అప్పట్లో గ్రాఫిక్స్ ప్రాబ్లమ్ వల్ల విశ్వంభర వాయిదా పడింది. రిలీజ్ చేసిన కంటెంట్ లో విజువల్ ఎఫెక్టులు పేలవంగా ఉన్నాయనే విమర్శలు రావడంతో టైమ్ తీసుకొని మంచిగా గ్రాఫిక్ వర్క్ పూర్తి చేశారు.
ఆ తర్వాత ఓటీటీ డీల్ పూర్తికాక మరోసారి వాయిదాపడింది. ఈ సినిమాకు నాన్-థియేట్రికల్ లాక్ చేయడానికి చాన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా అంటే చాలా ప్రయత్నాలు కూడా మేకర్స్ చేయాల్సి వచ్చింది.
మొత్తానికి విజువల్ ఎఫెక్టు పనులు, ఓటీటీ డీల్ పూర్తిచేశారు. ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం. ఇక్కడ కూడా సమస్య ఎదురైంది. పండగ తేదీలన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక దశలో సంక్రాంతికి అనుకుంటే, చిరంజీవి సినిమానే అడ్డంకిగా మారింది.
స్వయంగా బాబి, నిర్మాత వెంకట్ కె.నారాయణ రిక్వెస్ట్ చేయడంతో.. నిర్మాత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాకాను సంక్రాంతికి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. మరి విశ్వంభర పరిస్థితేంటి?
ఈ సినిమాకు చాన్నాళ్ల కిందటే ట్రయిలర్ కట్ రెడీ చేశారు. దానికి మరికొన్ని మార్పుచేర్పులు చేసి కొత్త వెర్షన్ సిద్ధం చేశారు. సినిమా రిలీజ్ డేట్ లాక్ అయితే, చివర్లో విడుదల తేదీ వేసి ట్రయిలర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
సంక్రాంతికి సీజన్ ను వదులుకోవడానికి విశ్వంభర యూనిట్ కు ఇష్టం లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఆలస్యమైంది. సంక్రాంతి సీజన్ దాటిపోతే మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు రారు.
పోనీ మధ్యేమార్గంగా సంక్రాంతి సీజన్ కు 2 వారాల ముందు రిలీజ్ చేద్దామంటే, క్రిస్మస్ సినిమాలకు ఇబ్బంది. ఆల్రెడీ క్రిస్మస్ కు నాగార్జున, బాలకృష్ణ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇక మిగిలింది రెండే రెండు దారులు.
వస్తే, డిసెంబర్ మొదటి వారంలో రావాలి. లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లో రావాలి. సమ్మర్ వరకు వెయిట్ చేయడం విశ్వంభర యూనిట్ కు ఇష్టం లేదు, పైగా కష్టం కూడా. దీంతో ఈ విడుదల తేదీ పంచాయితీ మళ్లీ చిరంజీవి చెంతకు చేరింది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం చిట్ చాట్ చేసే కార్యక్రమం కోసం 2 రోజులు టైమ్ కేటాయించారు చిరు. అది పూర్తయిన తర్వాత, విశ్వంభర విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
