కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత… పదవులు రాలేదనే బాధ కొందరైతే, కోరుకున్నది దక్కలేదని మరికొంత మంది ఆవేదన చెందుతున్నారు. చివరికి పదవి దక్కినా బాధ్యతలు చేపట్టని టీడీపీ సీనియర్ నేత ఆవేదన వర్ణనాతీతం. తిరుపతి టీడీపీలో నరసింహయాదవ్ సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
పసుపు చొక్కా తప్ప, మరే ఇతర రంగు ధరించనంత నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన్ను పొగిడేవాళ్లున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు. నరసింహయాదవ్ విధేయతకు మెచ్చిన సీఎం చంద్రబాబునాయుడు… ఆయనకు యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇంత వరకూ ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.
పైగా తనను ఒక కుల నాయకుడిగా జమ కట్టడంపై ఆయన ఆవేదన కూడా చెందుతున్నారట! తిరుపతిలో బలిజల తర్వాత యాదవుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. నరసింహయాదవ్‌కు టీడీపీపై విధేయత తప్ప, ఆయనకు 100 ఓట్లు కూడా లేవని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అంటున్నారు. పదవులు రాకపోవడంతో చాలా మంది ఆవేదనతో వుంటే, ప్రజాబలం లేని నరసింహయాదవ్ మాత్రం గొంతెమ్మ కోర్కెలు కోరితే, తీర్చేదెవరిని టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు నరసింహయాదవ్‌ను తుడా చైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రాధాన్యం లభిస్తుందని ఆయన ఆశపడ్డారు. అయితే టీడీపీలో నిర్ణయాలు తీసుకునే నాయకత్వంలో మార్పు వచ్చిందని ఆయన గ్రహించినట్టు లేరు. ఇచ్చిన పదవితో సర్దుకుంటే సరే, లేదంటే ఎవరిష్టం వాళ్లది అని టీడీపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు.