ఆళ్ల‌గ‌డ్డ కూట‌మిలో జెడ్పీటీసీ అభ్య‌ర్థి చిచ్చు!

రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీకు రెబ‌ల్స్ గొడ‌వ త‌ప్ప‌డం లేదు. ఈ విష‌యంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో మ‌రికాస్త ఎక్కువ‌గా వుంది.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో జెడ్పీటీసీ అభ్య‌ర్థిత్వం కూట‌మిలో చిచ్చు రేపింది. ఆళ్ల‌గ‌డ్డ జెడ్పీటీసీ స్థానం ఓసీ జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వ్ అయ్యింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎక్క‌డిక‌క్క‌డ కూట‌మి నేత‌లు స‌ర్దుబాటు చేసుకోవాల‌ని కూట‌మి అగ్ర‌నేత‌లు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఆ తర్వాత సీఎం చంద్ర‌బాబు, డెప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్ మాధ‌వ్ మీడియా ముందుకొచ్చి, తాము బీ ఫామ్‌లు ఇచ్చిన వాళ్లు త‌ప్ప‌, మిగిన వారంతా విత్ డ్రా చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ ఆదేశాల్ని లెక్క చేయ‌కుండా బ‌రిలో నిలిస్తే వేటు వేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఇవ‌న్నీ కేవ‌లం మీడియా క‌థ‌నాల కోసం త‌ప్ప‌, మ‌రెందుకూ ప‌నికి రావ‌ని క్షేత్ర‌స్థాయిలో కూట‌మి నేత‌లు నిరూపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీకు రెబ‌ల్స్ గొడ‌వ త‌ప్ప‌డం లేదు. ఈ విష‌యంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో మ‌రికాస్త ఎక్కువ‌గా వుంది.

టీడీపీ త‌ర‌పున పోరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డిని బ‌రిలో నిలిపారు. మ‌రోవైపు జ‌న‌సేన నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి సోద‌రుడు సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి పోటీలో ఉన్నారు.

త‌మ నాయ‌కుడి బీ ఫామ్‌ను క్యాన్స‌ల్ చేస్తున్న‌ట్టు నంద్యాల జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. అధికారికంగా జ‌న‌సేన అభ్య‌ర్థి బ‌రిలో వున్న‌ట్టు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.

టీడీపీ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఆళ్ల‌గ‌డ్డ జ‌న‌సేన నాయ‌కులు ఫిర్యాదు చేశారు. పోరెడ్డి స్థానికుడు కాద‌ని, నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ నివాసి అని ప‌వ‌న్‌కు తెలియ‌జేశారు.

అన్నిటికీ మించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి, పెద్ద మొత్తాల్లో వ‌సూళ్లు చేసిన‌ట్టు బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల‌లో టీడీపీ అభ్య‌ర్థిపై కేసులున్నాయ‌ని ప‌వ‌న్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ ముఖ్య నాయ‌కులు టీడీపీ అభ్య‌ర్థి నుంచి డ‌బ్బు తీసుకుని, స్థానికేత‌రుడు, కేసులున్నా టికెట్ ఇచ్చార‌ని ప‌వ‌న్‌కు జ‌న‌సేన నాయ‌కులు వివరించారు.

అరెస్ట్‌కు భ‌య‌ప‌డి ఇంత‌కాలం పోరెడ్డి త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని, ఏ క్ష‌ణాన్నైనా అరెస్ట్ చేయొచ్చ‌ని జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వ్య‌క్తిని గెలిపించాల్సిన అవ‌స‌రం లేద‌ని, తాము బ‌రిలో వుంటామ‌ని జ‌న‌సేన నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.

దీంతో ఆళ్ల‌గ‌డ్డ జెడ్పీటీసీ అభ్య‌ర్థిపై ప‌వ‌న్ సీరియ‌స్‌గా చ‌ర్చిస్తున్నార‌ని స‌మాచారం. జ‌న‌సేన మాత్రం త‌ప్పుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు జ‌న‌సేన పోటీలో వుండ‌డంపై ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అఖిల‌ప్రియ మండిప‌డుతున్నారు. ఇది కూట‌మి స్ఫూర్తికి విఘాతం కాదా? అని ఆమె నిల‌దీస్తున్నారు.