ఈవీఎంలపై నానాయాగీ చేసి, చివరకు పోలింగ్ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తంచేసిన చంద్రబాబుకి సుప్రీంకోర్టు తీర్పుతో ఏంచేయాలో పాలుపోలేదు. ఓటమి నెపం ఈవీఎంలపై నెట్టేసి ప్రజామద్దతు తనకే ఉందని కల్లబొల్లి ప్రచారం చేసుకుందామని ఫిక్స్ అయిన బాబు.. ఫలితాల తేదీ దగ్గరపడే కొద్దీ కౌంటింగ్ ప్రక్రియపై కూడా అనునాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఏజెంట్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరగబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అంతర్గత సమీక్షల్లో పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తన అనుకూల మీడియాలో కూడా కౌంటింగ్ అక్రమాలు అంటూ కథలు వండివారుస్తూ ప్రతిపక్షాలపై ఇంకా నిందలేస్తూ కాలం గడుపుతున్నారు.
కౌంటింగ్ లో ఏమాత్రం ఏమరుపాటు వద్దు, మన పోటీ దుర్మార్గ పార్టీతో అనేది ఏజెంట్లు గుర్తుంచుకోవాలని చెప్పడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనం కాక ఇంకేంటి. ఓవైపు శాస్త్ర సాంకేతికతను మనం బాగా ప్రోత్సహించాం, టెక్నాలజీ వాడకంలో ఏపీని నెంబర్ 1గా నిలిపామంటూ జాతీయ సాంకేతికతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పుంఖాను పుంఖాలుగా ట్వీట్లు పెడుతున్న టీడీపీ నేతలు, ఈవీఎం టెక్నాలజీని చూసి బాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి.
కౌంటింగ్ ప్రక్రియను వైసీపీ ఎలా ప్రభావితం చేయగలదు. అసలు అధికారంలో లేనిపార్టీ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయగలదు. అలాంటి అవకాశం ఏదైనా ఉంటే.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకా అధికారులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న చంద్రబాబుకే అది సాధ్యమవుతుంది. అలాంటప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం వైసీపీకి ఉంది.
ఇదంతా చూస్తుంటే కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. పోలింగ్ ముగిశాక ఈవీఎంలపై, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అభాసుపాలవుతున్నారు బాబు.