రేవంత్ రెడ్డి సుల్తాన్ కా ఏక్ సాల్

నాలుగువందల ఏళ్ల పైబడిన చరిత్రగల భాగ్యనగరం నుంచి నిజాం ఒకప్పటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న అభినవ సుల్తాన్ రేవంత్ రెడ్డి!

నాలుగువందల ఏళ్ల పైబడిన చరిత్రగల భాగ్యనగరం నుంచి నిజాం ఒకప్పటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న అభినవ సుల్తాన్ రేవంత్ రెడ్డి! ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక్క ఏడాది పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటున్నారు. ‘ఏక్ సాల్ కా సుల్తాన్’ అంటే మళ్లీ అర్థం మారిపోతుంది. అసలే కాంగ్రెస్ పార్టీ.. ‘రేవంత్ రెడ్డిని మించిన మొనగాళ్లం మేం’ అనుకునే అనేకమంది ప్రముఖులు.. ‘వచ్చేనెలలో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది, సీఎం మారిపోతారు’ అని గత ఆరునెలలుగానూ ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు.. ‘రేవంత్ రెడ్డి చివరి అగ్రకులాల సీఎం, త్వరలోనే బీసీ సీఎం వస్తారు’ అంటున్న స్వపక్షీయులు.. ఇన్ని రకాల ప్రచారాలు, ఒత్తిళ్ల మధ్య ఒక ఏడాది రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలను పూర్తిచేయడమే పెద్ద ఎఛీవ్‌మెంట్! అది ఎంత పెద్ద ఎఛీవ్‌మెంట్ అయినా సరే.. ఈ ఏడాదిలో ఆయన ఎఛీవ్‌మెంట్స్ ఏమిటో చర్చించుకోవడం అవసరం. విజయాలు, పరాజయాలు, మాట నిలబెట్టుకోవడాలూ, దాటవేతలూ.. ప్రజాదరణ– వ్యతిరేకత సమస్త అంశాలపై ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సుల్తాన్ కా ఏక్ సాల్’!

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి మహానేత విషయంలో కొంత అలవాటుకు భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి అతి తరచుగా ముఖ్యమంత్రులను మార్చడం అనే సంగతి ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వానుభవంలో అలాంటివి చాలా చూశారు. రాజశేఖర రెడ్డి మరణానంతరమే ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాం. పైగా ఎనుముల రేవంత్ రెడ్డి జీన్స్ లో కాంగ్రెస్ రక్తమున్న నాయకుడు కూడా కాదు. భారతీయ జనతా పార్టీ మూలాలతో, తెలుగుదేశం పార్టీ శిక్షణలో రాటుదేలి ఎదిగిన నాయకుడు! అలాంటి రేవంత్ రెడ్డి కొన్ని తరాలుగా కాంగ్రెసు పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులందరినీ బైపాస్ చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారంటే.. అది కేవలం ఆయన రెక్కల కష్టం. ఆయన శ్రమ ఫలితం.

‘ఈ రాష్ట్రం యావత్తూ శాశ్వతంగా తమకు రుణపడి ఉంటుంది’ అనే నమ్మకంతో తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి తెలంగాణలో అప్పటికి ఉన్న ఏ నాయకుడు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. రేవంత్ రెడ్డి దూకుడు, కష్టనష్టాలకు వెరవని తత్వం ఇవన్నీ కలిపి ఆయనను రేసులో ముందంజలో ఉంచి ముఖ్యమంత్రి అయ్యేలా చేశాయి. రేవంత్ కంటె సమర్థులం అని, పార్టీకి విశ్వసనీయులం అని, సీనియర్లం అని, గొప్పవాళ్లం అని అనుకునే అనేకమంది ఆ పార్టీలో ఇంకా ఉన్నారు. కానీ.. కాంగ్రెస్ రేవంత్ మీదనే నమ్మకం ఉంచి ‘తెలంగాణ సుల్తాన్’ ను చేసింది.

‘అవకాశం దక్కించుకున్నంత సులభం కాదు.. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం’ అనే జీవిత సత్యం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా తాను ఎంపిక కావడానికి దారి తీసిన కారణాలు, పార్టీ అధిష్ఠానాన్ని ఇంప్రెస్ చేసిన అర్హతలు ఏవైనా కావొచ్చు గాక.. ఎన్నయినా ఉండవచ్చు గాక.. పదవిలో కలకాలం కొనసాగడానికి అవి చాలవు అనే సంగతి రేవంత్ కు చాలా బాగా తెలుసు. అందుకే సీఎం అయ్యేదాకా ఒక తీరు– అయిన తర్వాత మరొక తీరు అన్నట్టుగా ఆయన తన పనితీరును నిర్దేశించుకున్నారు.

