మహాసముద్రం.. నాగచైతన్య హీరోగా అజయ్ భూపతి తీయాలనుకున్న సినిమా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరో-దర్శకుడి మధ్య చర్చలు కూడా జరిగాయి. ఓ కీలకపాత్ర కోసం సమంతను కూడా అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడీ సినిమా ఆగిపోయింది. ఆర్ఎక్స్ 100 తో ఫేమ్ తెచ్చుకున్న అజయ్ భూపతి, ఇప్పుడు రవితేజ కోటరీలోకి చేరినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ-అజయ్ భూపతి మధ్య సైలెంట్ గా కథాచర్చలు జరుగుతున్నాయి. అయితే అది మహాసముద్రం ప్రాజెక్టు కాదు. రవితేజ మార్కెట్ కు మహాసముద్రం సినిమా భారీ బడ్జెట్ గా మారుతుందట. అందుకే మరో కథపై వీళ్లిద్దరూ వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
అంతా బాగానే ఉంది కానీ, మహాసముద్రం ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఇదొక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని తెలుస్తోంది. రీసెంట్ గా మజిలీ లాంటి ఎమోషనల్ మూవీ చేశాడు చైతూ. ప్రస్తుతం వెంకీమామ లాంటి హార్ట్ టచింగ్ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మహాసముద్రం లాంటి మాస్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకోవడానికి ధైర్యం సరిపోలేదంటున్నారు. మహాసముద్రం సినిమా ఆగిపోవడానికి ఇదే కారణం అంటున్నారు.
మరోవైపు రవితేజ ఎఫెక్ట్ కూడా అజయ్ భూపతిపై బాగా పడినట్టు తెలుస్తోంది. ఆర్ఎక్స్100 సక్సెస్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తనతోనే సినిమా చేయాల్సిందిగా రవితేజ, భూపతిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ప్రాజెక్టు తొందరగా సెట్ అయినట్టు చెబుతున్నారు.