స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్ష సభ్యులు నామినేషన్లు వేయడమే అతిపెద్ద విజయంగా సంబరాలు చేసుకునే పరిస్థితి.
గెలుపోటముల గురించి ఎవరికీ ఆలోచన లేదు. అధికారం ఉన్నవాళ్లదే గెలుపు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తీరు సాగుతోంది. అంతా ప్రహసనంగా ఎన్నికల ప్రక్రియ సాగుతోంది.
ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలోనూ వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ కార్యకర్తలు, నాయకులు యథేచ్ఛగా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు సాగుతున్నాయి. పోలీసులే దగ్గరుండి టీడీపీ రౌడీలకు తమను అప్పగించి , దాడులు చేయిస్తున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు.
ఈ క్రమంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ నుంచి నామినేషన్ల దాఖలు అనుమానంగా వుంది. అయితే అడ్డంకులను అధిగమించి తన సొంత మండల పరిషత్ స్థానానికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి నామినేషన్ వేయించడం విశేషం.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం 64 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ నియోజక వర్గంలోని ఏర్పేడు మండలం మన్నసముద్రం తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వస్థలం. బండారుపల్లె ఎంపీటీసీ పరిధిలో ఎంపీ స్వగ్రామం వుంటుంది. బండారుపల్లె ఎంపీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు.
ఇక్కడి నుంచి తిరుపతి జనార్దన్ అనే వైసీపీ నాయకుడితో తిరుపతి ఎంపీ ఇవాళ నామినేషన్ వేయించడం విశేషం.
వైసీపీ తరపున శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలకు ఇదే మొదటి నామినేషన్ కావడం విశేషం. ఇంకా తన సొంత మండలంతో పాటు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది.

ఈ విధమైన గతి పట్టింది, ఏపీలో ప్రజాస్వామ్యానికి. ఎవరైనా చావు దగ్గరకొస్తుందని అనిపిస్తే కొన్నైనా మంచి పనులు చేస్తారు, కానీ ఏపీలో వేరే విధంగా ఉంది.