తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!

ఒక వ్యక్తి లేదా నాయకుడు అవినీతి అక్రమార్జనల కేసులలో జైలులో ఉండడం అనేది పూర్తిగా కేంద్రంలో పరిపాలన సాగించే పార్టీ చేతుల్లో ఉంటుందా? భారత రాష్ట్ర సమితి పార్టీకి తాటాకులు అంటగట్టడానికి కాంగ్రెస్ అలాంటి…

ఒక వ్యక్తి లేదా నాయకుడు అవినీతి అక్రమార్జనల కేసులలో జైలులో ఉండడం అనేది పూర్తిగా కేంద్రంలో పరిపాలన సాగించే పార్టీ చేతుల్లో ఉంటుందా? భారత రాష్ట్ర సమితి పార్టీకి తాటాకులు అంటగట్టడానికి కాంగ్రెస్ అలాంటి విమర్శలు చేస్తే చేయవచ్చుగాక.. కానీ ఆ విమర్శలు నిజమని చెప్పేలా కేటీఆర్ మాటలు కూడా ఉంటున్నాయి.

మేము బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమే అయితే గనుక, మా ఆడబిడ్డ 150 రోజులుగా జైల్లో ఉంటుందా అని కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కావడం లేదు. రేపోమాపో కల్వకుంట్ల కవిత బెయిలు మీద జైలు నుంచి బయటకు వచ్చినా, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిర్దోషిగా తేలినా.. అప్పుడు భారత రాష్ట్ర సమితి బిజెపితో చాటుమాటు ఒప్పందం కుదుర్చుకున్నది కనుక మాత్రమే ఆమెకు విముక్తి లభించింది అని భావించాలా? కేటీఆర్ తన మాటల ద్వారా ఆ సంకేతాలు ఇస్తున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

తెలంగాణలో రాజకీయ మొత్తం విలీనం అనే పదం చుట్టూతా నడుస్తోంది. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం అయిపోయి కేసుల నుంచి రక్షణ పొందుతారని ఒకవేపు కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. వారు కాంగ్రెస్ లోనే విలీనం అవుతారని, కేసీఆర్ కు ఏఐసిసి పదవి, కేటీఆర్ కు పీసీసీ సారథ్యం, కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సభ్యత్వం పొందుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేస్తున్నారు.

బీఆర్ఎస్ బలం తగ్గుతున్న కొద్దీ.. ఆ పార్టీ విలీనం అనేది ఒక కామెడీ వ్యవహారం లాగా ఇతర పార్టీల నాయకులు తెలంగాణలో చూస్తున్నారు. ఇలాంటి సమయాలలో నాయకులు మరింత ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది.

సాధారణంగా అయితే చాలా తూకం తో మాట్లాడే నాయకుడు కేటీఆర్.. ఇప్పుడు నోరు జారుతున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. బిజెపితో సంబంధాలు ఉంటే జైల్లో ఎందుకు ఉంటాం.. అని ప్రస్తావించడం కరెక్ట్ కాదు. తమ మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని మాటల వరకు మాత్రమే గులాబీ నాయకుల పరిమితమైతే వారి పార్టీని వారు సమర్ధించుకున్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా విలీనం లేదు అని.. ఉంటే ఇలా ఉండేదా అని మాట్లాడుతూ పోయే కొద్ది.. కొత్త అనుమానాలకు ఆస్కారం ఇవ్వడమే అవుతుంది.

7 Replies to “తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!”

Comments are closed.