టూరిజం: ఉన్నవి అభివృద్ధి చేసే ఆలోచన ఉందా!?

చంద్రబాబు నాయుడు దార్శనికుడైన నాయకుడు గనుక.. భవిష్యత్ భారత ముఖచిత్రం ఎలా ఉంటుందో తన జోస్యం చాలా స్పష్టంగా చెబుతున్నారు. భవిష్యత్తులో దేశంలో వేరే ఏ ఇజాలూ ఉండవని.. టూరిజం ఒక్కటే మిగులుతుందని ఆయన…

చంద్రబాబు నాయుడు దార్శనికుడైన నాయకుడు గనుక.. భవిష్యత్ భారత ముఖచిత్రం ఎలా ఉంటుందో తన జోస్యం చాలా స్పష్టంగా చెబుతున్నారు. భవిష్యత్తులో దేశంలో వేరే ఏ ఇజాలూ ఉండవని.. టూరిజం ఒక్కటే మిగులుతుందని ఆయన అంటున్నారు. ప్రభుత్వాలు ప్రజలను ఉత్పాదకత వైపు కాకుండా వినోదం వైపు డైవర్ట్ చేస్తున్నప్పుడు.. ఆయన చెప్పింది నిజమే! అలాగే జరుగుతుంది.

ప్రజలు ఉత్పాదకత గురించి ఆలోచించడం మొదలు పెడితే.. ప్రభుత్వం పనితీరు గురించి ఆలోచిస్తారు. పరిపాలనలో ఉన్న లోపాలు వారికి కనిపిస్తాయి. అలా కాకుండా.. ప్రజలుం కేవలం వినోదం, సరదాల గురించి మాత్రమే ఆలోచించేలా దృష్టి మళ్లిస్తే పాలకులకు వేరే ఇబ్బంది ఉండదు. వారు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ మనుగడ సాగించగలరు.

చంద్రబాబు చెప్పినట్టు టూరిజం తప్ప మరేమీ భవిష్యత్తులో మిగలదు అనే అనుకుందాం. కనీసం టూరిజం పరంగా అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గొప్ప ప్రదేశాలను హైలైట్ చేసి వాటిని అభివృద్ధి చేయడం గురించి ఆయన ఎన్నడైనా ఆలోచన చేశారా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

లేపాక్షి అంతర్జాతీయంగా ఎంత ప్రసిద్ధి చెందిన క్షేత్రమో అందరికీ తెలుసు. హైవే మీద నుంచి లేపాక్షి చేరుకోవడానికి మొన్న మొన్నటిదాకా (గత చంద్రబాబు పాలన కాలంలో) చాలా అధ్వాన్నమైన రోడ్డు ఉండేది. చాలా ఘోరమైన రోడ్డు. అంతర్జాతీయంగా అంతప్రసిద్ధమైన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న క్షేత్రానికి సరైన అప్రోచ్ లేకుండా అప్పటికి చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు పరిపాలన సాగించారనేది బాధపడాల్సిన విషయం.

అలాంటిదే అనంతపురం జిల్లాలోనే తిమ్మమ్మ మర్రిమాను కూడా. ఈ మర్రిమానుకు ఒక ఆధ్యాత్మిక స్థానిక చరిత్ర కూడా ఉంది. ఆ సంగతి పక్కన పెట్టినా ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతి ఎక్కువ విస్తీర్ణంలోకి విస్తరించిన మర్రిమానుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఉంటుంది. అటువంటి తిమ్మమ్మ మర్రిమాను ఎక్కడ ఉన్నదో తెలియజెప్పే డైరెక్షన్ బోర్డులు కూడా ఉండవు. ఆ ప్రాంతం బాగా తెలిసిన వారు వెళ్లగలరు. కొత్తవారు దానిని చూడాలని వెళ్లదలచుకుంటే.. కనీసం దారి కనుక్కోవడానికి నానా పాట్లు పడాలి. సింగిల్ రోడ్లు మాత్రమే ఉంటాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్రంలో పర్యాటక శోభగా నిలిచే అనేక ప్రాజెక్టులు అధ్వానస్థితిలో ఉంటాయి. కడప జిల్లాలో ఉన్న అత్యద్భుతమైన గండికోటకు ఒకసారి వెళ్లిన వారు.. అక్కడ రోడ్లు సరికాలేక పడే యాతనకు.. రెండోసారి వెళ్లాలంటే బెంబేలెత్తుతారు. బెలూం గుహలకు సరైన ప్రచారమూ లేదు. ఇదే పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలో అయితే.. ఎక్కడో ఒక చిన్న ప్రాజెక్టు లేదా పెద్ద కల్వర్టు ఉన్నా కూడా.. అదొక పెద్ద పర్యాటక ప్రాంతంలాగా.. ఓ వంద కిలోమీటర్ల ఆవలినుంచి డైరెక్షన్ బోర్డులు అక్కడకు వెళ్లమని మనల్ని రెచ్చగొడుతుంటాయి. ఏపీలో పర్యాటక ప్రాంతాలకు అలాంటి గౌరవం లేదు.

చంద్రబాబునాయుడు టూరిజందే భవిష్యత్తు అని పడికట్టు పదాలు వాడుతున్నారు. సీప్లేన్, విశాఖలో కేసినోలు, షిప్ లో కేసినోలు నడపడం లాంటివి మాత్రమే ఆయన టూరిజం ఆలోచనలు అయితే రాష్ట్రాన్ని మరింత దిగజారుడు వైపు తీసుకువెళుతున్నట్టు. అలాకాకుండా.. రాష్ట్రానికి సహజమైన పర్యాటక ప్రాంతాలను శోభాయమానంగా, ఆదరణ పెరిగేలా, పర్యటకులు పెరిగేలా తీర్చిదిద్దడం గురించి చంద్రబాబు ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

5 Replies to “టూరిజం: ఉన్నవి అభివృద్ధి చేసే ఆలోచన ఉందా!?”

  1. “లేపాక్షి అంతర్జాతీయంగా ఎంత ప్రసిద్ధి చెందిన క్షేత్రమో అందరికీ తెలుసు”..

    thank you..like how lepakshi was developed by allocating lands to che ddis…

    wah wah

  2. మన అన్నయ్య vizag లో పెట్టిన floating bridge లాగా….అంతేనా visionary కడుపు మంట GA….😂😂

Comments are closed.