మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఎమోషనల్ లీడర్. తీవ్ర పదజాలంతో మాట్లాడ్డం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం ఆమెకు అలవాటుగా మారింది.
గతంలో కేటీఆర్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలకు, నేడు చింతిస్తూ ఆమె ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలకు చింతిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
గతంలో తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారని కొండా సురేఖ తీవ్ర ఆవేదన, ఆగ్రహానికి గురయ్యారు.
దీనంతటికీ కేటీఆరే కారణమని ఆమె భావంచారు. దీంతో కేటీఆర్‌పై నోరు జారారు. అక్కినేని నాగచైతన్య , సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే డ్రగ్స్, రేవ్ పార్టీలు నిర్వహించే వారని, సినీ నటీమణుల్ని డ్రగ్స్‌కు కేటీఆర్ బానిసలుగా చేశారని ఆమె విరుచుకుపడ్డారు.
వివాదంలోకి రకుల్ ప్రీత్‌సింగ్‌ను కూడా కొండా సురేఖ లాగారు. సినీ నటుల్ని బ్లాక్‌మెయిల్ చేసి, కేటీఆర్ పాడు పనులు చేసేవాడని ఆమె ఆరోపించారు. సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ ఫైర్ అయ్యింది.
కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ నాంపల్లి కోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అక్కినేని నాగార్జున కూడా పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సివిల్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా నాటి తన అనుచిత వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నట్టు సురేఖ పేర్కొన్నారు.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని ఆమె పేర్కొన్నారు. నిరాధార వ్యాఖ్యలు చేయకుండా వుండాల్సిందని ఆమె తెలిపారు.
కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేవని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ తెలిపారు.
కొండా సురేఖ తాజా పశ్చాత్తాపం వెనుక రాజకీయ కోణః ఏదైనా వుందా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, రేవంత్‌రెడ్డి కేబినెట్ నుంచి ఆమె బర్తరఫ్‌నకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలిసిందే.
రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ వైపు వెళ్లాలంటే, కేటీఆర్‌పై దారుణ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సి వుంటుంది. ఇందుకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఏదైనా చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
రాజకీయంగా ఆమె మనసులో మార్పునకు, తాజా ట్వీట్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చా? అనే కోణంలో తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు.