‘ఆరు గ్యారంటీలు’ అనే జనాకర్షక హామీలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి.. పగ్గాలు చేపట్టిన వెంటనే రెండింటిని నెరవేర్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆరోగ్య శ్రీ బీమా లిమిట్ ను పది లక్షల రూపాయలకు పెంచారు. సర్వత్రా జనామోదం పొందిన నిర్ణయాలు అవి.

సమర్థత చూపించాలనేదే ఆరాటం

పదవి దక్కిన తొలి రోజు నుంచి రేవంత్ రెడ్డిలో కనిపించిన ఆరాటం ఒక్కటే! తన సమర్థతను నిరూపించుకోవాలి. ఎవరైతే రేవంత్ అర్హతలను ప్రశ్నించే సహచరులు ఉన్నారో.. వారందరి నోళ్లకు తాళాలు వేయాలి. రేవంత్ కష్టపడిన స్థాయిలో తాము కూడా కష్టపడ్డామని, పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అంతకంటే ఎక్కువ కష్టమే పడ్డామని ఎవరైనా చెప్పుకోవచ్చు గాక! కానీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు, దూకుడు విషయంలో సహచరులు నోరెత్తలేక మౌనంగా ఉండి పోయే పరిస్థితిని సృష్టించాలని రేవంత్ రెడ్డి ముందుగానే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన పనితీరు దానికి తగ్గట్టుగానే ఉంది.

దానికి తగ్గట్లుగానే ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. పార్టీలో సీనియర్ సహచరులలో అసంతృప్తి రాకుండా తనకు చేతనైన చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎన్నికల ఫలితాల సమయంలోనే డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టారు. అప్పటిదాకా భారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం గా ఉన్న భవంతిని, తన జమానాలో డిప్యూటీ అయిన భట్టికి కేటాయించారు. అంతేకాదు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమంత్రితో సమానంగా భట్టివిక్రమార్కకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ఫోటోల విషయంలో కూడా ముఖ్యమంత్రితో సమానంగా భక్తి విక్రమార్క ఫోటోలు కూడా పెట్టిస్తూ ఆయనను సంతృప్తి పరిచారు.

పరిపాలన పరంగా తన ముద్ర చూపించుకోవడం లక్ష్యంగా, తాను మాత్రమే చేయగలిగిన శైలి పనులు ఇవి– అనిపించేంత దూకుడుగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ చరిత్రలోనే హైడ్రా కూల్చివేతలు ప్రత్యేక అధ్యాయం! నీటి వనరులను, సరస్సులు, కాలువలను కాపాడడానికి చాలా మొండి ధైర్యంతో హైడ్రా ఆలోచనకు రేవంత్ రూపకల్పన చేశారని చెప్పాలి. అన్ని రకాలుగానూ.. ఇంతటి వైభవోపేతమైన భాగ్యనగరం.. వర్షాకాలంలో దుర్భర జీవితానికి ఆలవాలం అవుతున్నదంటే.. నీటివనరులు శాశ్వత దురాక్రమణలకు గురై ఉండడమే అనే కఠోరసత్యాన్ని సీరియస్ గా పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

నీటి వనరుల ఆక్రమణల విషయంలో ఎంతటి వారి ఆస్తులైనా సరే, ఎంత విలువైన నిర్మాణాలు అయినా సరే.. వెనక్కు తగ్గేది లేదని.. సమూలంగా నేలమట్టం చేసేయడమే అని ఆయన పలు సందర్భాల్లో నిరూపించుకుని ముందుకు సాగారు.

లోపాలు లేకపోలేదు

అలాగని, రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలు లేవని చెప్పలేం. రైతుబంధు నిధులు ఇవ్వకపోగా రుణమాఫీ చేస్తానని ప్రకటించిన హామీ ఇవాళ్టి దాకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. హైడ్రా కూల్చివేతల విషయంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూసీ నది ప్రక్షాళన విషయంలో పేదల ఇళ్లు కూల్చి వేయడం అనేది పెద్ద రాద్ధాంతంగా మారిపోయింది.

మూసీ నదిని ప్రక్షాళన చేయడం ఆ ప్రాంతం మొత్తానికి పూర్వవైభవం తీసుకురావడం అనేది అతి పెద్ద బృహత్కార్యం. దీనిని మూసి సుందరీ కరణ అనే పదాలతో అభివర్ణించకుండా.. మూసి ప్రక్షాళన అనడమే సబబుగా ఉంటుంది! ఇది కొన్ని వేలమంది పేదల కుటుంబాలతో ముడిపడిన అంశం కావడంతో, దీని ద్వారా అత్యధిక రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగాయి. గులాబీ దళానికి చెందిన నాయకులు పదేపదే మాటలు రువ్వుతూ, అక్కడికే పరిమితమై విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు నాయకులు మూసీ పరీవాహక ప్రాంతాలలో రాత్రుళ్ళు బస చేసి రేవంత్ కు గట్టి సవాలే విసిరారు.

