Advertisement

Advertisement


Home > Politics - Opinion

యుద్ధమంటే....?

యుద్ధమంటే....?

కొండ‌ల్లో పారే ఏరుకి ఒక పాట వుంటుంది. త‌న కోసం తాను పాడుకునే పాట‌. మ‌న కోసం పాడ‌దు. వింటే మ‌న అదృష్టం. నెమ‌లి సంతోషిస్తే నాట్యం. కోయిల‌కి ఆనందం వ‌స్తే గానం. గాలిలో ఎగిరినా ప‌క్షికి గ‌ర్వం వుండ‌దు. నీటిలోని చేప‌కి చ‌లి పుట్ట‌దు. తిమింగ‌లానికి త‌న బ‌లం తెలియ‌దు. ఒక్క మ‌నిషి మాత్ర‌మే అతీతం. వాడికి త‌న గురించి తెలుసు. అవ‌స‌రానికి మించి తెలుసు. అందుకే అజ్ఞానం.

23 వెళ్లిపోయింది. 24 వ‌చ్చింది. అద్భుతాలు తెస్తుంద‌ని అంద‌రి ఆశ‌. అద్భుతం బ‌య‌ట వుండ‌దు, మ‌న లోప‌లే వుంటుంది. వెతికి ప‌ట్టుకోవాలి. టైమ్ లేదు. డ‌బ్బు, కీర్తి, అధికారం అన్నింటి కోసం వెతుకుతాం. ఆత్మ కోసం వెత‌కం. చాలా మందికి అది వుండ‌దు. చంపేస్తారు. ఒక‌వేళ బ‌త‌క‌డానికి ప్ర‌య‌త్నిస్తే పాతిపెడ‌తారు. కానీ అది ఏ మూల నుంచో అరుస్తూ వుంటుంది. పీక నొక్కినా, కోసినా, బండ రాయితో బాదినా మూలుగుతూనే వుంటుంది. వెంటిలేట‌ర్ మీద ఉన్న ఆత్మ ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా యూనిఫామ్ వేస్తాం. ఖ‌ద్ద‌రు ధ‌రిస్తాం. అలంకారాలు చేసి అత్త‌రు పూస్తాం. లోప‌ల మాత్రం శ‌వం కాలిన క‌మురు వాస‌న‌.

మిణుగురుల్ని వెలుతురు అనుకోవ‌డ‌మే జీవితం. అవి నిప్పు ర‌వ్వ‌లు అనుకుని చ‌లి కాచుకునే వాళ్లు కూడా వుంటారు. సూర్యుడు త‌మ వ‌ల్లే వెలుగుతున్నాడ‌నుకునే మిణుగురులు కూడా వుంటాయి. ఆత్మ విశ్వాసానికి మించిన ఆత్మ ప్ర‌శాంత‌త వుండ‌దు.

గ‌డియారం వ‌ల్ల కాలం తెలుస్తుంది. కాలం ఆగ‌దు. సూర్యుడి వేడికి నీళ్లు ఆవిరి అయిన‌ట్టు, మ‌న‌లోని య‌వ్వ‌నం, శ‌క్తి నిశ్శ‌బ్దంగా వెళ్లిపోతుంటాయి. ముడుత‌లు, ముదురుత‌నం వ‌స్తూ వుంటాయి. అంగీక‌రించం. బ‌య‌ట మారుతుంటుంది కానీ, లోప‌ల ఏమీ మార‌దు. అందుకే మ‌న రూపాన్ని మ‌న‌మే గుర్తించం. గ‌తాన్ని ప్రేమించే వాళ్లు గ‌తంలోనే వుండిపోతారు. ఒక‌ప్పుడు నువ్వు తోపువే, ఇప్పుడు తుప్పు ప‌ట్టావు. శిథిల‌మైపోతున్న‌ప్పుడు కూడా పున‌ర్నిర్మాణం వుంద‌ని న‌మ్ముతాం. దాన్నే భ్రాంతి, మాయ అంటారు. దీనికి వేదాంతం చ‌ద‌వ‌క్క‌ర్లేదు. క‌ళ్ల డాక్ట‌ర్‌తో చూపించుకుంటే చాలు.

