జీవితంలో తొలిసారి అమెరికా ప్రయాణం…!

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం రెండు దేశాలకే అధికారికంగా వెళ్లారు – చైనా, సింగపూర్. అమెరికాకు మాత్రం వెళ్లలేదు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన ఆయన జీవితంలో చాలా ప్రధానమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పదవులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పనిచేసినప్పటికీ, ఈపాటికే అనేక దేశాలు చుట్టి వచ్చి ఉంటారని అనుకుంటారు.

తెలుగువారు అత్యధికంగా వెళ్లే దేశం అమెరికానే అన్నది సర్వసాధారణం. సామాన్యులు కూడా ఒక్కసారైనా అమెరికా చూసి వస్తుంటారు. కేసీఆర్‌ కుమారుడు, కూతురు అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగాలు కూడా చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తన జీవితంలో ఎప్పుడూ అమెరికా వెళ్లలేదు. కొడుకు, కూతురు అక్కడ ఉన్నప్పటికీ వెళ్లలేదు. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటమా? లేక ఆయనకే ఆసక్తి లేకపోవడమా? ఇంకేదైనా కారణమా? తెలియదు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం రెండు దేశాలకే అధికారికంగా వెళ్లారు – చైనా, సింగపూర్. అమెరికాకు మాత్రం వెళ్లలేదు. ఇది ఆశ్చర్యకరమే. అయితే ఇప్పుడు జీవితంలో తొలిసారిగా కేసీఆర్‌ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన ఒక్కడే కాదు, కుటుంబ సభ్యులు కూడా వెళ్తున్నారు. ఇన్నాళ్లకు అమెరికా చూడాలని అనిపించిందా? కాదు. కేటీఆర్ కుమారుడు, తన మనవడు హిమాన్షు అమెరికాలో చదువుతున్నాడు.

అతని గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించిన డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి, సాధారణ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. పదేళ్ల ముఖ్యమంత్రి పర్యటనలో, అంతర్జాతీయ సదస్సులకు కేటీఆర్‌ను పంపినప్పటికీ, తానే వెళ్లలేదు. దేశంలోనే అత్యల్ప విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు.

ఈసారి సుమారు రెండు నెలల పాటు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. హిమాన్షు ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు తాతను అమెరికాకు రావాలని కోరాడట. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే సమయం రావడంతో, అది జరగబోతోంది. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ కూడా కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించింది.

ఇటీవలే ఫోరం చైర్మన్ లక్ష్మణ్‌తో పాటు 15 మంది సభ్యుల బృందం ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసి, అమెరికా పర్యటన కోరారు. ఎన్నారై తెలంగాణ వాసులతో సమావేశమై, పార్టీ బలోపేతంపై చర్చించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, పార్టీ వ్యవహారాల నిమిత్తం ఎన్నారైలతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ పర్యటన వెనుక మరొక ఉద్దేశం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును కలవడానికే కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

5 Replies to “జీవితంలో తొలిసారి అమెరికా ప్రయాణం…!”

Comments are closed.