Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

నాలుగు దశాబ్దాల కోరికను విశాఖ ఓటర్లు తీర్చనున్నారా?

నాలుగు దశాబ్దాల కోరికను విశాఖ ఓటర్లు తీర్చనున్నారా?

విశాఖ వాసులు ఈసారి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. విశాఖ అంటే వలస నేతలకు అడ్డాగా మారిపోయింది. విశాఖ ఎంపీలుగా నెగ్గిన వారు అంతా ఇతర జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం. పార్టీలు వేరు అయినా విశాఖ ఎంపీ అనేసరికి వలస నేతలే ముందుకు వస్తున్నారు.

విశాఖ ఎంపీ సీటు నుంచి 1984లో స్థానికుడైన రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి ఎంపీగా గెలిచారు. అది తరువాత విశాఖ నుంచి ఎంపీలు అయిన వారు అంతా నాన్ లోకల్స్ గానే ఉన్నారు. అందులో ఒక సామాజిక వర్గానికే చెందిన వారు ఈ మొత్తం నలభై ఏళ్ల విశాఖ పార్లమెంటరీ రాజకీయంలో పాతికేళ్ళకు పైగా గెలుస్తూ వచ్చారు. అంతలా విశాఖ ఎంపీ పరాయిది  అయిపోయింది.

విశాఖ సమస్యలను ఇక్కడ నుంచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన నాన్ లోకల్స్ ఎక్కడా ప్రస్తావించడం లేదు. విశాఖ వాసుల ఓట్లతో గెలిచినా రైల్వే జోన్ విశాఖకు మెట్రో రైల్ అలాగే విశాఖ రాజధాని వంటి విషయాలలో వారు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న బాధ అయితే ప్రజలలో ఉంది.

విశాఖ ఎంపీలుగా లంకా సుందరం,  తెన్నేటి విశ్వనాధం, ద్రోణం రాజు సత్యనారాయణ వంటి వారు పనిచేసి స్థానికంగా ఎంతో మేలు చేశారు అని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈసారి ఒక అవకాశం వచ్చింది. ప్రధాన పార్టీల నుంచి ఎపుడూ నాన్ లోకల్స్ నే అభ్యర్ధులుగా నిలబెడుతూ వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి వైసీపీ పక్క లోకల్ అయిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది.

అంతేకాదు ఆమె సామాజిక వర్గానికి కూడా పెద్ద పీట వేసింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు మొతం 18 లక్షల మంది దాకా ఉంటే అందులో నాలుగవ వంతు ఓటర్లు బొత్స ఝాన్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. తూర్పు కాపులకు విశాఖ ఎంపీ సీటు దక్కి నాలుగున్నర దశాబ్దాలు అయింది అని అంటున్నారు.

ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నపుడు కొమ్మూరు అప్పలస్వామిని విశాఖ నుంచి ఎంపీగా చేశారు. ఆయన తరువాత కాపుల నుంచి ఎవరూ ఎంపీలు కాలేదు. ఇపుడు ఆ లోటు తీర్చే విధంగా బొత్స ఝాన్సీకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అయిదారు లక్షల మంది దాకా బీసీలు ఉన్నారు. రెండు లక్షల మందికి పైగా ఎస్సీలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరంతా ఈసారి విలక్షణమైన తీర్పు ఇస్తారని వైసీపీ అంచనా వేసుకుంటోంది.

ఈసారి బొత్స ఝాన్సీ గెలిస్తే నాలుగు దశాబ్దాలుగా లోటుగా ఉన్న లోకల్ ఎంపీ అన్న కోరిక తీరుతుంది. అలాగే కాపులకు విశాఖ ఎంపీ సీటు కూడా సుదీర్ఘ కాలం తరువాత దక్కినట్లు అవుతుంది అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?