కేటీఆర్​ గులాబీ పార్టీకి అధ్యక్షుడు అవుతాడా?

కేటీఆర్ కంటే కూడా మొదటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. పార్టీలో ఆయన్ని ‘ట్రబుల్​ షూటర్​’ అంటారు.

ఏ రాజకీయ పార్టీలోనైనా వర్గ పోరు తప్పనిసరిగా ఉంటుంది. వర్గాలు, గ్రూపులు లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. బీఆర్​ఎస్​ లో కూడా వర్గ పోరు ఉంది. కాకపోతే కాంగ్రెసు పార్టీ వంటి జాతీయ పార్టీలో బయటపడ్డట్టుగా వర్గ పోరు బీఆర్​ఎస్​ లాంటి ప్రాంతీయ పార్టీల్లో బయటపడదు. నిన్న హరీష్​ రావు మీడియాతో చేసిన వ్యాఖ్యలు వింటే కేటీఆర్​ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కాబోతున్నాడా? అనే అనుమానం కలుగుతోంది.

పార్టీ నాయకత్వం బాధ్యతలు కేటీఆర్​ కు అప్పగిస్తే తాను ఆయనతో కలిసి పనిచేస్తానని, ఆయనకు పూర్తిగా సహకరిస్తానని అన్నాడు కదా. ఎందుకలా అన్నాడు? ఏదో ఉంటేనే కదా అలా అంటాడు? అన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో కేటీఆర్, హరీష్‌రావుల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆ తర్వాత కేటీఆర్, కవితల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోందని వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఫుల్ సపోర్ట్ మాత్రం కొడుకు కేటీఆర్​ కు ఉంది.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్​ ఫామ్ హౌజ్​లోనే సైలెంటుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సైలెంటుగా ఉండటమంటే జనంలోకి రావడంలేదని అర్థం. అప్పుడప్పుడు రేవంత్​ రెడ్డి పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. రెండుసార్లు నామమాత్రంగా అసెంబ్లీకి వెళ్లాడు. ఈ మధ్య బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో మాట్లాడాడు. అంతే, కాంగ్రెసు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో, బయటా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతోంది ప్రధానంగా కేటీఆర్​, హరీష్​రావే. బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో కూడా కేటీఆర్​ ఫ్లెక్సీ పెట్టారు గాని హరీష్​రావుకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు.

కవిత కూడా కొంతకాలంగా బీఆర్​ఎస్​ తో సంబంధం లేకుండా జాగృతి పేరుతో సొంతంగా పోరాటాలు చేస్తోంది. బీసీ నినాదం ఎత్తుకుంది. అసెంబ్లీలో జ్యోతీరావ్ ఫులే విగ్రహం పెట్టాలని పోరాటం చేస్తోంది. సామాజిక తెలంగాణ కావాలంటూ కొత్త నినాదం అందుకుంది. ఆమె పోరాటాలకు బీఆర్​ఎస్​ మద్దతు ఉన్నట్లు కనబడటంలేదు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని అంటున్నది. తనపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసని చెప్పంది. ఆర్నెల్లు జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా నన్ను కష్టపెడతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హరీష్​ రావు పార్టీ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్​ కు అప్పగిస్తే తాను స్వాగతిస్తానన్నాడు. కేసీఆర్​ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పాడు.

ఈ విషయం తాను ఎన్నో సార్లు చెప్పానని, కేసీఆర్​ ఆదేశాలను జవదాటనని అన్నాడు. అంటే కేటీఆర్​ ను పార్టీ అధ్యక్షుడిని చేస్తారని హరీష్​రావుకు ఏమైనా సమాచారం ఉందా? లేకపోతే కేసీఆర్​ పట్ల తన విధేయతను చాటుకోవడానికి అన్నాడా? కేటీఆర్ ​పేరుకు వర్కింగ్​ ప్రసిడెంటైనా ఇప్పటికీ పార్టీలో పెత్తనం మొత్తం ఆయనదే. కొన్ని విషయాలు మినహా.. అన్నింటిలోనూ కేటీఆర్ దే పెత్తనం సాగుతుంది. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడు హరీష్ రావు.

కేటీఆర్ కంటే కూడా మొదటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. పార్టీలో ఆయన్ని ‘ట్రబుల్​ షూటర్​’ అంటారు. అయితే ఎప్పుడైతే కేటీఆర్ పార్టీలో చేరాడో అప్పట్నుంచి హరీష్ రావుకు సమాంతర నాయకుడిగా ఎదగడం మొదలైంది. రెండు పర్యాయాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశాడు. ఒకరకంగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటారు. అనేక సందర్భాల్లో పార్టీలో విభేదాలు చోటుచేసుకున్నాయని.. హరీష్ రావు వేరు కుంపటి పెడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిని హరీష్ రావు ని కొట్టి పారేశాడు.

అయితే ఇప్పుడు మరోసారి హరీష్ రావు విలేకరులకు ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్లాన్​ చేశాడు కదా. అప్పుడు కేటీఆర్​ సీఎం అవుతాడని ప్రచారం జరిగింది. ఆ సమయంలో హరీష్​ రావు ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ ​సీఎం అయితే ఆయన కింద పనిచేయడానికి తనకు ఏమీ అభ్యంతరం లేదన్నాడు. కాబట్టి ఒకవేళ కేటీఆర్​ పార్టీ అధ్యక్షుడైనా హరీష్​రావుకు ఇబ్బంది ఉండకపోవచ్చేమో.

4 Replies to “కేటీఆర్​ గులాబీ పార్టీకి అధ్యక్షుడు అవుతాడా?”

  1. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది

    రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు.

    కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కాబోతోంది.

    జూన్ 2న లేక డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుంది

    కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్న..

    అందుకే హరీష్‌రావు మానసికంగా సిద్ధమై ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు .

Comments are closed.