అయితే ఒక బృహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు అవాంతరాలు రావడం చాలా సహజం. రాజకీయ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేస్తున్నానా లేదా, అలాగే తన నిర్ణయం వలన ఎన్ని పేద కుటుంబాలు పూర్తిగా ఛిద్రమవుతాయి అందుకు తన ప్రభుత్వం చూపగలిగిన పరిష్కారం ఏమిటి? ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపూ మూసీ నది ఒడ్డున ఉండే పేదలకు టు బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నాం, ఆ పేదలు సుఖమైన ఇళ్లలో ఉండడం మీకు ఇష్టం లేదా అంటూ ప్రతిపక్షాలను ఆడిపోసుకున్నంత మాత్రాన ఈ వివాదం సమసిపోయేది కాదు

పేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి ఉపాధులు ఏమాత్రం దెబ్బ తినకుండా వారు అదనపు ఇబ్బందులు పడకుండా తన ఆత్మ సాక్షికి తెలిసేలాగా పరిష్కారాలను చూపగలిగారా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా పూర్తిగా దృష్టి సారించినట్లుగా అనిపించడం లేదు

రేవంత్ తో ప్రతిపక్షాల మైండ్ గేమ్

అన్నింటికంటె ముఖ్యంగా ఒక విషయంలో రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలి. కాంగ్రెస్ పార్టీకి సనాతనంగా ఉన్న ముఖ్యమంత్రులను తరచుగా మార్చే సంస్కృతిని బూచిలాగా చూపిస్తూ రేవంత్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, ఆయనలో ఒకరకమైన భయాన్ని రేకెత్తించడానికి ప్రతిపక్షాలు తమ శక్తివంచన లేకుండా పనిచేస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని, ఆయనను ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించబోతున్నారని.. అటు కిషన్ రెడ్డి వంటి కమల ప్రముఖులు, కేటీఆర్ వంటి గులాబీ నేతలు ఎన్ని నెలలుగా వాక్రుచ్చుతున్నారో లెక్కేలేదు.

బహుశా వారి ఆలోచన ఒకటి కావొచ్చు. ఈ ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా ఊడిపోయే పదవి.. కాబట్టి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా.. పదవిలో ఉండగానే సంపాదించుకోవాలి.. అనే తీరుతో అవినీతి మార్గంలోకి రేవంత్ రెడ్డిన బలవంతంగా నెట్టాలని.. తద్వారా ఆయనను భ్రష్టుపట్టించాలనేది వారి ఆలోచన కావచ్చు.

విపక్షాలకు చెందిన ఈ నాయకులు ఇప్పటికి కొన్ని వందల సార్లు.. రేవంత్ రెడ్డి పదవి త్వరలోనే పోతుందని చెబుతూ వచ్చారు. కానీ వారి అలాంటి మైండ్ గేమ్ కు రేవంత్ ఏ మాత్రం లొంగలేదు. ప్రతిపక్షాల వారి ఆనుపానులు తనకు తెలుసు అన్నట్టుగా.. వారు మైండ్ గేమ్ తో తన స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ.. రేవంత్ రెడ్డి.. మరింత దూకుడుగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఘనంగా అడుగులు వేస్తున్నారు. అవినీతి మరకలు తనకు అంటకుండా చూసుకుంటున్నారు.

ప్రతిపక్ష నాయకుల మైండ్ గేమ్ ఒక ఎత్తు అయితే సొంత పార్టీ నాయకుల మైండ్ గేమ్ మరో ఎత్తు. ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న హఠాత్తుగా తన దూకుడు పెంచారు. తనను తాను బీసీలకు మెసయ్యగా చిత్రీకరించుకోవడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి తీన్మార్ మల్లన్న‌ దూకుడు నిదర్శనం. రేవంత్ సర్కారు త్వరలోనూ కూలుతుందని, బీసీ ముఖ్యమంత్రి తెరమీదకు రాబోతున్నారని వరుస ప్రకటనలతో తీన్మార్ మల్లన్న చెలరేగిపోతున్నారు. సాధారణంగా అయితే.. కాంగ్రెస్ పరిస్థితులు తెలిసిన నేతగా.. తన వెనుక బీసీ నేతలు ఎవరైనా గోతులు తవ్వుతున్నారేమో అనే అధినేత క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించే వ్యాఖ్యలు ఇవి. సొంత పార్టీ వారినుంచే ఇలాంటి మైండ్ గేమ్ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి.

