నించిన ప్రత్యర్థుల్ని జగన్ చూసీచూడనట్టు వదిలేస్తాడని ఎందుకు అనుకున్నారు! జగన్ జైలుకి వెళ్లడం ఆ రోజు మీకు న్యాయంగా కనిపిస్తే , మరి ఈ రోజు చంద్రబాబు జైలుకి వెళ్లడం కూడా న్యాయమే కదా. ఈ కేసుని రాజకీయ కక్ష అని శోకాలు పెడుతున్నవాళ్లు, ఆ కేసులో మాత్రం జగన్‌ని జైలు పక్షి అని ఎందుకు ఎగతాళి చేసారు!
రేపు చంద్రబాబుకి బెయిల్ రావచ్చు. అయితే ఇక మీదట చంద్రబాబు తన జీవితంలో తాను నిప్పు అని, తనకెవరూ పీకలేరని అనలేడు. పీకేవాడు వచ్చాడు. పీకాడు.
జైలు జీవితం, దోమల బాధ గురించి బాబు మంచి పుస్తకం రాస్తే జనం చదివి ఆనందిస్తారు. ఆర్కే కి ఇంకా అర్థం కాని విషయం ఏమంటే ఇవన్నీ యాడ్స్, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. ఆట మొదలెట్టక ముందే తొండి అని అరిస్తే ఎట్లా?
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా