ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ ఇంజనీరింగ్‌లో దిట్ట. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రతిదీ ఆయన ఎన్నికల కోణంలో చూస్తారన్నది జగమెరిగిన సత్యం. సమాజంలో సగభాగమైన మహిళా లోకం ఓటర్ల కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చకు తెరలేచింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతున్న నేపథ్యంలో జగన్ ఆ దిశగా ఒక అడుగు ముందుకు వేస్తారనే చర్చ జరగుతోంది.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ అమలు కోసం 2029 వరకూ ఎదురు చూడాల్సి వుంటుంది. మెజార్టీ రాజకీయ పార్టీలు 2024 నుంచి అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పార్టీల్లో వైసీపీ కూడా వుంది. వైసీపీ ఎంపీ వంగా గీత లోక్‌సభలో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిజర్వేషన్‌కు మించి ఇప్పటికే సుమారు 56 శాతం స్థానిక సంస్థల్లో మహిళలకు సీట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమె మద్దతు ఇస్తూనే, వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అసలే జగన్ సంచలనాలకు మారుపేరు. మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ముందుగానే, తానే అమలుకు శ్రీకారం చుడితే ఎలా వుంటుందనే ఆలోచన జగన్ చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జనరల్‌కు కేటాయించిన సీట్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను నిలిపిన ఘనత జగన్‌కు దక్కుతుంది. ఇదంతా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఎలా వుంటుందనే కోణంలో జగన్ ఆలోచించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. అదే జరిగి, జగన్ ఆచరణకు శ్రీకారం చుడితే మాత్రం దేశంలోనే అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందారు. మహిళల ఓట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కూడా వుంటాయి.