జగన్ చేతికి మట్టి అంటకుండానే…

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండురాష్ట్రాలు ఏర్పడిన నాటినుంచి ఉన్నటువంటి, ఆ తర్వాత కొంత కాలానికి బాగా ముదిరినటువంటి సమస్యల్లో ఒకటి ఒక కొలిక్కి వచ్చింది. హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలతో పాటు, మరికొన్ని భవనాలను…

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండురాష్ట్రాలు ఏర్పడిన నాటినుంచి ఉన్నటువంటి, ఆ తర్వాత కొంత కాలానికి బాగా ముదిరినటువంటి సమస్యల్లో ఒకటి ఒక కొలిక్కి వచ్చింది. హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలతో పాటు, మరికొన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేస్తూ… ఆ మేరకు ఆయా భవనాలకు ఇప్పటిదాకా ఏపీ సర్కారు చెల్లించవలసిన పన్ను బకాయిలను అన్నింటినీ రద్దు చేయాల్సిందిగా కోరుతూ గవర్నరు నరసింహన్ ఆదేశాలు జారీ చేసేశారు. విభజన చట్టం 8వ సెక్షన్ ద్వారా తనకు గల అధికారాలతో ఇలా చేస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించేసి, ఒక అంకానికి తెరదించారు.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాటాగా వచ్చిన ఆస్తులు, ఆ ప్రభుత్వ ఆమోదంతో నిమిత్తం లేకుండానే.. తెలంగాణకు దఖలుపడ్డాయా అని తెలుస్తున్నప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఇఫ్తార్ విందు సందర్భంగా గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ సమావేశం అయినప్పుడు.. ఈ ఆస్తుల పంపకం వ్యవహారం చర్చకు వచ్చిందని, అందుకు జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తున్నదని మాత్రం మీడియాలో వచ్చింది.

సాంకేతికంగా చూసినప్పుడు… ఖాళీగా, నిరుపయోగంగా, పర్యవసానంగా శిథిలావస్థకు చేరువవుతూ ఉన్న సదరు భవనాలను తమకు అప్పగించాల్సిందిగా గవర్నరును కోరుతూ తెలంగాణ మంత్రివర్గం ఓ తీర్మానం చేసి పంపింది. దానిని తక్షణం ఆమోదించి… (ఏపీ ప్రభుత్వంతో సంప్రదించకుండానే) తనకు గల ప్రత్యేక అధికారాలతో గవర్నర్ ఆ మేరకు నిర్ణయం తీసేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ చేతికి మట్టి అంటకుండా జరిగిపోయిందనే అభిప్రాయం కలిగించడమే ప్రధానంగా కనిపిస్తుంది.

నిజానికి ఏపీ ప్రజలు అనితరమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అధికారం అందించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సుహృద్భావ సంబంధాలు నెలకొనేందుకు… నిరుపయోగంగా ఉన్న భవనాలను ఆయన స్వయంగా నిర్ణయం తీసుకుని తెలంగాణకు కేటాయించినా కూడా.. ఎవరూ దానిని ఖండించే, తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ జగన్ ఎందుకో జాగ్రత్త వహించారు. సచివాలయంలో నిరుపయోగ భవనాలను ఇచ్చేయడం మంచిదే. కాకపోతే… జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా శ్రద్ధగా వ్యవహరించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి.

విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని అనేక ఆస్తుల పంపకాలపై పీటముడి ఉంది. ఎటూ ఈ అప్పగింతలు తెలంగాణకు అనుకూలంగానే చేశారు గనుక.. తతిమ్మా విషయాల్లో ఏపీ ప్రయోజనాలు దెబ్బతినకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పగించిన భవనాలకు విలువకట్టించి తెలంగాణ సర్కారును అడిగే ప్రయత్నంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పీటముడి బిగియకుండా.. సమస్య త్వరగా ఒక కొలిక్కి రావడానికి ఇలాంటి ప్రత్యామ్నాయాలను ఇతరత్రా విషయాల్లోనూ జగన్ అనుసరిస్తే బాగుంటుంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు