సీఎం రమేష్ తో బూడి ఢీ!

ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది. సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రాలో గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న…

ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది. సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రాలో గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న అనకాపల్లి నుంచి గెలిచి లోక్ సభలో తొలిసారి అడుగు పెట్టాలని సీఎం రమేష్ ఉవ్విళ్ళూరుతున్నారు.

ఆయనకు అనకాపల్లి సీటు బీజేపీ ఇచ్చినా ఆయన రాజకీయ నేపధ్యం పూర్వాశ్రమం బట్టి టీడీపీ మనిషిగానే చూస్తారు. అనకాపల్లిలో టీడీపీకే బలం ఉంది. బీజేపీ టికెట్ మీద ఆయన పోటీ అన్నది టెక్నినల్ గా అనుకున్నా ఆయనకు బలం ఇవ్వాల్సింది ఇచ్చేది కూడా బీజేపీనే.

సీఎం రమేష్ తన అభ్యర్ధిత్వం ఖరారు అయిన తరువాత మాట్లాడుతూ పార్టీలో జూనియర్ సీనియర్ అన్న తేడా లేదని అన్నారు. అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయాల్సిందే అని చెప్పారు. తన మీద పోటీకి వైసీపీ అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేదు అన్నట్లుగా మాట్లాడారు

అయితే సరైన అభ్యర్ధినే వైసీపీ రెడీ చేసింది. ఆయన ఎవరో కాదు ఉప ముఖ్యమంత్రి అపజయం ఏనాడూ ఎరగని మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు. రమేష్ ని ఓడించే పక్కా లోకల్ లీడర్ అని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం నేత అయినా ఆయన పద్మనాయక శాఖకు చెందిన వారు అని అంటున్నారు.

ఆ శాఖ వారు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో పదుల సంఖ్యలోనే ఉన్నారు తప్ప బలం పెద్దగా లేదని అంటున్నారు. అదే బూడి ముత్యాలనాయుడు సామాజిక వర్గం చూస్తే ఆయన కొప్పుల వెలమకు చెందిన వారు. అనకాపల్లి పరిధిలో కొప్పుల వెలమకు చెందిన వారే నూటికి తొంబై శాతం ఉన్నారు. అందుకే వైసీపీ ఆచీ తూచీ బూడిని ఎంపిక చేసింది అని అంటున్నారు.

బూడిని అనకాపల్లి ఎంపీగా ప్రకటించి ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ ఈర్ల అనూరాధను మాడుగుల ఎమ్మెల్యేగా నిలబెడుతోంది. ఇలా ఒకేసారి మాడుగుల అనకాపల్లి ఎంపీ సీట్లలో అభ్యర్ధులను ప్రకటిస్తూ వైసీపీ సంచలనం రేకెత్తించింది.

అనకాపల్లి ప్రజలు లోకల్ కార్డుకే ఓటేస్తారు అని గత చరిత్ర నిరూపించింది కాబట్టి ఈసారి తమదే విజయం అని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం రమేష్ బూడి ల మధ్య రసవత్తరమైన పోరు సాగనుంది అని అంటున్నారు.