ఈ ప్ర‌పంచంలో మంచి వాళ్లుగా న‌టించ‌డానికి ఎక్కువ క‌ష్ట‌ప‌డుతుంటారు. శుద్ధ మంచిత‌నం, నిఖార్సైన చెడు ఎక్క‌డా వుండ‌వు. రుతువుల్లా మ‌నుషుల్లోకి వ‌చ్చి పోతుంటాయి. వాన చినుకులో సంగీతం, రౌద్రం రెండూ వున్నాయి. నీ త‌ల మీద పైక‌ప్పు వుందో లేదో చూసుకో.

ఒక క్ష‌ణం నుంచి ఇంకో క్ష‌ణంలోకి, రోజు నుంచి ఇంకో రోజు, ఏడాది నుంచి ఇంకో  ఏడాది. ప్ర‌తి ప్ర‌యాణం ఎక్క‌డో ఆగుతుంది. ప్రారంభం, ముగింపు రెండూ తెలియ‌క‌పోవ‌డ‌మే జీవితం. ఏడుస్తూ వ‌చ్చి ఏడిపించి వెళ్తాం.

ఆధిప‌త్య భావ‌జాలాన్ని నాగ‌రిక‌త అంటారు. ఒక మ‌నిషి ఇంకో మ‌నిషిని ఎంత హింసిస్తే అంత సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం. ప్రేమ‌ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. హింస‌ని అంత‌కు మించి. చాలా సంద‌ర్భాల్లో రెండూ క‌లిసే వుంటాయి. ఒంట‌రిగా న‌డుస్తూ వుంటే చెట్టు మీద ప‌క్షి పాట వినిపిస్తుంది. పోగొట్టుకున్న వారి కోసం వినిపించే విషాద సంగీతం కావ‌చ్చు. మ‌నం వెళుతున్న విశాల‌మైన రోడ్డుపై కూలిపోయిన చెట్ల ప్ర‌తిబింబాలు క‌నిపిస్తాయి. దిక్కు లేకుండా రాలిపోయిన ప‌క్షి కూన‌ల ఆత్మ‌ల ఘోష వినిపిస్తుంది.

మ‌న‌కి ఎన్ని భాష‌లు తెలిసినా, క‌న్నీళ్ల‌ని అర్థం చేసుకునే భాష తెలియ‌న‌ప్పుడు నిర‌క్ష‌రాస్యుల‌మే. మూగ‌భాష‌కి అనువాదం తెలియ‌న‌ప్పుడు ర‌స విద్య తెలిసినా ప్ర‌యోజ‌నం లేదు. ఇనుముని ఎన్ని ర‌కాలుగానైనా మార్చొచ్చు. మ‌నిషిని మార్చ‌డం ఎట్లా?

మ‌ట్టి దారుల్లో న‌డుస్తున్న‌ప్పుడు, అస్ప‌ష్టంగా క‌నిపించే వేల పాద ముద్ర‌ల‌కి న‌మ‌స్క‌రించు. వాళ్లంతా న‌డిస్తేనే నువ్వు న‌డుస్తున్నావు. వాళ్లు జీవితంతో చేసిన యుద్ధంతోనే నీకు ఎంతోకొంత శాంతి ల‌భించింది.

చ‌రిత్ర‌లో ఒక అక్ష‌రం కూడా కాకుండా మిగిలిపోవ‌చ్చు. కానీ వాళ్లు అడ‌వులు జ‌యించారు. అగ్గికి ద‌గ్ధ‌మ‌య్యారు. వేటాడారు, వేట‌గా మారారు. భూమి పొర‌ల్లో విత్త‌నం అయ్యారు. ఆయుధం లేకుండా పోరాట‌మ‌య్యారు.

విజ‌యం అంటే ఎదుటి వాడి మీద సాధించేది కాదు. మ‌న‌మీద మ‌నం సాధించేది. విజేత‌లు, ప‌రాజితులు ఒక‌రుగా వుండేది అన్నిటికంటే గొప్ప యుద్ధం.

(డిసెంబ‌ర్ 31 రాత్రి రాసుకున్న‌ది)

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?