పెళ్లయిన కొత్తలో జంటలు వెళ్లేది హనీమూన్. దీని గురించి మనందరికీ బాగా తెలుసు. రీసెంట్ గా బడ్డీ మూన్ అనే ట్రెండ్ కూడా మొదలైంది.
పెళ్లయిన భార్యాభర్తలు, తమతో పాటు స్నేహితుల్ని కూడా విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు. దీన్నే బడ్డీ మూన్ అంటారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ-రష్మిక ఇదే పని చేశారు.
అయితే, ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త ట్రెండ్ ఒకటి యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే సోలో మూన్. నిజానికి ఇది హనీమూన్ కాదు, బడ్డీ మూన్ అంత కంటే కాదు. ఆ మాటకొస్తే, ఇందులో భాగస్వామి అంటూ ఎవ్వరూ ఉండరు.
అవును.. మనకు మనం, మన కోసం మనం, మన ఇష్టానుసారం, మనకు నచ్చినట్టుగా, మనస్ఫూర్తిగా చేసే విహారయాత్రను ఇప్పుడు జెన్ జీ ముద్దుగా సోలో మూన్ అని పిలుస్తోంది.
భాగస్వామి తోడు లేకపోయినా, అసలు పెళ్లే కాకపోయినా.. ఎవరి కోసమో ఎదురుచూడకుండా.. తమనుతాము సెలబ్రేట్ చేసుకోవడానికి నేటి తరం ఎంచుకుంటున్న కొత్త మార్గమిది.
జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టు సాగదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఎవరి కోసమో మనం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? మనకు నచ్చినట్టు స్వేచ్ఛగా కొన్ని రోజులు బతకలేమా? ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ సోలో మూన్.
ఒకప్పుడు ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్లాలన్నా, లగ్జరీ రిసార్ట్లో గడపాలన్నా తోడు కోసం చూసేవారు. కానీ ఇప్పటి జెన్ జీ తరం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. నచ్చిన ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణిస్తూ, సొంతంగా అడ్వెంచర్స్ ప్లాన్ చేసుకుంటూ సోలోగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి వాళ్లు సోలో మూన్ అని పేరుపెట్టారు.
దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు మానసికవేత్తలు. ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం పట్టించుకోవడం మానేశాం. మన అంతరంగంలోకి తొంగిచూడడం తగ్గించేశాం. అలాంటి ఓ అవకాశాన్ని సోలో మూన్ అందిస్తుంది. ఇది కేవలం విహారయాత్ర మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే అద్భుతమైన కాన్సెప్ట్.
నిజానికి మరొకరిని ప్రేమించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో అవసరం. ఆ సెల్ఫ్-లవ్ ప్రయాణానికి అసలైన నిదర్శనమే ఈ సోలో మూన్. ఒంటరితనం అనిపించినా, మనసు కాస్త భారంగా మారినా, డిప్రెషన్ లక్షణాలు కనిపించినా…. మనల్ని మనం కొత్తగా రీఛార్జ్ చేసుకోవడానికి అత్యుత్తమ మార్గం ఈ సోలో మూన్.

“లండన్ ఆంటీస్” కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా?