బ‌తికేందుకు అనువైన స‌మాజమా ఇది?

జీవ‌నం, జీవితం వేర్వేరు. జీవ‌నం అంటే బ‌త‌క‌డం. జీవితం అంటే న‌చ్చిన విధంగా , స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల‌తో మ‌నుగ‌డ సాగించ‌డం.

జీవ‌నం, జీవితం వేర్వేరు. జీవ‌నం అంటే బ‌త‌క‌డం. జీవితం అంటే న‌చ్చిన విధంగా , స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల‌తో మ‌నుగ‌డ సాగించ‌డం.

ప్ర‌స్తుతం మ‌నం వుంటున్న స‌మాజం .. బ‌తికేందుకు అనువైన‌దా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. హింస‌, స్వేచ్ఛ లేక‌పోవ‌డం, వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం… ఇవ‌న్నీ చూస్తే, ఇక్క‌డ ప‌లుకుబ‌డి లేని వ్య‌క్తులు మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న ఎవ‌రిలోనైనా క‌లుగుతుంది.

మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఏడున్న‌ర ద‌శాబ్దాలు దాటింది. దేశ మొద‌టి ప్ర‌ధానిగా జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ అద్భుతంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

దేశం నెహ్రూ చేతుల్లో కాకుండా, మరెవ‌రి చేతుల్లోనూ ప‌డి వుంటే, ఎలా వుండేదో ఊహించ‌డానికే భ‌యం క‌లిగేది. ఇవాళ ఆయ‌న జ‌యంతి. నెహ్రూకు పిల్ల‌లంటే ఎంతో ఇష్టం. అందుకే నెహ్రూ జ‌యంతిని పిల్లల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నాం.

పిల్ల‌ల్ని తోట‌ల్లోని పువ్వుల్లా నెహ్రూ భావించారు. అంత సుకుమారంగా పిల్ల‌ల్ని ఆయ‌న చూశారు. పువ్వుల్ని చూసుకున్న‌ట్టు, పిల్ల‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాలనేది నెహ్రూ త‌త్వం. త‌న ఏకైక కుమార్తె ఇందిర‌ను నెహ్రూ పెంచిన తీరే, ఆయ‌న‌కు పిల్ల‌లంటే ఎంత ప్రేమాభిమానాలో అర్థం చేసుకోవ‌చ్చు.

జైలు నుంచే త‌న కుమార్తెకు సామాజిక‌, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌పై లేఖ‌లు రాశారు. కుమార్తెను ఉన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నించారు. ఉక్కు మ‌హిళగా ఇందిర పెర‌గ‌డం వెనుక నెహ్రూ పెంప‌కమే కార‌ణం.

ప్రేమ‌తోనే పిల్ల‌ల్ని సంస్క‌రించే ఏకైక మార్గంగా ఆయ‌న న‌మ్మారు. పిల్ల‌ల‌తో స్నేహంగా, ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంచి పౌరులుగా తీర్చిదిద్ద‌లేమ‌ని ఆయ‌న చెప్పేవారు. అందుకే నేటి బాల‌లే రేప‌టి పౌరుల‌ని ఆయ‌న ప‌దేప‌దే అనేవారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ద‌శాబ్దాల స్వ‌తంత్ర భార‌తావ‌ని …సాంకేతికంగా దూసుకెళుతోంది. మ‌రోవైపు రాజ‌కీయంగా, నైతికంగా ముందుకా? వెన‌క్కా? అనేది ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ దేశంలోని ప‌రిస్థితులు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

స‌హ‌జంగా ప్ర‌భుత్వాల్ని ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. కానీ ఓట‌ర్లుగా ఎవ‌రుండాలో, ఉండ‌కూడ‌దో మోదీ ప్ర‌భుత్వ‌మే డిసైడ్ చేస్తోంద‌న్న విమ‌ర్శ‌ని సులువుగా కొట్టి పారేయ‌డానికి వీల్లేదు.

స‌ర్ ప్ర‌క్రియ‌తో దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఒక ప్ర‌హ‌స‌నంగా మారుతోంది. అధికారాన్ని శాశ్వ‌తం చేసుకోడానికి కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల సంఘాన్నే త‌మ గుప్పిట్లో పాల‌కులు పెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకు బ‌లం క‌లిగించే ఉదంతాలు ఎన్నో.