అయితే రేవంత్ మాత్రం.. ఎవ్వరు ఎలాంటి మైండ్ గేమ్ ఆడినా.. తన మీద ప్రభావం చూపించలేరు– అని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత..

ప్రజల ఆమోదం లేనప్పుడు మడమ తిప్పడానికి, వెనుకడుగు వేయడానికి కూడా రేవంత్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియడం గొప్ప అనే సిద్ధాంతాన్ని ఆయన కూడా పాటిస్తున్నారు. ప్రజాందోళనల్ని ఆయన గౌరవిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఇది చాలా ముఖ్యమైన లక్షణంగా ఉండాలి. చాలా మంది ప్రజాందోళనల్ని గుర్తించకుండా, గౌరవించకుండా.. తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి అలాంటి తప్పులు అంతగా చేయడం లేదు.

దిలావర్ పూర్ ఇథనాల్ ఫాక్టరీ అనుమతుల్ని రద్దు చేయడం అనేది విశేషం కాదు. అనుమతులు ఇచ్చింది భారాస అనే సాకు, వారి మీదకే నిందలు మరలించవచ్చు గనుక.. అక్కడి ప్రజాందోళనలను పట్టించుకుని రద్దు చేశారని అనుకోవచ్చు. కానీ పాలమూరు జిల్లా లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి ఒక స్థాయి వరకు పట్టుదలకు వెళ్లారు. అక్కడ ఫార్మా సిటీని రైతులు వ్యతిరేకిస్తూ కలెక్టరు కాన్వాయ్ మీదనే దాడికి పాల్పడిన తర్వాత.. ప్రభుత్వం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ.. వరుస అరెస్టులతో ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. కాస్త వెనుకడుగు వేసినట్టుగా అక్కడ ఫార్మా సిటీ కాదని.. కేవలం పారిశ్రామిక వాడ ఏర్పాటుచేయబోతున్నామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. కానీ అంతిమంగా వచ్చేసరికి, లగచర్లలో తలపెట్టిన ప్రాజెక్టును కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు.

పట్టువిడుపుల మేలిమి సమ్మేళనంగా రేవంత్ రెడ్డి ‘సుల్తాన్ కా ఏక్ సాల్’ గడిచిపోయింది. స్థూలంగా పరిశీలించినప్పుడు.. వేసిన ప్రతి అడుగూ మహాద్భుతమని.. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మహానేత అని కితాబులివ్వడానికి వీల్లేదు. ఇంకా పెండింగులో ఉంచేసిన వరాలు, హామీలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ సంగతి గమనించాలి.

ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టో మొత్తం పూర్తిచేసేస్తుందని, చేసేయాలని ఎవ్వరూ ఆశించరు. అయితే.. రేవంత్ రెడ్డి దూకుడు చూసి చేసేస్తారేమో అని ఎవరైనా అనుకుని ఉండొచ్చు. ఇంకా పూర్తి కాని హామీల గురించి ప్రతిపక్షాలు ప్రతినిత్యం గోలచేస్తూనే ఉన్నాయి. అయితే తక్షణం అన్నీ చేయాలనే డిమాండ్ సరి కాదు గానీ.. రేవంత్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రిగా.. మిగిలిన అన్ని హామీలకు డెడ్ లైన్ల సహా ఒక కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తే.. ప్రతిపక్షాల నోర్లకు తాళాలు పడతాయి. ప్రజలు కూడా నిమ్మళంగా ఆ డెడ్ లైన్ల వరకు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు రేవంత్ తీసుకోవాల్సి ఉంది.

అన్ని మెళకువలు అనుసరిస్తూ పోతే.. కాంగ్రెస్ పార్టీలో ఎందరు సమర్థ నాయకులైనా ఉండవచ్చు గాక.. కానీ వారందరి సమర్థతలను సమన్వయ పరుస్తూ ప్రభుత్వ నిర్వహణలో వారి సేవలను వాడుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే మంచి కెప్టెన్ గా రేవంత్ రెడ్డి స్థిరపడతారు.

ఎల్. విజయలక్ష్మి

7 Replies to “రేవంత్ రెడ్డి సుల్తాన్ కా ఏక్ సాల్”

  1. జగన అన్న లొ మాత్రం అతి నిజాయితీతనం అతి మంచితనం ఉన్నాయి అంట, నిజమెనా???

    .

    అయినా జగన్మోహన్ రెడ్డిలో అతినిజాయితీ అంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చిత్రంగా నవ్వుకుంటున్నారు అంట, నిజమెనా???.

  2. ede jagan Garu carona time 10 th exams vaddani cheppina vinkunda , court chetha motikkayalu thinnaru , anthe kani thaggaledu , anduke ela ayyindhi ee roju party situation. adimulapu suresh thisukunna thalatikka decisions ki support chesaru .school pillalanu badha pettaru.

Comments are closed.