ఆ తాజా మాజీ- కూటమికి సిగ్నల్స్ ఇస్తున్నారా?

వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంటున్నదని సమాచారం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయ‌న‌ నాయకత్వం మీద విశ్వాసంతో కాకుండా.. తమ తమ స్వప్రయోజనాలు, స్వార్థం కోసం వచ్చి వైసీపీలో చేరిన వారు ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత క్రమంగా ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. ప్రజలు తమ గురించి చులకనగా అనుకోకుండా.. పార్టీ మీదనే ఏదో ఒక రీతిలో బురద చల్లేసి వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న వాసుపల్లి గణేశ్ తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ గమనిస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

ఇంటర్వ్యూలో వైసీపీ నేతల గురించి ఆయన చేసిన విమర్శలను గమనిస్తే.. తనను చేర్చుకోవాల్సిందిగా కూటమి పార్టీలకు సిగ్నల్స్ పంపుతున్నారేమో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. వాసుపల్లి గణేశ్ చానెల్ తో మాట్లాడుతూ.. ‘వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నాయకుల నోటి దురుసుతనం వల్లనే పార్టీ ఓడిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు.

ఒకవైపు వల్లభనేని అరెస్టు తర్వాత.. జైల్లో ఆయనను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి- ‘తన సామాజికవర్గంలో మరొక నేత రాజకీయంగా ఎదగడం చూసి ఓర్వలేకనే చంద్రబాబు తప్పుడు కేసులతో అరెస్టు చేయించాడని’ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో.. ‘వల్లభనేని వంశీ లీడర్ అని నేను అనుకోను. వంశీ, కొడాలి నానిల వయసేంటి? వారు మాట్లాడిన మాటలేంటి? అసభ్యంగా మాట్లాడిన వీరంతా పార్టీని నాశనం చేశారు. ఇలాంటి వారంతా పార్టీనుంచి వెళ్లిపోవాలి’ అంటూ వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యానించడం చర్చీనీయాంశమే. ఇలాంటి మాటల ద్వారా ఆయన కూటమి నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

పార్టీని వీడి వెళ్లిపోయే ముందు.. ఏదో ఒక సాకు చూపించి బురద చల్లడం అనేది అందరూ చేసే పనే. విశాఖపట్నానికే చెందిన మరొక వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాస్ కూడా అదే పని చేశారు. వాసుపల్లి గణేశ్ ఈ వ్యాఖ్యలతో ఆగడం లేదు. అప్పట్లో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయసాయిరెడ్డి పార్టీకి పెద్ద మైనస్ అంటున్నారు. ఆయన రాజకీయాలను రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు. ఈ మాటలే కాకుండా.. ‘విశాఖలో యాభయ్యేళ్లుగా వివాదాల్లో ఉన్న భూముల్లో రాజకీయ జోక్యమేంటి? నాయకులుఅది అవసరమా? వివాదాల్లోకి ఎందుకు వెళ్లారు? పైగా రుషికొండ భవనాలు కట్టాల్సిన అవసరం ఏముంది?’ అంటూ ప్రశ్నించడం.. స్ట్రెయిట్ గా జగన్మోహన్ రెడ్డిని, ఆయన నిర్ణయాలను తప్పుపడుతున్నట్టుగానే ఉంది.

అయితే వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంటున్నదని సమాచారం. ఆయన కూడా.. కనీసం ఇలా జగన్ మీద బురద చల్లినందుకైనా కూటమి పార్టీలు తనను చేర్చుకుంటాయేమోనని ఆశిస్తుంటారని ప్రజలు అంటున్నారు.

4 Replies to “ఆ తాజా మాజీ- కూటమికి సిగ్నల్స్ ఇస్తున్నారా?”

  1. నోటి దూలతో జగన్ ని ప్రసన్నం చేసుకునే పనిలో నానీ, వంశీ తమ ఉనికే కోల్పోయారు.. యద్భావం తద్భవతి అనేది వైసిపి కి బాగా తెలుసు

Comments are closed.