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ మొద‌లు, దేశంలో మోదీ స‌ర్కార్ వ‌ర‌కూ ప్ర‌శ్నిస్తే చాలు కేసుల‌తో వేధింపులు. అర్బ‌న్ న‌క్స‌లైట్లంటూ నింద‌లు.

ప్ర‌జ‌ల మాన‌ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని పాల‌కులు స‌ర్వ‌భ్ర‌ష్టత్వం ప‌ట్టించారు. ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేయ‌డానికి వీల్లేదంటూ పోలీసులే ఏకే 47 తుపాకుల‌తో అభ్య‌ర్థుల‌కు ఎక్కుపెట్టిన వైనాన్ని క‌ళ్ళారా చూశాం. ఓట్లు వేయ‌డానికి వీల్లేద‌ని అంటున్నారు.

బ‌హుశా ఇలాంటి దుస్థితి దేశానికి వ‌స్తుంద‌ని స్వాతంత్ర్య పోరాట స‌మ‌యంలో మ‌న యోధులు క‌ల‌లో కూడా ఊహించి వుండ‌రు. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించుకోడానికి వేలాది మంది ప్రాణ‌, మాన త్యాగాలు చేశారు. దేశం తెల్ల‌వారి చేతుల్లో నుంచి మ‌న చేతుల్లోకి వ‌చ్చింది. దేశాన్ని చ‌క్క‌గా నిర్మించుకోడానికి బ‌దులు, వ్య‌వ‌స్థ‌ల్ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని లేకుండా చేసే అస్త్రాలుగా వాడుతున్నారు.

ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ దిగ‌జారుతున్న శాంతిభ‌ద్ర‌త‌లు, ప్ర‌జాస్వామ్య హ‌క్కుల్ని కాల‌రాసే ప‌రిస్థితుల్ని గ‌మ‌నిస్తే, భ‌విష్య‌త్ త‌రాలు రానున్న కాలంలో బ‌తికే ప‌రిస్థితులున్నాయా? అనే అనుమానం క‌లుగుతోంది.

అస‌లు మ‌నం ఎటు వైపు ప‌య‌నిస్తున్నామో అర్థంకాని అయోమ‌య ప‌రిస్థితుల్లో బ‌తుకీడిస్తున్నాం. ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజంలో పిల్ల‌లు బాగుంటారు. స‌మాజానికే జ‌బ్బు చేస్తే, అందులో జీవించే ప్ర‌తి ప్రాణికి ముప్పే.

న‌వ స‌మాజం గురించి క‌ల‌లుక‌న్న నెహ్రూ జ‌యంతినాడు …భావిత‌రాల భ‌విష్య‌త్‌పై ప్ర‌తి ఒక్క‌రూ సీరియ‌స్‌గా ఆలోచించాలి. ప్ర‌తి ఒక్క‌రూ బ‌తికే ప‌రిస్థితుల్ని తీసుకురావాలి. అప్పుడే ఆ మ‌హ‌నీయుడికి నిజ‌మైన నివాళి.

9 Replies to “బ‌తికేందుకు అనువైన స‌మాజమా ఇది?”

  1. అవునా సార్. దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ గారు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఐక్య రాజ్య సమితి లో శాశ్వత సభ్యత్వం ఉండేది.pok మన దగ్గరే ఉండేది.aksaichin చైనా గుప్పెట్లో కాకుండా భారత్ లోనే ఉండేది.1964 చైనా యుద్ధంలో భారత్ గెలిచేది. కశ్మీర్ సమస్య ఉండేది కాదు.ఎమర్జెన్సీ వచ్చేది కాదు.

  2. అన్న హయంలో వెల్లివిరిసిన మానవత్వం, సామాజిక సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్ర్యం గురించి తలుచుకుంటే ఏడుపు వస్తోంది. 

  3. క్షమించాలి. మొదటి paragraph తరువాత ఇంక చదవలేదు.

    మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నదానికి మొత్తం 15 మంది ఓట్ చేశారు. అందులో పటేల్ కి 12 వచ్చాయి. నెహ్రూ కి 0 వచ్చాయ్. ఈయన కి విదేశాల్లో వున్న ప్రేమ వ్యవహారం, గాంధీ మద్దత్తు తో పటేల్ ని కాదని, PM  అయ్యాడు.

    ఈయన కాకపోతే అన్న భయం లేదు. కచ్చితంగా యింకా బానే వుండే వాళ్ళం 

Comments are closed.