గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.

గత ఏడాది గులాబీ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అధికారం కోల్పోయాక అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు. మరి 2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.

ప్రధానంగా అధినేత కేసీఆర్ సహా కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కూతురు కవితను కేసులు వెంటాడుతున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆల్రెడీ ఆరు నెలలు జైల్లో ఉంది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది.

కాబట్టి ఆమె మీద మీద కత్తి వేలాడుతున్నట్లే. అధినేత కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి విచారణ కమిషన్లు నివేదికలు ఇవ్వాల్సి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి హరీష్ రావు కూడా నిందితుడే. విచారణ నివేదికలు వచ్చాక కేసీఆర్, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.

ఇక కేటీఆర్ ఫార్ములా -ఈ రేసు కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ఏడో తేదీన ఈడీ ఆయనను విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి వుంది. ఈ కేసుల నుంచి పూర్తి నిర్దోషులుగా బయటపడటం అంత సులభం ఏమీ కాదు. కాబట్టి ఈ ఏడాది కూడా కేసీఆర్ ఫ్యామిలీకి చికాకులే. ప్రశాంతత కరువే.

ఈ ఏడాది పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక కావాలి. అధ్యక్షుడు ఎవరు అవుతారనేది చర్చనీయాంశంగా ఉంది. కవిత బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా బీసీని చేస్తారనేది ఒక అంచనా. దీనిపై కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గులాబీ పార్టీకి పరీక్షే. ఎన్నికల నాటికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఎన్నికల ఫలితాలు గులాబీ పార్టీకి సానుకూలంగా ఉంటే కొంత ఊరట కలిగినట్లే. మొత్తం మీద కొత్త ఏడాది కేసీఆర్ పార్టీకి నల్లేరు మీద నడక ఏమీ కాదు.

2 Replies to “గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? ”

Comments are closed.